రూ.100 కోట్లకు మరో దావా వేస్తా
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:14 AM
తనపైన, తన కుటుంబంపైన అసత్య వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై రూ.100కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు.
కొండా సురేఖ క్షమాపణ చెప్పినా తగ్గేది లేదు: నాగార్జున
న్యూఢిల్లీ, అక్టోబరు 4: తనపైన, తన కుటుంబంపైన అసత్య వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై రూ.100కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు. ఆమె క్షమాపణలు చెప్పినా వెనక్కితగ్గే ప్రసక్తే లేదని.. ఇప్పటికే ఆమెపై వేసిన క్రిమినల్ పరువునష్టం దావాను ఉపసంహరించుకోబోమని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై ‘టైమ్స్ నౌ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆమె ఇప్పుడు చెబుతున్నారు. సమంతకు క్షమాపణ చెప్పారు. మరి.. నా కుటుంబం సంగతేమిటి? నాకూ, నా కుటుంబానికి క్షమాపణ చెప్పరా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇది ఏమాత్రం వ్యక్తిగత అంశం కాదని.. ఆమె చేసిన దారుణమైన ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని దాటి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి లభిస్తున్న మద్దతు.. వ్యవస్థ లోలోతులకు విస్తరించిన తెగులును అరికట్టే ప్రక్రియలో తాము ఉన్నామన్న విషయాన్ని తనకు అర్థమయ్యేలా చేసిందని వ్యాఖ్యానించారు. ‘‘మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా పేర్లను ఉపయోగించుకోవడం దారుణం. వినోద రంగంలో ఉన్న మేము ఇకపై ఎంతమాత్రం తేలికైన లక్ష్యాలుగా ఉండబోము. ఆమెపై చట్టపరంగా మేం తీసుకునే చర్యలు ఇతర రాజకీయ నాయకులకు ఒక హెచ్చరికగా ఉంటాయని, తమకు అపకీర్తి కలిగించే వ్యాఖ్యలు చేయకుండా నిరోధిస్తాయని భావిస్తున్నట్టు నాగార్జున తెలిపారు. పరువు నష్టం దావాలు కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతాయన్న విషయం తెలుసని.. అయినా, ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని, తానొక బలమైన వ్యక్తినని, కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే కారణమని అభిప్రాయపడ్డారు.