సీఎస్ఆర్ నిధులు ఎక్కువ మంజూరు చేయాలి
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:14 AM
ఓఎన్జీసీ కార్యాలయాలు కాకినాడ, రాజమహేంద్రవరాల్లో ఉన్నప్పటికీ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చెప్పారు. కోనసీమ ప్రాంతానికి సీఎస్ఆర్ నిధులు ఎక్కువగా మంజూరు చేసేలా సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అమలాపురం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఓఎన్జీసీ కార్యాలయాలు కాకినాడ, రాజమహేంద్రవరాల్లో ఉన్నప్పటికీ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చెప్పారు. కోనసీమ ప్రాంతానికి సీఎస్ఆర్ నిధులు ఎక్కువగా మంజూరు చేసేలా సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఓఎన్జీసీ గతంలో హామీ ఇచ్చినట్టుగా జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలో కూడా పూర్తిగా సీఎస్ఆర్ కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఓఎన్జీసీ ప్రతినిధులతో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్‌మాధుర్, అమలాపురం, ముమ్మిడివరం, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, వేగుళ్ల జోగేశ్వరరావు, బండారు సత్యానందరావు, గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పాల్గొని ఓఎన్జీసీ జిల్లాలో చేస్తున్న సీఎస్ఆర్ కార్యకలాపాలపై సమీక్షించారు. ఓఎన్జీసీ ఈ ఏడాది మత్స్యకారులకు ఎటువంటి పరిహారం చెల్లించలేదన్నారు. ఓఎన్జీసీ ప్రాజెక్టులు నిర్మించే సమయంలో జిల్లాలోని రోడ్లు, బ్రిడ్జిలు పాడవుతున్నాయని, వాటికి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓఎన్జీసీ ప్రాజెక్టులు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా పైపులైన్లు వేస్తున్నారని, సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో పైపులైను లీకుల వల్ల, వరదల సమయాల్లో రొయ్యలు, చేపల చెరువుల్లో వ్యర్థాలు చేరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి పరిహారం చెల్లించాలన్నారు. అమలాపురం పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏ నియోజకవర్గానికి ఏ మేర నిధులు కేటాయిస్తున్నారో సంబంధిత ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మాట్లాడుతూ గత పదేళ్లలో జిల్లా నుంచి 14 వేల మంది చిన్నచిన్న ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినట్టు తెలిపారు. స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎస్ఆర్ కింద జరిగే పనులు పరిశీలించేందుకు వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఓఎన్జీసీ అసెట్ మేనేజర్ శాంతన్దాసు, కాకినాడ అసెట్ మేనేజర్ రత్నేష్ మాట్లాడుతూ గడిచిన మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో సీఎస్ఆర్ నిధుల కింద రూ.17.31 కోట్లు మంజూరు చేయగా రూ.13.35 కోట్లు కోనసీమలో ఖర్చు చేశామన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తే తదుపరి నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.