Share News

తిరుమల లడ్డూ కల్తీపై స్వతంత్ర సిట్‌

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:31 AM

తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల లడ్డూ కల్తీపై స్వతంత్ర సిట్‌

ఐదుగురు సభ్యులతో ఏర్పాటు.. సుప్రీంకోర్టు నిర్ణయం

సీబీఐ, రాష్ట్ర పోలీసు శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి మరొకరు

పర్యవేక్షణ సీబీఐ డైరెక్టర్‌కు.. ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు

రాష్ట్ర సిట్‌ అధికారుల విశ్వసనీయతను మేం శంకించడం లేదు

భక్తుల్లో విశ్వాస కల్పనకే స్వతంత్ర దర్యాప్తు: సుప్రీం కోర్టు

ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదిక ఆధారంగానే సీఎం మాట్లాడారు

పంది కొవ్వు ఉందని అందులోనే ఉంది: ప్రభుత్వ లాయర్‌

అది శాకాహార కొవ్వు అన్న వైవీ తరఫు లాయర్‌

కలుషిత ట్యాంకర్లను ఎలా అనుమతించారని ప్రశ్న

గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు ప్రకారం వచ్చాయన్న టీటీడీ

న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) స్థానంలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ)కి చెందిన సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉంటారని, సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారని తెలిపింది. తమ ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ సభ్యుల విశ్వసనీయతను శంకిస్తున్నట్లుగా భావించరాదని స్పష్టంచేసింది. వారందరికీ మంచి ప్రతిష్ఠ ఉందని.. వారు దర్యాప్తును కొనసాగిస్తే అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పిన విషయాన్ని తన ఆదేశాల్లో ప్రస్తావించింది. అయితే అదే సమయంలో దర్యాప్తును పర్యవేక్షించేందుకు సిట్‌ అధికారుల కంటే సీనియర్‌ అయిన ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిని నియమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను సంతృప్తిపరిచేందుకు స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నామని.. ఈ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో జరగడం సముచితమని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. నెయ్యి కల్తీ ఆరోపణలు, ప్రత్యారోపణల్లో వాస్తవాల జోలికి తాము వెళ్లడం లేదని తెలిపింది. సుప్రీంకోర్టును రాజకీయ పోరాటానికి మైదానంగా ఉపయోగించుకోవడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యంస్వామి, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సురేశ్‌ చవహంకే, విక్రమ్‌ సంపత్‌ దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరించింది. వాస్తవానికి ఈ పిటిషన్లపై గురువారమే విచారణ జరగాల్సి ఉండగా.. సొలిసిటర్‌ జనరల్‌ శుక్రవారం ఉదయం వరకు సమయం కోరారు. ధర్మాసనం అందుకు అంగీకరించి శుక్రవారం మొదటి కేసుగా విచారణ జరిపింది.


ఉదయం విచారణ ప్రారంభం కాగానే మెహతా మాట్లాడుతూ.. ప్రసాదంలో వినియోగానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల్లో నిజం ఉంటే.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. తాను రికార్డులు పరిశీలించానని.. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ ప్రస్తుత సభ్యులు సమర్థులని.. స్వతంత్రంగా వ్యవహరించేవారని, వారితో దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారి ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ.. నెయ్యి కల్తీ జరగడం నిస్సందేహంగా అంగీకార యోగ్యం కాదన్నారు. స్వతంత్ర సిట్‌ ద్వారా దర్యాప్తు చేస్తే తనకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నట్లు తాము వార్తా పత్రికల్లో చదివామని తెలిపారు. టీటీడీ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా స్పందిస్తూ.. పత్రికల కథనాలపై ఆధారపడొద్దని కోరారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) చేసిన ప్రకటనలను కూడా వక్రీకరించారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పందిస్తూ.. తాము సిట్‌తోనే ముందుకు వె ళ్లాలనుకుంటున్నామని, కోర్టు ఏ అధికారినైనా ఇందులో చేర్చవచ్చని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై ప్రకటన చేయకపోతే పరిస్థితి వేరుగా ఉండేదని.. బహిరంగంగా ప్రకటన చేశారని.. ఇది ప్రస్తుత సిట్‌ విచారణపై ప్రభావం చూపుతుందని, స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమించడమే సరైందని అన్నారు.

ల్యాబ్‌ నివేదిక ఆధారంగానే సీఎం మాట్లాడారు..

నెయ్యి కల్తీకి సంబంధించి జూలైలోనే నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఎన్‌డీబీబీ) నుంచి ల్యాబ్‌ రిపోర్టు వచ్చిందని, దాని ఆధారంగా సెప్టెంబర్లో తన వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారని రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. సిట్‌ దర్యాప్తునకు, దానికీ సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి చివర్లో అన్న నాలుగు వాక్యాలను మీడియా విస్తృత ప్రచారం చేసిందని తెలిపారు. నెయ్యి తయారీలో పంది కొవ్వు ఉపయోగించారనడానికి పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. పందికొవ్వు వాడారని సీఎంకెలా తెలుసని సిబల్‌ ప్రశ్నించారు. ల్యాబ్‌ నివేదికలో ఉందని రోహత్గీ తెలిపారు. అయితే శాకాహార కొవ్వు ఉన్నట్లు అందులో ఉందని సిబల్‌ అన్నారు. సీఎం చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనల దృష్ట్యా రాష్ట్ర సిట్‌ స్వతంత్రంగా దర్యాప్తు చేయజాలదని.. స్వతంత్ర విచారణ అవసరమని నొక్కిచెప్పారు. జూలై 6, 12 తేదీల్లో రెండు సార్లు ట్యాంకర్లు వచ్చాయని, వాటిని ఉపయోగించలేదని టీటీడీ ఈవో అధికారికంగా చెప్పారు కదా అని జస్టిస్‌ విశ్వనాఽథన్‌ ప్రస్తావించగా.. వాటిలో కలుషిత నెయ్యి ఉందని లూథ్రా తెలిపారు. కలుషితమైన వాటిని కొండపైకి ఎలా రానిచ్చారని సిబల్‌ ప్రశ్నించారు. అవి గత ప్రభుత్వ హయాంలో డిసెంబరులో ఇచ్చిన కాంట్రాక్టు ప్రకారం వచ్చాయని లూథ్రా తిప్పికొట్టారు. అలాగే తొలి సరఫరాదారు నుంచి తిరుమలకు సరుకు రాలేదని తమకు సర్వీసు విభాగం నుంచి సమాచారం అందిందని తెలిపారు. లడ్డూ వ్యవహారంపై తా ము అమికస్‌ క్యూరీ(కోర్టు సహాయకారి)ని కూడా నియమించవచ్చని జస్టిస్‌ విశ్వనాథన్‌ వ్యాఖ్యానించారు. తాము చెప్పిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని రోహత్గీ తెలిపారు. జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ.. ఆరోపణలు చాలా తీవ్రమైనవనడంలో సందేహం లేదన్నారు. సిట్‌కు ప్రత్యామ్నాయంగా స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో సీబీఐ, రాష్ట్ర పోలీసు శాఖ చెరో ఇద్దరిని నామినేట్‌ చేయాలని.. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ సీనియర్‌ అధికారి మరో సభ్యుడిగా ఉండాలని అన్నారు. దీనికి అభ్యంతరం లేదని రోహత్గీ చెప్పారు.


తీర్పులో ఏమున్నదంటే..

‘జూలై 6న సరఫరా చేసిన రెండు ట్యాంకర్లు, జూలై 12న పంపిన మరో 2 ట్యాంకర్లలో నెయ్యి కలుషితమైందంటూ ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. తిరుమల లడ్డూ తయారీలో కలుషిత నెయ్యిని వినియోగించారని ఆరోపించారు. గత విచారణ సందర్భంగా.. రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తును కొనసాగించాలో, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తారో కేంద్రం నుం చి ఆదేశాలు తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరాం. సిట్‌ సభ్యుల విశ్వసనీయతకు సంబంధించి రికార్డులను తాను పరిశీలించానని.. అందులోని సభ్యులు మం చి ప్రతిష్ఠ కలిగినవారని ఆయన నివేదించారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ దర్యాప్తు కొనసాగించవచ్చని అన్నారు. అయితే ఈ సిట్‌ దర్యాప్తును పర్యవేక్షించేందుకు కోర్టు కేంద్రప్రభుత్వ అధికారిని నియమించవచ్చన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి మేం వెళ్లడం లేదు. కోర్టును రాజకీయ రణభూమిగా ఉపయోగించుకోవడానికి సమ్మతించం. అయితే సీబీఐ, రాష్ట్రపోలీసులు, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ ప్రతినిధులతో కూడిన స్వతంత్ర సిట్‌తో దర్యాప్తు జరపాలని మేం భావిస్తున్నాం. ఈ దర్యాప్తు కూడా సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో సాగడం సముచి తం. మా ఆదేశాలు ప్రస్తుత సిట్‌ సభ్యుల స్వతంత్రత, నిష్పాక్షికతను శంకించేవిగా భావించరాదని స్పష్టం చేస్తున్నాం. కోట్ల మంది భక్తుల మనోభావాలను ఉపశమింపజేసి.. విశ్వాసం పాదుకొల్పడానికే ఈ ఆదేశాలిస్తున్నాం’ అని ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టంచేసింది.

నెయ్యి కల్తీ ఆరోపణలు తీవ్రమైనవనడంలో సందేహం లేదు. అయితే ఈ వ్యవహారం రాజకీయ డ్రామాగా మారేందుకు అంగీకరించం. ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్‌కు ప్రత్యామ్నాయంగా స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేస్తాం.

కోట్లాది భక్తులకు ఊరట కలిగించేందుకు సీబీఐ, రాష్ట్ర పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతినిధులతో కూడిన స్వతంత్ర సిట్‌ దర్యాప్తు జరపాలని భావిస్తున్నాం. ఇది కూడా సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో సాగాలి.

- సుప్రీంకోర్టు

Updated Date - Oct 05 , 2024 | 04:31 AM