Share News

నేతన్నకు 365 రోజులూ పని కల్పిస్తాం

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:00 AM

చేనేత కార్మికులకు ఏడాదంతా పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల్లో భాగంగా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి డిజైన్ల నేసే చేనేత కళాకారులకు ప్రోత్సాహంలేక యాభై శాతం మగ్గాలు మూతపడ్డాయని తెలిపారు.

నేతన్నకు 365 రోజులూ పని కల్పిస్తాం

  • వారి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు: మంత్రి సవిత

  • వారానికోరోజు చేనేత ధరించేలా చూడండి: మాధవి

అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు ఏడాదంతా పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల్లో భాగంగా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి డిజైన్ల నేసే చేనేత కళాకారులకు ప్రోత్సాహంలేక యాభై శాతం మగ్గాలు మూతపడ్డాయని తెలిపారు. ముడిసరుకు ధరలు పెరిగి, వస్ర్తాలకు మార్కెటింగ్‌ లేక రాష్ట్రంలోని నేతన్నలు కూలీలుగా మారుతుంటే.. గుజరాత్‌లో కూలీలు నేతన్నలుగా మారుతున్నారని చెప్పారు. నెలకు కనీసం 8-10 వేలు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారానికి ఒక్కరోజైనా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రం ధరించేలా చైతన్యం తీసుకురావాల్సి ఉందని అన్నారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ.. నేతన్నలకు ముడిసరుకుపై రాయితీ, వస్త్రాలపై రిబేటు, చేనేత ఎగ్జిబిషన్లు, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌.. ఇలా ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు.

  • ఆక్వాకు విద్యుత్‌ సబ్సిడీ పొడిగించాం: గొట్టిపాటి

రాష్ట్రంలోని ఆక్వా జోన్‌ పరిధిలో ఉన్న పదెకరాలలోపు మత్స్యకార రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 సబ్సిడీని పొడిగించినట్లు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, అయితాబత్తుల ఆనందరావు సభలో ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ విద్యుత్‌ యూనిట్‌పై 1.50 సబ్సిడీ ఇస్తూనే పలు నిబంధనలు పెట్టి గత ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్నారు. కాగా, గిరిజన ప్రాంతాల్లో శిక్షణ సందర్భంగా యువతకు భోజనం పెట్టిన డ్వాక్రా సంఘాలకు గత ఐదేళ్లుగా బకాయిలు చెల్లించలేదని విష్ణుకుమార్‌రాజు, పార్థసారథి ప్రశ్నించారు. దీనిపై మంత్రి సుధారాణి స్పందిస్తూ డ్వాక్రా సంఘాలకు 5.71కోట్లు బకాయిలు ఉన్నమాట వాస్తవమేనని, సమస్య పరిష్కరిస్తామని బదులిచ్చారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం 2018లో ఎస్‌సీల కోసం తెచ్చిన వాహనాలను తుప్పుపట్టేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి బదులిస్తూ వాహనాలు నాశనం అవడానికి కారణాలు తేల్చాల్సిందిగా కడప కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.


  • బదిలీలపై తెలంగాణ స్పందన రావాలి: కేశవ్‌

శాశ్వత ప్రాతిపదికన ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు 1,942మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుముఖత వ్యక్తం చేయగా, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు 1,447మంది సిద్ధంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఏపీ నుంచి పంపేందుకు అభ్యంతరం లేదని తెలంగాణకు లేఖ రాశామని, స్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

  • కార్మికులకు అన్యాయం: మంత్రి సుభాష్‌

రాష్ట్రంలోని కార్మికులకు 2020 మార్చి నుంచి వైసీపీ ప్రభుత్వం క్లెయిమ్‌లు ఆపేసిందని మంత్రి వాసంశెట్టి సుభా ష్‌ తెలిపారు. పథకాలు ఇస్తున్నామంటూ కార్మిక సంక్షేమ మండలి అందించే వాటిని గత ప్రభుత్వం ఆపిందని, దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కార్మికులు క్షతగాత్రులైనా, చనిపోయినా జగన్‌ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యేలు ఏ రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 05:00 AM