AP Elections: నెల్లూరులో వైసీపీ ఎదురీత.. కంచుకోట కూలుతోందా..!?
ABN , Publish Date - May 08 , 2024 | 06:44 AM
నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీకి పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.
నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీకి (YSR Congress) పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.. నియోజకవర్గంతో సంబంధం లేని నాయకుడు విజయసాయిరెడ్డి చెమటోడుస్తున్నారు. దీంతో ఫలితం ఏకపక్షం అయిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
పట్టుబిగించిన తెలుగుదేశం
వేమిరెడ్డి రాకతో పార్టీలో జోష్
వైసీపీ నేతల్లో కొరవడిన ఐక్యత
నెల్లూరు పార్లమెంటు స్థానం ప్రతి ఎన్నికలోనూ హాట్‌హాట్‌గా ఉంటుంది. ఈసారి మాత్రం టీడీపీ కూటమికి ఏకపక్షంగా విజయం దక్కే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి తరఫున బరిలో నిలవడమే. వైసీపీ నుంచి బరిలో ఉన్న విజయసాయిరెడ్డి స్థానికుడే అయినా.. కీలక నేతలు ఆయనకు దూరంగా ఉన్నారు. దీనికితోడు ప్రజల నుంచి ఆశించిన స్పందనలేదు.
అదే సమయంలో అభ్యర్థి పరంగా, అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థుల కూర్పు ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. రెండు నెలల క్రితం వరకు టీడీపీకి పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో వైసీపీ నుంచి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి(వీపీఆర్) టీడీపీలో చేరారు. వెంటనే చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. వీపీఆర్ తనతోపాటు వైసీపీ క్యాడర్‌ను తీసుకురావడంతో అధికార పార్టీ డీలాపడిపోయింది.
నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వీపీఆర్ అసెంబ్లీ అభ్యర్థులకు బలమైతే, ఎమ్మెల్యే అభ్యర్థులు వీపీఆర్‌కు బలంగా మారారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి కొత్త చరిత్ర సృష్టిస్తుందనే ధీమా వ్యక్తమవుతోంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో కొన్ని సారూప్యతలు కనిపిస్తుండగా, కొన్ని వైరుధ్యాలు కనిపిస్తున్నాయి.
టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇద్దరూ జిల్లాకు చెందిన వారే. ఇద్దరూ వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఇద్దరూ ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారే. ఇద్దరూ వైసీపీ అధినేత జగన్‌కి అత్యంత సన్నిహితంగా మెలిగినవారే.
సేవాతత్వం వీపీఆర్‌కు ప్లస్
వీపీఆర్ దాతగా, ఆధ్యాత్మికవేత్తగా ప్రజల్లో గుర్తింపు పొందారు. జిల్లాలో 110కి పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు స్థాపించారు. నిరుపేద పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో హైస్కూల్ స్థాపించి ఎనిమిదేళ్లుగా నడుపుతున్నారు. పాఠశాల పక్కనే ఆసుపత్రి స్థాపించి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తున్నారు. ఆలయాల పునరుద్ధరణకు భారీ విరాళాలు అందజేశారు. ఎన్నో అనాఽథ శరణాలయాలకు సాయం అందిస్తున్నారు.
విజయసాయికి నెగిటివ్ షేడ్
విజయసాయి రెడ్డి.. ప్రస్తుత ప్రభుత్వంలో నంబర్-2గా గుర్తింపు పొందినా జిల్లాకు ఒక్క పని కూడా చేయలేదు. చివరికి దత్తత తీసుకున్న సొంతూరును కూడా అభివృద్ధి చేయలేకపోయారనే విమర్శలున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2గా జైలు జీవితం గడిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విశాఖలో ప్రతిపక్ష పార్టీ నేతల ఆస్తుల ధ్వంసం నుంచి ఆక్రమణల వరకు లెక్కలేనన్ని ఆరోపణలను ఎదుర్కొన్నారు.
వీటిని టీడీపీ ప్రచారం చేస్తుండడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు ఒక్కరే విజయసాయి కోసం పనిచేస్తున్నారు. కీలకమైన నెల్లూరు సిటీలో వైసీపీ పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.
- నెల్లూరు, ఆంధ్రజ్యోతి
వీపీఆర్ బలాబలాలు
కూటమి సహకారం, బలమైన కేడర్
సేవా కార్యక్రమాలు, జిల్లాలో మంచి పేరు.
ఎమ్మెల్యే అభ్యర్థుల సంపూర్ణ సహకారం.
వైసీపీలో ఒక వర్గం టీడీపీలో చేరడం.
ఆర్థికంగా బలంగా ఉండడం.
సాయిరెడ్డి బలాబలాలు
కీలక నేతలు పార్టీకి దూరం కావడం.
నాయకులందరితో కనెక్ట్ కాలేక పోవడం.
రెడ్డి సామాజిక వర్గంలోనే వ్యతిరేకత.
సామాజిక వర్గాల వారీగా ఓటర్లు
ముస్లిం మైనారిటీలు 2.2 లక్షలు
రెడ్లు 1.60 లక్షలు
యాదవులు 75 వేలు
కాపులు 1.50 లక్షలు
కమ్మ 1.40 లక్షలు
ఎస్సీ, ఎస్టీలు 2.50 లక్షలు