పంటు కదలదా?
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:56 AM
కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవులో రాకపోకల పునరుద్ధరణ కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిత్యం ఇబ్బందులు పడలేక దయతలచాలని అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో భక్తులు రేవులో రాకపోకలు లేక చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది.
జనం ఇబ్బందులు
కార్తీకమాసం కావడంతో భక్తుల అవస్థలు
ప్రయాణ భారం పెరిగిందని ఆవేదన
కె.గంగవరం, నవంబరు 10: కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీ రేవులో రాకపోకల పునరుద్ధరణ కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిత్యం ఇబ్బందులు పడలేక దయతలచాలని అధికారులను కోరుతున్నారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో భక్తులు రేవులో రాకపోకలు లేక చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఫెర్రీ రేవుకు కార్తీకమాసంలో ఒక ప్రాముఖ్యత ఉంది. రేవులో ఒక పక్క పవిత్ర పుణ్యక్షేత్రం కోటిపల్లి ఉంది. ఇక్కడ శ్రీ ఛాయాసోమేశ్వరస్వామి వేంచేసియున్నారు. మరో వైపున ముక్తేశ్వరం, అయినవిల్లి క్షేత్రాలు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఇక్కడ సోమేశ్వరుని దర్శించుకుని రేవుకు ఆవలపైపు ఉన్న అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకుని దర్శించుకుంటారు. అటు శ్రీ సిద్ధివినాయకుని ఆలయానికి వచ్చిన భక్తులు రేవుదాటి కోటిపల్లి శ్రీ ఛాయాసోమేశ్వరుని దర్శించుకుని, పంచారామ క్షేత్రాల్లో ఒక్కటైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. కార్తీకమాసంలో ప్రతీ సంవత్సరం భక్తులు ఆయా క్షేత్రాలను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ సంవత్సరం ఫెర్రీలో రాకపోకలు నిలిచిపోవడంతో భక్తులు, యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.
కోటిపల్లి-ముక్తేశ్వరం ఫెర్రీని గతంలో వచ్చిన వరదల కారణంగా మూసివేశారు. జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో రేవును మూసివేశారు. సుమారుగా నాలుగు నెలల నుంచి మూసి ఉంది. వరదలు తగ్గి, గోదావరిలో నీటి ఉధృతి తగ్గి 60 నుంచి 80 రోజుల కావస్తుంది. కానీ ఫెర్రీ రేవులో రాకపోకలు పునరుద్ధరించలేదు. దీనికి కారణాలు స్థానికులు రకరకాలుగా చెబుతున్నారు. స్థానిక మంత్రికి రేవు నిర్వాహకులకు పొసగడం లేదని వినికిడి. గత నెలలో రేవు నిర్వహణకు కె.గంగవరం మండల పరిషత్ అధికారులు టెండర్లు పిలిచారు. కానీ టెండర్ల వేసే సమయానికి దానిని రద్దు చేశారు. ఈ రద్దు నిర్ణయం వెనక స్థానిక మంత్రి ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రేవు నిర్వహణకు పాట నిర్వహించకపోతే. ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంది కానీ ఆ దిశగానూ చర్యలు తీసుకోవడం లేదు. ఇది అఽధికారుల నిర్లక్ష్యంగా పరిగణించవచ్చు. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. ప్రజలు ఇబ్బందులూ పడుతున్నారు. ఏదిఏమైనా రేవులో రాకపోకలు పునరుద్ధరించకపోవడం వల్ల కార్తీకమాసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం రేవులో రాకపోకలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కోటిపల్లి రేవు దాటిన తర్వాత పది నుంచి పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉంది. అందువల్ల రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లోని ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రేవు మూసివేయడంతో ఈ నియోజకవర్గాల్లో ప్రజలు సుమారు 50 నుంచి 60 కిలోమీటర్లు అదనపు ప్రయాణం చేస్తేగానీ జిల్లా కేంద్రానికి చేరుకోలేకపోతున్నారు. దీని వల్ల ఆదాయం, శ్రమ, సమయం వృధా అవుతున్నాయి.