అపార్ నమోదు 70 శాతం పూర్తి
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:09 AM
విద్యార్థుల పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉండే అపార్ నమోదు జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. మిగిలిన 30 శాతం అపార్ నమోదును పూర్తి చేసేందుకు పాఠశాలల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు 60 శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
అమలాపురం రూరల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉండే అపార్ నమోదు జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. మిగిలిన 30 శాతం అపార్ నమోదును పూర్తి చేసేందుకు పాఠశాలల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు 60 శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థులందరూ అపార్ ఐడీ నమోదు చేయించుకోవాలని సూచించారు. పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న స్పెషల్ ఆధార్ అప్‌డేట్ డ్రైవ్ క్యాంపును శనివారం ఆయన పరిశీలించారు. అపార్ ప్రక్రియను వేగవంతం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పాఠశాల ఆవరణను ఆయన పరిశీలించి విద్యార్థుల రక్షణార్థం తీసుకుంటున్న చర్యలను హెచ్‌ఎం కడలి ఆనందశ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు రూ.లక్షతో ఏర్పాటుచేసిన డైనింగ్ హాలు ఏర్పాట్లను ఆయన పరిశీలించి అభినందించారు. పదో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తును నిర్దేశించే పరీక్షల్లో సత్ఫలితాలను సాధించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పేద విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉప విద్యాశాఖాధికారి గుబ్బల సూర్యప్రకాశం, సమగ్రశిక్ష సీఎంవో బొరుసు వీవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.