Share News

మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతాం

ABN , Publish Date - Aug 20 , 2024 | 06:53 AM

మహిళల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతాం

  • ఆడపడుచులకు చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు

అమరావతి-ఆంధ్రజ్యోతి/తాడేపల్లి టౌన్‌, ఆగస్టు 19: మహిళల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.

‘టీడీపీ ఆది నుంచీ మహిళల పక్షపాతి. వారికి ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను వారి పేరుపైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా టీడీపీనే. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశాం’ అని ప్రకటించారు.

రాఖీ పండుగ సందర్భంగా సోమవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో మాజీ మంత్రి పీతల సుజాత, కృష్ణా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత, కంభంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు.. బాబుకు రాఖీలు కట్టారు.


అక్కచెల్లెమ్మల సంక్షేమానికి కృషి: లోకేశ్‌

మహిళా సంక్షేమం, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు ఆయనకు హారతి ఇచ్చి రాఖీలు కట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాలా అండగా నిలిచామన్నారు. ‘నా అక్కచెల్లెళ్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సొంత అన్నలా ఆదరించారు. తమ్ముడిలా అభిమానించారు. మీ అనురాగమే నా చేతికి రక్షాబంధనం. మీ సంక్షేమం కోసం, మీకు భద్రత, గౌరవం కల్పించడం కోసం కృషి చేసి, రాఖీ పండుగ కానకగా అందించడమే మీ సోదరుడిగా నా బాధ్యత’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 06:53 AM