Share News

దమ్ముంటే అసెంబ్లీకి రండి

ABN , Publish Date - Jul 26 , 2024 | 02:57 AM

దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, రాజకీయ హత్యలపై చర్చిద్దామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి హోం మంత్రి వంగలపూడి అనిత సవాల్‌ చేశారు. హత్యకు గురయ్యారంటున్న ఆ 36 మంది పేర్లు చెబితే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ రాష్ట్రంలో ఎక్కడా

దమ్ముంటే అసెంబ్లీకి రండి

రాజకీయ హత్యలపై చర్చిద్దాం

జగన్‌కు హోం మంత్రి అనిత సవాల్‌

అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, రాజకీయ హత్యలపై చర్చిద్దామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి హోం మంత్రి వంగలపూడి అనిత సవాల్‌ చేశారు. హత్యకు గురయ్యారంటున్న ఆ 36 మంది పేర్లు చెబితే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ రాష్ట్రంలో ఎక్కడా చోటు లేనట్టుగా ఢిల్లీ వెళ్లి సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు, సానుభూతిపరులపై రాజకీయ దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాటివర్తి చంద్రశేఖర్‌, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బి.విరూపాక్షి, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు అనిత సమాధానమిచ్చారు.

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

రాష్ట్రంలో సామాన్యులపై అకారణంగా దాడులకు పాల్పడుతున్న బ్లేడ్‌బ్యాచ్‌లు, అసాంఘిక శక్తులు, గంజాయి స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అనిత చెప్పారు. ఈ తరహా నేరాలకు పాల్పడేవారిపె పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామని, రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. నేరాలకు పాల్పడేవారిని గుర్తించేందుకు ఇప్పటికే ట్రాకింగ్‌, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే మాధవి అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిస్తూ.. తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఎక్కువగా బ్లేడ్‌ బ్యాచ్‌లను గుర్తించినట్లు చెప్పారు. గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వం పోలీసులను రాజకీయ అవసరాలకే వాడుకుని ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో రాష్ట్రమంతటా గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయని తెలిపారు. ఈ సమస్యపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి ఇటీవల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

Updated Date - Jul 26 , 2024 | 02:57 AM