Share News

కట్టేసి కొట్టారు..!

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:28 PM

మొహరం వేడుకలలో యువకుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. ఈ వ్యవహారంలో రెండు వర్గాలకు చెందిన 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇంతటితో గొడవకు తెరపడుతుందని భావిస్తుండగా, ముగ్గురు యువకులను కాడిమానుకు కట్టేసి కొట్టిన వీడియోలు బయటపడ్డాయి.

కట్టేసి కొట్టారు..!
యువకులను కాడిమానుకు కట్టేసి కొడుతున్న గ్రామస్థులు

జూలాకాల్వలో రెండు రోజుల క్రితం..

మొహరం వేడుకల్లో మొదలైన గొడవ

ఇరువర్గాలకు చెందిన 11 మందిపై కేసులు

శింగనమల, జూలై 22: మొహరం వేడుకలలో యువకుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. ఈ వ్యవహారంలో రెండు వర్గాలకు చెందిన 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇంతటితో గొడవకు తెరపడుతుందని భావిస్తుండగా, ముగ్గురు యువకులను కాడిమానుకు కట్టేసి కొట్టిన వీడియోలు బయటపడ్డాయి. ఇలా అమానుషంగా దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువకుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. శింగనమల మండలం జూలాకాల్వ గ్రామం వేదికగా ఈ గొడవలు జరుగుతున్నాయి.

మొహరం రోజు మొదలై..

జూలాకాల్వ గ్రామంలో ఈ నెల 18న జరిగిన మొహరం వేడుకలు జరిగాయి. దీంతో శింగనమల మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు గ్రామంలోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లారు. పీర్ల ఊరేగింపు సమయంలో వీరు బైకుల మీద తిరుగుతుండగా.. ఆ గ్రామానికి చెందిన యువకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో జూలాకాల్వ, శింగనమల యువకుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గ్రామానికి చెందిన నాగప్ప అనే వ్యక్తి శింగనమల యువకులను మందలించారు. అదే గ్రామానికి చెందిన వారి బంధువుల యువకుడిపై చేయి చేసుకున్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న శింగనమల యువకులు.. అనంతపురం వెళ్లి తిరిగి వస్తున్న నాగప్ప కొడుకుపై శుక్రవారం రాత్రి దాడి చేశారు. విషయం తెలుసుకున్న నాగప్ప కుటుంబ సభ్యులు.. దాడి చేసిన యువకుల బంధువుల ఇంటిమీదకు (జూలాకాల్వలో..) వెళ్లి గొడవ పడ్డారు. ఇలా వివాదం ముదిరింది.

అర్ధరాత్రి గొడవ..

జూలాకాల్వలోని తమ బంధువుల ఇంటిమీదకు నాగప్ప వెళ్లిన విషయం తెలుసుకున్న శింగనమల యువకులు, అనంతపురం నగరానికి చెందిన తమ స్నేహితులు సుమారు 30 మందితో కలిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జూలాకాల్వకు వెళ్లారు. నాగప్ప వర్గీయులపై దాడి చేశారు. ఈ గొడవతో మేల్కొన్న గ్రామస్థులు.. తమ ఊరిమీదకే వస్తారా.. అంటూ ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో శింగనమల, అనంతపురం నుంచి వచ్చిన యువకులు చాలామంది పారిపోగా.. నరసింహులు, నంద కిశోర్‌, దాదు అనే ముగ్గురు వారి చేతికి చిక్కారు. ఈ ముగ్గురిని కాడిమానుకు కట్టేసి గ్రామస్థులు చితకబాదారు. ఈ వీడియోలో సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. జూలాకాల్వ గ్రామం మీద దాడికి వెళ్లిన ఎనిమిది మందిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాడి వీడియోలు బయటకు రావడంతో జూలాకాల్వ గ్రామస్థులు ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామస్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన నరసింహులును మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ గొడవల నేపథ్యంలో జూలాకాల్వ, శింగనమలలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.

Updated Date - Jul 22 , 2024 | 11:28 PM