Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:08 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) జూన్-09న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే..
న్యూ ఢిల్లీ/అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) జూన్-09న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు తేదీ మారిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్-12న ‘ నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ప్రమాణం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. జూన్-09న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్నారని సమాచారం. అందుకే ఆ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంటుందని.. వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏడో తారీఖున ప్రమాణంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కారణమిదేనా..?
కాగా.. ఇవాళ ఎన్డీఏ సమావేశానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బిజిబిజీగా గడుపుతున్నారు. బాబు వెంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. అయితే.. ఈ నెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి మళ్లీ చంద్రబాబు, పవన్ ఢిల్లీ రానున్నారు. అదే రోజు బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. అనంతరం ఎన్డీఏ భేటీ కూడా జరగనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఎన్డీఏ భేటీకి కూటమిలో ఎంపీలు అంతా హాజరుకావాలని నిర్ణయించారు. ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ నేతలు కోరనున్నారు. దీంతో.. ఒక్కరోజు గ్యాప్‌లో అనగా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు తాను అనుకున్న డేట్, సమయం (జూన్-12) మార్చుకున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.