YSRCP: వైసీపీ సోషల్ మీడియా మీటింగ్.. యువతి ప్రశ్నకు కంగుతిన్న వైఎస్ జగన్!!
ABN , Publish Date - Apr 24 , 2024 | 03:37 AM
‘‘సర్... మీరు పొలిటీషియన్ అవకముందు ఒక మంచి వ్యాపారవేత్త! ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? యువత మీలా ఆంత్రప్రెన్యూర్ కావడానికి ఏవైనా సలహాలు ఇస్తారా..?
వ్యాపారవేత్తగా తన ప్రస్థానంపై జగన్ మౌనం
యువతి ప్రశ్నకు దిక్కులు చూసిన ముఖ్యమంత్రి
సజ్జల భార్గవ కల్పించుకుని సొంత సమాధానం
ఆంత్రప్రెన్యూర్‌గా జగన్ జీవితం ఇన్‌స్పైరింగట
ఇంటర్నెట్‌లో చూసి తెలుసుకోవాలని సలహా
(విశాఖపట్నం/అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘సర్... మీరు పొలిటీషియన్ అవకముందు ఒక మంచి వ్యాపారవేత్త! ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? యువత మీలా ఆంత్రప్రెన్యూర్ కావడానికి ఏవైనా సలహాలు ఇస్తారా?’’... విశాఖలో ఒక యువతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) అడిగిన ప్రశ్న ఇది! దీనికి సమాధానం చెప్పలేక ఆయన సతమతమయ్యారు. తనదైన మార్కు నవ్వులు చిందిస్తూ... వేదికపైన ఉత్తర దక్షిణాలు చూశారు! ‘ఏమని చెప్పను చెల్లెమ్మా!’ అన్నట్లుగా మౌనం వహించారు! మంగళవారం విశాఖపట్నం ఆనందపురంలోని ఒక కన్వెన్షన్ హాలులో వైసీపీ సోషల్ మీడియా విభాగంతో జగన్ సమావేశమయ్యారు. ఒక యువతి ‘మీలాగా మంచి ఆంత్రప్రెన్యూర్ అయ్యేందుకు యూత్‌కు సలహాలు ఇవ్వండి’ అని అడిగారు. అర్థమైనా కానట్టు జగన్ మొహం పెట్టగా.. వైసీపీ సోషల్ మీడియా సారథి సజ్జల భార్గవ రెడ్డి... ఆ యువతి తెలుగులో అడిగిన ప్రశ్నకు కొంత ఇంగ్లీషు కలిపి వివరించారు. కానీ... జగన్ దీనికి బదులివ్వకుండా నవ్వుతూ దిక్కులు చూశారు. దీంతో... సజ్జల భార్గవరెడ్డి తన ‘సమయస్ఫూర్తి’ ప్రదర్శించారు. ‘‘సీఎం గారి తరఫున నేనే బదులిస్తాను. ఆయన రాజకీయ ప్రస్థానం ఎంత ఇన్‌స్పైరింగో... ఆంత్రప్రెన్యూర్ జర్నీ కూడా అంతే ఇన్‌స్పైరింగ్. ఇంటర్నెట్‌లో చూడండి! ఆయన జీవితం ఒక పాఠంలాంటిది’ అన్నారు.
ఇంటర్నెట్‌లో ఏం చూడాలబ్బా!
వ్యాపారవేత్తగా జగన్ జర్నీ ఎప్పుడు మొదలైనా... ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే అది ‘ట్రాక్’లో పడింది. అంతకుముందు ఆయన కర్ణాటకలో ‘సండూర్ పవర్’ అనే మూతపడిన విద్యుత్ ప్రాజెక్టును కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చిన్నాచితక జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని అంటారు. అంతకుమించి జగన్ చేసిన వ్యాపారాలేమిటో ఎవరికీ తెలియదు. కానీ... వైఎస్ సీఎం కాగానే సీన్ మారిపోయింది. జగన్ అనేక కంపెనీలు ఏర్పాటు చేశారు. ముడుపులే పెట్టుబడులుగా చకచకా ఎదిగారు. ‘క్విడ్‌ప్రోకోయే ఆయన సీక్రెట్ ఆఫ్ సక్సెస్’ అని సీబీఐ, ఈడీ తేల్చేశాయి. ‘జగన్ జీవిత పాఠాల నుంచి యువత చాలా నేర్చుకోవాలి’ అని సజ్జల భార్గవ రెడ్డి చెప్పడం, ఇంటర్నెట్‌లో చూసి తెలుసుకోవాలనడం మొత్తం ఎపిసోడ్‌కే హైలైట్! ఆయన చెప్పినట్లు జగన్ గురించి ఇంటర్నెట్‌లో చూస్తే సీబీఐ చార్జిషీట్లు, క్విడ్‌ప్రోకో కథలే కనిపిస్తాయి!
Read Latest Election News and Telugu News