Share News

ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతుల మధ్య ఘర్షణ

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:56 PM

స్పాంజ్‌ ఐరన ఫ్యాక్టరీ యజమానులు, రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పొల్యూషన అధికారులు వెనుదిరిగారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతుల మధ్య ఘర్షణ
వాగ్వాదానికి దిగిన ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులు

వెనుదిరిగిన పొల్యూషన అధికారులు

బొమ్మనహాళ్‌, జూలై 25: స్పాంజ్‌ ఐరన ఫ్యాక్టరీ యజమానులు, రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పొల్యూషన అధికారులు వెనుదిరిగారు. మండల పరిధిలోని నేమకల్లు గ్రామశివారులో ఉన్న స్పాంజ్‌ ఐరన ఫ్యాక్టరీల ద్వారా వచ్చే పొల్యూషనతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, పరిహారం సైతం అరకొరగా అందించి చేతులుదులుపుకున్నారని ఆరోపిస్తూ రైతులు, సీపీఐ నాయకులు గతవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో గురువారం పొల్యూషన అధికారులు మహేష్‌, వెంకటేశు పంట భూములను పరిశీలించేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు పొలాల వద్దకు వెళ్లారు. వారితో సీపీఐ నాయకులు ఉన్నారు. ఇదే సందర్భంలో అక్కడకు ఫ్యాక్టరీ యాజమాన్యం చేరుకుంది. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని చూసి మీరెందుకు ఇక్కడకు వచ్చారని సీపీఐ నాయకులు ప్రశ్నించారు. మీకు ఇక్కడ ఏం పని అని ఫ్యాక్టరీ యాజమాన్యం సీపీఐ నాయకులను అడిగారు. తమ తరఫున మాట్లాడేందుకు వచ్చారని రైతులు సమాధానమిచ్చారు. ఈ సందర్భంలో రైతులు, ఫ్యాక్టరీ యాజమాన్యానికి మధ్య వాదులాట జరిగింది. ఇదికాస్త ఘర్షణ వాతావరణానికి దారితీసింది. దీంతో పంట పొలాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే పొల్యూషన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొల్యూషన ద్వారా పంట పొలాలు దెబ్బతినడమేకాకుండా అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. అంతేకాకుండా పరిహారాన్ని సైతం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

Updated Date - Jul 25 , 2024 | 11:56 PM