AP Elections: భువనేశ్వరి పేరిట డీప్ ఫేక్ ఆడియో.. ఇదంతా చేసిందెవరు..!?
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:47 AM
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం వైసీపీ శ్రేణులకు అలవాటుగా మారిపోయింది.
దళితులను అవమానించారంటూ దుష్ప్రచారం
వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో వైరల్
చర్యలు తీసుకోవాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదు
సజ్జల భార్గవ్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్
అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం వైసీపీ (YSR Congress) శ్రేణులకు అలవాటుగా మారిపోయింది. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని ఫేక్ ప్రచారం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari) పేరుతో డీప్ ఫేక్ ఆడియోను వైసీపీ వర్గాలు శుక్రవారం ప్రచారంలోకి తెచ్చాయి. ఆమె దళితులను అవమానించారంటూ వైసీపీ అనుకూల సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేశారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ఇటీవల రాష్ట్రమంతా పర్యటించిన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలకు మహిళల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో ఈసారి ఆమెను లక్ష్యంగా చేసుకొని వైసీపీ వర్గాలు ఆడియోను సృష్టించారు.
డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఈ ఆడియోను తయారు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ వ్యక్తులు నిజంగా మాట్లాడినట్లుగానే నకిలీ ఆడియోను రూపొందించగల డీప్ ఫేక్ టెక్నాలజీని అందుబాటులోకి వచ్చింది. వినేవారికి అచ్చం భువనేశ్వరి గొంతులాగా ఉండేలా ఆడియో తయారు చేశారు. ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడారో ఇందులో ఎక్కడా లేదు. ఎవరినో విపరీతంగా తిడుతున్నట్లుగా మాటలు ఉన్నాయి. దళితులను తిట్టినట్లు వైసీపీ వర్గాలు ప్రచారం చేసినా అందులో ఎక్కడా దళితులన్న పదం లేదు. ఈ ఆడియాకు కొనసాగింపుగా ఆ తర్వాత మరో వీడియో తయారు చేసి వదిలారు. ఏబీఎన్ చానల్ లోగో పెట్టి మరీ దీనిని తయారు చేశారు. భువనేశ్వరి తననే తిట్టారని, దళితులను కాదని చంద్రబాబు వివరణ ఇచ్చినట్లుగా ఈ వీడియో ఉంది. ఆ వార్తను ఏబీఎన్ చానల్ ప్రసారం చేసినట్లు లోగోను పెట్టి వైసీపీ అనుకూల సామాజిక మాధ్యమాల్లో తిప్పారు.
ఈసీకి ఫిర్యాదు
డీప్ ఫేక్ ఆడియో వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు దళిత ఓటర్లను తప్పుదోవ పట్టించేలా వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి సచివాలయంలో సీఈవో ముఖే్‌షకుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు కలిసి ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రాం వేదికలో వైసీపీకి అనుకూలంగా ఉండే జగన్ కనెక్ట్స్ అనే ఖాతా ద్వారా ఈ ఆడియో ప్రచారంలోకి వచ్చిందని, దీని వెనుక వైసీపీ సోషల్ మీడియా విభాగం ఉందని ఆరోపించారు. సజ్జల భార్గవ్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేస్తోందని అన్నారు. తప్పుడు ప్రచారం చేయిస్తున్న సజ్జల భార్గవ్‌రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. ఆడియోలోని గొంతు భువనేశ్వరిది కాదని స్పష్టం చేశారు.