Share News

రికార్డుల మార్పుపై రైతుల ధర్నా

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:54 PM

తమ అనుభవంలో ఉన్న దాదాపు 11.23 ఎకరాల భూమిని మరో వ్యక్తి పేరున రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయడంపై గుట్టిపల్లికి చెందిన బాధిత రైతులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు.

రికార్డుల మార్పుపై రైతుల ధర్నా
తహసీల్దార్‌తో రైతుల వాగ్వాదం

పాఠశాల స్థలంతోపాటు

11 ఎకరాలను ఓడీసీ

మండల వాసి పేరున మార్చిన వైనం

ఎలా మారుస్తారంటూ రైతుల ఆందోళన

గోరంట్ల, జూలై 25: తమ అనుభవంలో ఉన్న దాదాపు 11.23 ఎకరాల భూమిని మరో వ్యక్తి పేరున రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయడంపై గుట్టిపల్లికి చెందిన బాధిత రైతులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు. గోరంట్ల మండలంలోని గుట్టిపల్లిలో సర్వేనెంబర్‌ 512-2లోని 1.16ఎకరాల ప్రభుత్వ పాఠశాల స్థలంతోపాటు పలువురు రైతులకు సంబంధించిన మొత్తం 11.23ఎకరాల అనుభవంలో ఉన్న భూమిని ఓడీసీ మండలంలోని కుసుమవారిపల్లికి చెందిన కొండే ఈశ్వర్‌రెడ్డి పేరున వనబీలో ఈనెల 22న అధికారులు మార్పులు చేశారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ అక్బల్‌బాషాతో తమగోడును వెల్లబోసుకున్నారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బాలక్రిష్ణచౌదరి, నరేష్‌, రాజారెడ్డి, మర్రెడ్డిపల్లిత నరసింహులు రైతులకు మద్దతు పలికారు. అర్హులైనవారికి వనబీ మార్చడానికి సంవత్సరాలతరబడి తిప్పుకుంటున్నారని, అలాంటిది అతడి పేరుమీద కొన్నిరోజుల వ్యవధిలో ఎలా భూమిని కట్టపెడతారని ప్రశ్నించారు. నెలరోజులక్రితమే పాఠశాల స్థలం మరొకరి పేరున అన్యాక్రాంతమవుతుందన్న సమాచారం ప్రధానోపాధ్యాయులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆ స్థలాన్ని మరొకరికి మార్పు చేయాల్సిన అవసరం ఏమోచ్చిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వీఆర్‌ఓ, ఆర్‌ఐలతో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వారికి హామీ ఇచ్చారు. అయితే ఆ సమాధానంతో రైతులు సంతృప్తి చెందలేదు. తహసీల్దార్‌ చాంబర్‌ ముందు వరండాలో బైఠాయించి ధర్నా చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని రామిరెడ్డి పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన తెలిపాడు. సీఐ సుబ్బరాయుడు అక్కడికి చేరుకుని రైతులకు సర్ధి చెప్పారు. వివాదాస్పద భూమిని రికార్డుల్లో అపరిష్కృత భూమిగా త హసీల్దార్‌ రెడ్‌ మార్క్‌లో ఉంచినట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో నగేష్‌, మునీంద్ర, వెంకటరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి బయప్పరెడ్డి, రంగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఓబులరెడ్డి, తిరుపాల్‌, లక్ష్మీనారాయణరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రామిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - Jul 25 , 2024 | 11:54 PM