భారీగా రేషన్ బియ్యం మాయం
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:47 AM
పేదల బియ్యాన్ని కొంతమంది అధికారులు మేధావితనంతో పక్కదారి పట్టించారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా మాయం చేశారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మొత్తానికి ఈ అవినీతి బాగోతం అధికారుల బదిలీలతో బయటపడింది. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు..
అంబాజీపేట(ఆంధ్రజ్యోతి): పేదల బియ్యాన్ని కొంతమంది అధికారులు మేధావితనంతో పక్కదారి పట్టించారు. అలాగే నిత్యావసర సరుకులను కూడా మాయం చేశారు. ఏళ్ల తరబడి ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మొత్తానికి ఈ అవినీతి బాగోతం అధికారుల బదిలీలతో బయటపడింది. ఇటీవల కొత్తగా వచ్చిన అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఎంఎల్‌ఎస్ (మండల లెవెల్ సర్వీస్) స్టాక్ పాయింట్‌లో కోనసీమ పరిధిలోని అమలాపురం, అంబాజీపేట, అల్లవరం, ఉప్పలగుప్తం అయినవిల్లి మండలాలకు సంబంధించి రేషన్ డిపో, అంగన్‌వాడీ, వివిధ పాఠశాలలకు బియ్యాన్ని సరఫరా చేస్తుంటారు. అంబాజీపేట మార్కెట్‌యార్డు శివారులో సివిల్ సప్లై ద్వారా స్టాక్ పాయింట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ స్టాక్ పాయింట్‌కు నిత్యం లారీల ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులు దిగుమతి, ఎగుమతి అవుతుంటాయి. అయితే గతంలో చేసిన అధికారులు కోట్లాది రూపాయల బియాన్ని పక్కదారి పట్టించారు. లెక్కల్లో అవకతవకలకు పాల్పడ్డారు. గత కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతున్నా బయటపడలేదంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం ఉందో అర్థమవుతోంది. ఇలా మొత్తతం అంబాజీపేట స్టాక్ పాయింట్ నుంచి సుమారు 366 టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు తెలిసింది. వీటి విలువ సుమారు రూ.1.70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేసిన ఓ అధికారి ఈ అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన బదిలీల్లో కొత్తగా వచ్చిన అధికారి ఈ లెక్కల తారుమారు, భారీ అవినీతిని చూసి హడలిపోయారు. బాధ్యతలు అప్పగించిన తర్వాత అక్కడ ఉన్న సరుకుకు రిజిస్టర్‌కు మధ్య భారీ వ్యత్యాసాలు కనపడడంతో అతను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగుచూసింది. ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారించగా అక్కడ భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాఽథమికంగా తెలిసింది. అంబాజీపేట స్టాక్ పాయింట్‌లో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన అధికారిని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అంబాజీపేట ఎమ్మెస్వోగా పనిచేస్తున్న సత్యనారాయణను స్టాక్ పాయింట్ ఇన్‌చార్జిగా నియమించారు. ఇటీవల ఎమ్మెస్వోగా పనిచేస్తున్న సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించి స్టాక్ పాయింట్‌లో ఉన్న సరుకులు, బియ్యం బస్తాల నిల్వలు, రికార్డులను సరిచూసుకున్నారు. అయితే సోమవారం స్టాక్ పాయింట్‌లో పనిచేస్తున్న కింద స్థాయి కాంట్రాక్టు ఉద్యోగులు విధులు హాజరు కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లై డీఎంను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా స్పందించలేదు. అంబాజీపేట స్టాక్ పాయింట్‌లో సుమారు 380 టన్నులకు కేవలం 14 టన్నులు మాత్రమే ఉండటంతో జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఏర్పడి రెండేళ్లు పూర్తి అయ్యింది. జిల్లా కేంద్రం నుంచి అంబాజీపేట స్టాక్ పాయింట్ సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికి ఉన్నతాధికారులు అవినీతిని గుర్తించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి కొనసాగుతుంది.. ఇందులో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హస్తం ఉందా అనే కోణాల్లో విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ అధికారుల దర్యాప్తునకు ఆదేశించి నివేదికను తీసుకున్నట్లు సమాచారం.