Share News

కూటమి నేతలకు నామినేటెడ్‌ షాక్‌

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:07 AM

కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్‌ పోస్టుల రెండో విడత జాబితా పలువురికి ఝలక్‌ ఇచ్చింది. మలివిడత నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో టీడీపీకి చెందిన ఓ కీలక నేతను మాత్రమే పదవి వరించింది. ఆశలు పెంచుకున్న ఎందరో నేతలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. పార్టీ అఽధిష్ఠానం తమ పేర్లను పట్టించుకోకపోవడంపై కొందరు టీడీపీ నేతలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు

 కూటమి నేతలకు నామినేటెడ్‌ షాక్‌

ఇప్పటివరకు తమకు పదవులు వస్తాయని

ఊహల పల్లకిలో ఊరేగిన నాయకులు

రెండో జాబితాలో ఒకే ఒకరికి చోటు

అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అఽథారిటీ చైర్మన్‌గా అల్లాడ స్వామి

(అమలాపురం-ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్‌ పోస్టుల రెండో విడత జాబితా పలువురికి ఝలక్‌ ఇచ్చింది. మలివిడత నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో టీడీపీకి చెందిన ఓ కీలక నేతను మాత్రమే పదవి వరించింది. ఆశలు పెంచుకున్న ఎందరో నేతలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. పార్టీ అఽధిష్ఠానం తమ పేర్లను పట్టించుకోకపోవడంపై కొందరు టీడీపీ నేతలు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. శనివారం 59 కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా నుంచి అమలాపురం పట్టణానికి చెందిన టీడీపీ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామినాయుడును అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్వామినాయుడు మినహా జిల్లాలో మరెవ్వరికీ నామినేటెడ్‌ పోస్టుల మలి విడత జాబితాలో స్థానం దక్కలేదు. దాంతో అందరూ ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు పార్టీ అధిష్ఠానాల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో అంకిత భావంతో కొనసాగుతున్న స్వామినాయుడు అంచెలంచెలుగా పార్టీలో పదవులు నిర్వహిస్తూ ప్రస్తుతం జిల్లా పార్టీ కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు. గతంలో అమలాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. మిగిలనవన్నీ పార్టీ పదవులే. అయితే ఈ సారి కీలకమైన అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ పదవి లభించడంతో టీడీపీ శ్రేణులతో పాటు ఆయన వర్గీయుల్లో హార్షాతిరేకాలు మిన్నంటాయి. సౌమ్యుడుగా ఉండే స్వామినాయుడు రాజకీయంగా కీలకనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు జిల్లాలో అనేకమంది కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడమే ఇప్పుడు ప్లస్‌ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 59 మందిని కార్పొరేషన్‌ చైర్మన్లు పదవులు వరించగా వాటిలో కోనసీమ నుంచి మాత్రం స్వామినాయుడుకే అవకాశం దక్కడం వెనుక ఆయన రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా ఫలించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రకటన వెలువడిన వెంటనే స్వామినాయుడు ఇంటి వద్ద అభిమానుల కోలాహలం చోటు చేసుకుంది. అనేక మంది పార్టీ నాయకులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజికవర్గాలకు చెందిన కూటమి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే దానిపై పార్టీ నేతలతో తర్జనభర్జన చేస్తున్నారు. ఈసారైనా తమ పేర్లను అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనే దానిపై నేతలు ఆలోచనలో పడ్డారు. పార్టీ కోసం కష్టపడ్డ తమకు ఏదో అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నామని పలువురు నాయకులు చెబుతున్నారు. కొందరైతే ఇంకా చాలా పదవులను భర్తీ చేయలేదని వాటిలో తమకు అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 01:07 AM