Share News

రేపటి నుంచి కేన్సర్‌ స్ర్కీనింగ్‌

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:44 AM

ఈ నెల 14 నుంచి నాన్‌ కమ్యూనకబుల్‌ వ్యాధుల 3.0 ఇంటింటా సర్వేను ప్రారంభించిన మొత్తం 9 నెలల పాటు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. నోటి కేన్సర్‌, రొమ్ముకేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తారన్నారు.

 రేపటి నుంచి కేన్సర్‌ స్ర్కీనింగ్‌

అమలాపురం టౌన్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఈ నెల 14 నుంచి నాన్‌ కమ్యూనకబుల్‌ వ్యాధుల 3.0 ఇంటింటా సర్వేను ప్రారంభించిన మొత్తం 9 నెలల పాటు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. నోటి కేన్సర్‌, రొమ్ముకేన్సర్‌, గర్భాశయ కేన్సర్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తారన్నారు. ఇంటింటా సర్వేతో ముద్రించిన వాల్‌ పోస్టర్‌ను మంగళవారం కలెక్టర్‌ ఆవిష్కరించారు. కేన్సర్‌ స్ర్కీనింగ్‌ సర్వే తొమ్మిది నెలల పాటు వారంలో మంగళ, బుధ, గురువారాల్లో ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ ఆశ వర్కర్లు నిర్వహిస్తారన్నారు. సర్వేలో గుర్తించిన కేన్సర్‌ కేసులు, అనుమానిత కేసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తారన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.దుర్గారావుదొర, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సీహెచ్‌వీ భరతలక్ష్మి, ఎన్‌సీడీ కోఆర్డినేటర్‌ జాన్‌లెవీ పాల్గొన్నారు.

సర్కారు వారోత్సవాలు..

వికసిత భారత్‌ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అనే అంశంపై 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. వారోత్సవాల నిర్వహణపై ముద్రించిన వాల్‌ పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర సహకార యూనియన్‌ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరుగుతాయి. జిల్లాలోని వ్యవసాయ కార్మిక సహకార సంఘాలు అన్నింటినీ త్వరితగతిన కంప్యూటరీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సంఘ సభ్యులకు సొసైటీల ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరించాలన్నారు. ఈ నెల 14న సహకార సంఘ ఉద్యమం-బలోపేతం, 15న సహకార సంఘాల్లో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక సుపరిపాలన, 16న ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంలో సహకార సంఘాల పాత్ర, 17న సహకార సంస్థలు, వ్యాపార ప్రాయోజిత సంస్థలుగా రూపాంతరం చెందడం, 18న సహకార సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించుట, 19న మహిళలు, యువత, బలహీనవర్గాల కోసం సహకార సంఘాల కృషి, 20న వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర, సుస్థిరాభివృద్ధి, లక్ష్యాల సాధన అనే అంశాలపై వారోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎస్‌.మురళీకృష్ణ, ఇన్‌చార్జి ఆదిమూలం వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ రిజిస్టర్లు జి.సత్యప్రసాద్‌, సురేష్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:44 AM