Share News

Chandrababu Cabinet: బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ.. లోకేశ్, పవన్ సంగతేంటి..!?

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:49 AM

చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి.

Chandrababu Cabinet: బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ.. లోకేశ్, పవన్ సంగతేంటి..!?

  • ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌!

  • లోకేశ్‌, నారాయణ, మనోహర్‌లకు బెర్తులు ఖరారు

  • పూర్తి మంత్రివర్గమే కొలువుదీరుతుందని అంచనాలు

  • నేడు శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక

  • 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

అమరావతి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు (Chandrababu) మంత్రివర్గ కూర్పుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంత్రివర్గంలో చేరుతున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారని కూటమి వర్గాలు తెలిపాయి. ఆయనతోపాటు అదే పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా మంత్రివర్గంలో చేరనున్నారు. ఆ పార్టీ నుంచి మరొకరికి కూడా మంత్రివర్గంలో స్ధానం ఇవ్వడానికి అవకాశం ఉంది. మూడో ఎమ్మెల్యేకు ఇప్పుడే అవకాశం ఇస్తారా లేక తదుపరి విస్తరణలో చాన్స్‌ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. బీజేపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభించబోతోందన్నది ఇంకా తేలలేదు. దీనిపై నిర్ణయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోవాల్సి ఉంది. మంగళవారం దీనిపై స్పష్టత వస్తుందని అనుకొంటున్నారు. తన మంత్రివర్గ బృందంతో కలిసి చంద్రబాబు ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 నిమిషాలకు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.


chandrababu PRamanam.webp

ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక...

టీడీపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఆయన తనయుడు లోకేశ్‌, మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేరడం ఖరారైంది. వీరుగాక టీడీపీ నుంచి ఎవరెవరికి అవకాశం వస్తుందన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మంది చంద్రబాబును కలిసి తమ ఆసక్తిని వ్యక్తం చేసినా, ఆయన నుంచి వారికి ఏ సంకేతాలూ అందలేదు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ పోటీ నెలకొంది. రాజ్యాంగ పరిమితుల ప్రకారం చంద్రబాబు మంత్రివర్గంలో పాతిక మంది వరకూ ఉండవచ్చు. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో పదిహేను శాతానికి మించి మంత్రులు ఉండరాదని రాజ్యాంగ పరిమితులు సూచిస్తున్నాయి. ఇందులో మిత్రపక్షాలకు ఐదు లేక ఆరు మంత్రి పదవులను టీడీపీ ఇవ్వనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ టీడీపీ నాయకత్వం తన కసరత్తును చేస్తోంది. ప్రాతినిఽథ్యం ఇచ్చే సమయంలో కొత్త జిల్లాలను కాకుండా ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకొంటున్నారు. మిత్రపక్షాలతో కూడిన మొత్తం మంత్రివర్గంలో బీసీ వర్గాలవారికి ఎనిమిది, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి రెండు, ఎస్టీలకు ఒకటి, ముస్లిం, మైనారిటీ వర్గానికి చెందిన వారికి ఒకటి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మంత్రివర్గంలో ఇవి సగ భాగానికి వస్తాయి. మిగిలిన వాటిని కమ్మ, కాపు, రెడ్డి, వైశ్య తదితర సామాజిక వర్గాల వారికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నా రు.

మొత్తం మంత్రివర్గంలో మహిళలకు కనీసం మూడు బెర్తులు దక్కుతాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రాతినిఽథ్యం కల్పిస్తూ కసరత్తును చేయాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన తొలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొమ్మిది మందితో చేస్తారా లేక పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది ఇంకా తేలలేదు. మంత్రివర్గ ఎంపికను ప్రమాణ స్వీకారం జరిగే రోజు ఉదయం వరకూ రహస్యంగా ఉండటం గతంలో టీడీపీలో అనవాయితీ. ఈసారి మాత్రం జాబితాను ముందుగానే ఖరారు చేసి, ఎంపిక చేసిన మంత్రులతో మంగళవారం సాయంత్రం ఒక సమావేశం కూడా నిర్వహించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపన్యాసాలు ఏవీ ఉండవని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని కూడా మాట్లాడబోరని, పేర్కొన్నాయి.


నేడు కూటమి ఎమ్మెల్యేల సమావేశం

టీడీపీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశాన్ని మంగళవారం ఉదయం విజయవాడలోని బృందావన్‌ కాలనీలో ఉన్న ఎ కన్వెన్షన్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నారు. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకొంటున్నట్లు ఈ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదిస్తారు.

17 నుంచి అసెంబ్లీ!

నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏకాదశి కావడం వల్ల ఆ రోజు మంచిదని కొందరు సూచించారు. ఈ సమావేశాలు సుమారు నాలుగు రోజులు జరిగే అవకాశం ఉంది. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండో రోజు స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల హామీ మేరకు లాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఉపసంహరణ బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

స్టైల్‌ మార్చిన చంద్రబాబు

చంద్రబాబు స్టైల్‌ మార్చారు. తన కాన్వాయ్‌ వెళ్తున్నప్పుడు రహదారి పక్కన నిలబడిన వారికి ఆయన వాహనం లోపలి నుంచే అభివాదం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు సోమవారం గన్నవరం నుంచి కాన్వాయ్‌లో ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు. చంద్రబాబు వాహనం లోపలి నుంచి రోడ్డు పక్క ఉన్న వారికి చేతులు ఊపుతూ అభివాదం చేశారు.

Updated Date - Jun 11 , 2024 | 09:01 AM