Share News

వైసీపీకి.. కౌంట్‌ డౌన్‌ మొదలు!

ABN , Publish Date - May 09 , 2024 | 04:11 AM

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజారాజ్యం నడవడం లేదు.. మాఫియా రాజ్యం నడుస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని ప్రకటించారు.

వైసీపీకి.. కౌంట్‌ డౌన్‌ మొదలు!

రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు.. మాఫియా రాజ్యమే: ప్రధాని

ఇసుక మాఫియా వల్లే ్లఅన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది

39 మంది చనిపోయారు.. 26 గ్రామాలు దెబ్బతిన్నాయి

ఈ మాఫియాలకు ప్రభుత్వ దన్ను.. ఎన్డీయే బుద్ధి చెబుతుంది

మంత్రులు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారు

రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి.. కలికిరిలో భారీ సభ

అనంతరం విజయవాడలో 1.8 కిలోమీటర్ల అపూర్వ రోడ్‌షో

వాహనంపై ఆయనతో బాబు, పవన్‌.. భారీగా తరలివచ్చిన జనం

రాయచోటి, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజారాజ్యం నడవడం లేదు.. మాఫియా రాజ్యం నడుస్తోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని ప్రకటించారు. ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని.. 39 మంది చనిపోయారని.. 26 గ్రామాలు దెబ్బతిన్నాయని.. ఇది విని ఆందోళన చెందానని తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు రౌడీ, గూండాయిజం చేస్తున్నారని.. మాఫియాకు ప్రభుత్వ మద్దతు ఉందని.. మాఫియాకు ఎన్డీయే సర్కార్‌ గట్టిగా బుద్ధిచెబుతుంది’ అని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా అన్నమయ్య జిల్లా కలికిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. తన ప్రసంగాన్ని.. నా ఆంధ్ర కుటుంబసభ్యులకు నమస్కారం అంటూ మొదలు పెట్టారు. తర్వాత మధ్యలోకూడా ‘ఆంధ్రప్రదేశ్‌ వికాసం.. మోదీ లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలి..’ అంటూ తెలుగులో మాట్లాడారు. అనంతరం జగన్‌ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. ‘రాయలసీమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అయితే ఇక్కడ గనులు, ఖనిజాలు ఉన్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. ప్రతిభావంతులైన యువతీయువకులు ఉన్నారు. పర్యాటక రంగానికి కూడా ఎంతో అవకాశం ఉంది. రాయలసీమ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చా.. జనం ఎందరికో ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. అయితే వాళ్లు ఆ మేరకు అభివృద్ధి చేయలేదు. సాగునీటి సౌకర్యాలు లేవు. పరిశ్రమలు లేవు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగాల కోసం ఇక్కడి వాళ్లు వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితి మార్చేందుకు ఆంధ్రలో కూడా డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి’ అని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..


జలజీవన్‌కు జగన్‌ సహకారమేదీ?

జలజీవన్‌ మిషన్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని కుళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించాం. కానీ ఈ మిషన్‌కు జగన్‌ ప్రభుత్వం సహకరించడం లేదు. దేశవ్యాప్తంగా పరిశ్రమల కారిడార్లు ఏర్పాటుచేస్తున్నాం. ఆంధ్రలో నంద్యాల-ఎర్రగుంట్ల, కడప-బెంగళూరు రైలుమార్గం పనులు చేపడతాం. పులివెందులలో అరటి ప్రాసెసింగ్‌ యూనిట్‌ తరహాలోనే.. టమోటా క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం. రాబోయే ఐదేళ్లలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలనూ ప్రోత్సహిస్తాం. ఇవన్నీ జరగాలంటే.. రాయలసీమలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలి. కాంగ్రెస్‌ పార్టీ రివర్స్‌ గేర్‌లో వెళ్తోంది. ఆర్టికల్‌ 370ని మళ్లీ తెస్తామంటోంది. రామమందిరం కేసు సుప్రీంకోర్టులో వేస్తామంటోంది. ఆయోధ్య రామాలయానికి తాళం వేస్తామంటోంది.. సీఏఏ రద్దు చేస్తామంటోంది.. వీటిని మనం సమర్థిద్దామా? ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. శక్తిమంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు దేశం కూడా దృఢంగా ఉంటుంది.

సభ సక్సెస్‌.. కూటమిలో సంతోషం

మోదీ పాల్గొన్న కలికిరి సభ పూర్తిగా విజయవంతమైంది. ఆయన ప్రసంగానికి భారీ స్పందన లభించింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి వేలాది మంది సభకు తరలివచ్చారు. ప్రధాని సుమారు 27 నిమిషాలు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, జనసేన రాష్ట్ర నాయకుడు కె.నాగేంద్రబాబు, రాజంపేట, కడప, చిత్తూరు, తిరుపతి ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 04:11 AM