హోంమంత్రి అనితపై అనుచిత పోస్టులు
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:18 AM
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైపీసీ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి.
అనకాపల్లిలో వ్యక్తి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు
కదిరిలో వైసీపీ కార్యకర్త ఇంటికి మరో నోటీసు
దేవరాపల్లి(అనకాపల్లి)/కదిరి అర్బన్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైపీసీ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన నగనూరు బాలాజీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో హోంమంత్రిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం నాగిరెడ్డిపల్లెకు వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి నిఘా పెట్టారు. శనివారం రాత్రి అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం అనకాపల్లిలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయంటూ అసత్య ప్రచారం చేసిన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అమర్‌నాథ్‌రెడ్డిపై బాపట్లకు చెందిన ఐటీడీపీ కార్యకర్త రాజా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాపట్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమర్‌నాథ్‌రెడ్డి ఇంటికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆదివారం వీరచిన్నయ్యగారిపల్లికి వచ్చారు. అతను అందుబాటులో లేకపోవడంతో నోటీసు ఇంటికి అంతికించారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నట్లు కదిరి అప్‌గ్రేడ్ సీఐ మోహన్ వెల్లడించారు. కాగా, అమర్‌నాథ్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసు అతికించడం ఇది రెండోసారి. ఇదే ఫిర్యాదుపై విశాఖ వన్‌టౌన్ పోలీసులు ఈ నెల 15న అమర్‌నాథ్‌రెడ్డి ఇంటికొచ్చారు. అతను లేకపోవడంతో ఇంటికి నోటీసు అతికించి వెళ్లారు.