AP Elections: ఉండి నుంచే రఘురామ పోటీ
ABN , Publish Date - Apr 19 , 2024 | 03:58 AM
గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు..
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రామరాజు
నలుగురు అసెంబ్లీ అభ్యర్థుల మార్పు
దెందులూరుపై కొనసాగుతున్న సస్పెన్స్
పార్టీ అభ్యర్థులకు ఎల్లుండి బీ-ఫాంలు
రేపు నెల్లూరు జిల్లాలో బాబు ప్రజాగళం
అమరావతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు. తాజా మార్పుల ప్రకారం నరసాపురం సిటింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు (Raghu Ramakrishnam Raju) అదే జిల్లా పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. ఆ ఎంపీ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లింది. రఘురామ కోసం ఆ సీటును తమకివ్వాలని చంద్రబాబు కోరినా బీజేపీ నాయకత్వం సమ్మతించలేదు. తమ అభ్యర్థి శ్రీనివాస వర్మకు గురువారం బీ-ఫాం కూడా అందజేసింది. దీంతో రఘురామను ఉండి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. అక్కడ టీడీపీ తమ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఇదివరకే ప్రకటించింది. ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేసే బాధ్యతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు అప్పగించారు. ఈ క్రమంలో రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించారు.
అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది. ఇక్కడ అంతకు ముందు ప్రవాసాంధ్రుడు పైలా ప్రసాదరావుకు సీటిచ్చారు. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆయన్ను మార్చి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర(ఎస్సీ)లో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమార్‌ను మార్చాలని నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ఇవ్వనున్నారు. ఈయనది అనంతపురం జిల్లాయే. ఈయన్ను తొలుత బాపట్ల (ఎస్సీ) లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా.. కుదరలేదు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా మార్చబోతున్నారు. ఆయన ప్రచార రంగంలో వెనుకబడిపోయారు. పైగా ప్రత్యర్థి శిబిరంతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్ సతీమణి సరళారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, చిప్ తయారీ బహుళ జాతి సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న కొండా నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. శుక్రవారం తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది.
దెందులూరుపై ఉత్కంఠ
ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. తమకు ఇచ్చిన అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇవ్వాలంటే తమకు దెందులూరు ఇవ్వాలని బీజేపీ నాయకత్వం షరతు విధించింది. అయితే ఇక్కడ టీడీపీ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఒత్తిడితో ప్రభాకర్‌కు నచ్చజెప్పడానికి టీడీపీ నాయకత్వం పార్టీ నేతలను ఆయన వద్దకు పంపింది. కానీ ఆయన తప్పుకోవడానికి ఇష్టపడలేదు. అక్కడి పార్టీ నేతలు కూడా ఆయనకే గట్టిగా మద్దతిస్తున్నారు. ఏలూరు లోక్‌సభ అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ సైతం చింతమనేనిని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
మరో 3-4 మార్పులు?
ఇంకో 3-4 స్థానాల్లో మార్పులు చేయాలని టీడీపీ నాయకత్వం యోచిస్తోంది. కడప జిల్లా కమలాపురం, తిరుపతి జిల్లా వెంకటగిరిలో పార్టీ ఇన్చార్జులకు బదులు వారి పిల్లలకు టికెట్లు ఇచ్చారు. ఈ రెండు చోట్లా తిరిగి వారి తండ్రులకే ఇస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. మార్పులు ఏవైనా ఉంటే శనివారం నాటికి స్పష్టత వస్తుందని టీడీపీ వర్గాలు తెలిపాయి.
ప్రతి ఇంటికీ 4 సార్లు వెళ్లాలి!
పోలింగ్ ముగిసేలోపు అసెంబ్లీ అభ్యర్థులు తమ పరిధిలోని ప్రతిఇంటికీ కనీసం నాలుగుసార్లు వెళ్లాలని చంద్రబాబు నిర్దేశించారు. పార్టీ ఇచ్చిన హామీలను వారికి వివరించాలని పార్టీ జోనల్ ఇన్చార్జులతో భేటీలో ఆదేశించారు. ‘అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లేలా చూడాల్సిన బాధ్యత మీది. జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలి. అవి మన సొంత నియోజకవర్గాలుగా భావించి ఆ అభ్యర్థులను గెలిపించి తీసుకురావాలి. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఈనెల రోజులూ పార్టీ పర్యవేక్షక యంత్రాంగం 24 నాలుగు గంటలూ పనిచేయాలి’ అని ఆయన స్పష్టం చేశారు.
21న టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు
టీడీపీ నాయకత్వం తమ అభ్యర్థులకు బీ ఫారాలను ఈ నెల ఆదివారం (21న) పంపిణీ చేయనుంది. తమ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ఆ రోజున కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. కాగా.. శనివారం చంద్రబాబు పుట్టినరోజు. ఆయన ఆ రోజు నెల్లూరు జిల్లాలో ప్రజా గళం సభల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేపల్లి, ఆత్మకూరు, గూడూరు నియోజకవర్గాల్లో ఆయన సభలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటివరకూ రోజుకు రెండు సభలు పెడుతున్నారు. ఆ రోజు మాత్రం మూడు పెట్టే ఆలోచన నడుస్తోంది.