Share News

జగన్‌పై పరువు నష్టం దావా వేస్తా: జీవీ

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:15 AM

అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియతో మాట్లాడారు.

జగన్‌పై పరువు నష్టం దావా వేస్తా: జీవీ

మీడియాపాయింట్‌లో మాజీ సీఎంపై నేతల విసుర్లు

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియతో మాట్లాడారు. జగన్‌ తీరుపై వారు విరుచుకుపడ్డారు. జగన్‌ ఈసారైనా అసెంబ్లీకి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, ‘నా కుటుంబంపై అసత్యాలు చెప్తున్న జగన్‌రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా. నా కుటుంబం గురించి మాట్లాడితే సహించేది లేదు. జగన్‌లా మేం అక్రమార్జనలు చేయలేదు. నీతిగా ప్రజాసేవ చేస్తున్నాం. వివేకా హంతకులు జగన్‌ భార్యతో ఫొటోలు దిగలేదా? జగన్‌తో ఫోటోలు దిగిన వారిలో ఏదోక కేసులో నిందితులుగా ఉన్న వారు లేరా? ఈ లెక్కన జగన్‌పై ఎన్ని కేసులు పెట్టాలి?’ అని ప్రశ్నించారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ... ఐదేళ్లలో జగన్‌ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ, దోచుకుని, దాచుకోవడమే తెలిసిన జగన్‌ ప్రజా సమస్యలపై చర్చకు అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.

జగన్‌ ఈసారైనా అసెంబ్లీకి రావాలి: వాసు

‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలపై పోరాడాం. నువ్వూ పోరాడు. జగన్‌ అసెంబ్లీలో ఉండాలి. నువ్వు రాకపోతే ఊరుకోం’ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు వ్యాఖ్యానించారు. ‘శ్వేతపత్రం అంటే తెలియని జగన్‌... ఫ్యాక్ట్స్‌ అంటూ ఆర్థిక వ్యవస్థపై ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏంటి? ఒక ఫ్యాక్షనిస్టు ఫ్యాక్ట్స్‌ అంటే ఎవరు నమ్ముతారు? ఐదేళ్లలో చేసిన అరాచకం సరిజేయాలంటే ఐదేళ్లు చాలవు. ప్రతిపక్ష హోదా లేకపోయినా చంద్రబాబు గౌరవంగా చూశారు. ఈసారైనా అసెంబ్లీకి రా. రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అంటూ నీ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తాం’ అని అన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన తనకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలతో అనేక విషయాలు తెలిశాయని, జగన్‌ అసెంబ్లీ రాకపోవడం సరికాదని అన్నారు.

బీజేపీ వైపు చూస్తున్న వైసీపీ నేతలు: సోమిరెడ్డి

జగన్‌ బీజేపీలో చేరాలనే ప్రయత్నం బెడిసికొట్టిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అధికారం కోసం, కేసుల నుంచి తప్పించుకోవటానికి వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌ ఇండియా కూటమిలో చేరకపోవచ్చని చెప్పారు. మంత్రి లోకేశ్‌ రెడ్‌బుక్‌లో మొదటి పేరు జగన్‌రెడ్డిదేనని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చెప్పారు.

అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు పడాలి: పీడీఎఫ్‌

చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు పునరావృతం కాకుండా పిల్లలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు సత్వర సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం నిర్వాసితులకు పక్కగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అమలు చేయాలని, భూ హక్కులు కోల్పోతున్న గిరిజనులకు న్యాయం చేయకపోతే.. ప్రాజెక్ట్‌కే అర్ధం లేదని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5 వేల ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

Updated Date - Jul 27 , 2024 | 03:15 AM