Share News

‘నిప్పు’ వెనుక నిజమిదేనా?!

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:37 AM

అన్నమయ్య జిల్లాలో అత్యంత కీలకమైన డివిజన్‌ మనదపల్లి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఇక్కడి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని రికార్డులనే ఏరికోరి ఎందుకు తగలబెట్టారో స్పష్టత వస్తోంది.

‘నిప్పు’ వెనుక నిజమిదేనా?!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఏకంగా నాడు 2.19లక్షల ఎక రాలకు నిషేధ విముక్తి

అందులో అసైన్డ్‌ 1.82 లక్షల ఎకరాలు

చుక్కల భూములు 26,465 ఎకరాలు

నిషేధ విముక్తిలో అన్నమయ్య జిల్లా టాప్‌

98,978 ఎకరాలను అక్కడ విడిపించారు

అందులో సగం మదనపల్లె సబ్‌ డివిజన్‌లోనే..

భారీగా భూములు భోంచేసిన పెద్దిరెడ్డి, అనుచరులు

సిసోడియా విచారణలో రట్టు అవుతున్న గుట్టు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అన్నమయ్య జిల్లాలో అత్యంత కీలకమైన డివిజన్‌ మనదపల్లి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఇక్కడి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని రికార్డులనే ఏరికోరి ఎందుకు తగలబెట్టారో స్పష్టత వస్తోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్‌లోనే గత ఏడాదికాలంలో 35వేల ఎకరాల అసైన్డ్‌ భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను విభజించి కొత్తగా అన్నమయ్య, తిరుపతి జిల్లాలను 2022లో ఏర్పాట చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లా పరిధిలో నిషేధ జాబితా నుంచి 2.19 లక్షల ఎకరాల భూములను బయటకుతీశారు. అందులో ఒక్క అన్నమయ్య జిల్లాలోనే 98,978 ఎకరాల భూమి ఉంది. ఇందులో 43వేల ఎకరాల భూమి ఇక్కడ మదనపల్లి డివిజన్‌లోనే ఉంది. నిప్పు రాజేయడం వెనక ఉన్న అసలు గుట్టు ఇదే! మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులను తగలెబట్టిన తర్వాత సర్కారు అప్రమత్తమై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియాను అక్కడికి పంపించిన సంగతి తె లిసిందే. నాలుగురోజుల పాటు జిల్లాలోనే ఉన్న ఆయన భూముల వ్యవహారాలను నిశిత పరిశీలన చేశారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, సబ్‌కలెక్టర్‌లు, ఆర్డీవోలు, తహసిల్దార్లు, జిల్లా, సబ్‌ రిజిస్ట్రార్‌లతో ఆయన వరుస సమీక్షలు చేశారు. కీలకమైన ఫైళ్లు తెప్పించుకొని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మూడు ప్రాంతాల్లో 22(ఏ) నుంచి తొలగించిన భూముల వివరాలను సేకరించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఆసక్తికలిగిన, దేవదాయ, అసైన్డ్‌, చుక్కల, షరతుగల పట్టా భూముల వివరాలను జిల్లా, డి విజన్‌ల వారీగా లెక్కతీశారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో 22(ఏ) నుంచి 2,19, 136.18 ఎకరాలను తొలగించినట్లు గుర్తించారు. నిజంగా ఇవి విస్మయంగొలిపే గణాంకాలు. ఇందులో అసైన్డ్‌ భూమినే 1,82,553.199 ఎకరాలున్నాయి. 26, 465.64 ఎకరాలు చుక్కల భూమి, ఇతర భూములు 8,899.915 ఎకరాలు, షరతుగల పట్టా భూములు 1217.44 ఎకరాలున్నాయి.

రాష్ట్రంలో ఇంత వేగంగా నిషేధ విముక్తి ఒక్క ఉమ్మడి చిత్తూరులో తప్ప మరెక్కడా జరగలేదు. ఇక్కడే ఎందుకు జరిగిందనుకుంటున్నారా?..ఇక్కడి భూములపై పెద్ద పుష్పల కన్ను ఉండటమే కారణమని గుర్తించారు. ఇందులో రిజిస్ట్రేషన్‌ అయిన భూములు 4,433.54 ఎకరాలు అని తేల్చారు. అయితే, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సరైన సమాచారం ఇవ్వని కారణంగానే రిజిస్టర్‌ అయిన భూముల సంఖ్య తక్కువగా నిర్ధారణ అయింది.

ఐదు నెలల్లో 1.82 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్‌

రాష్ట్రంలో అసైన్‌ చేసిన భూములకు 20 ఏళ్ల కాలపరిమితి దాటిన తర్వాత శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించేలా జగన్‌ సర్కారు గత ఏడాది అక్టోబరులో అసైన్డ్‌ భూముల చట్టం-1977(పీఓటీ) సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈచట్టం అమలు కోసం గత ఏడాది డిసెంబరు 19న జీఓ 596 జారీ చేశారు. ఈ జీవోను అడ్డంపెట్టుకొని వైసీపీ నేతలు, భూ కబ్జాదారులు, అక్రమార్కులు విచ్చలవిడిగా అసైన్డ్‌ భూములను చే జిక్కించుకున్నారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు అంటే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేనాటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరూ ఊహించని రీతిలో 1,82,553.199 ఎకరాలను 22(ఏ) నుంచి తొలగించారు. ఇందులో చిత్తూరు జిల్లాలో 84,378 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 74,374.199 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 23,801 ఎకరాలను 22(ఏ) నుంచి తొలగించారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఒక్క మదనపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో 35 వేల ఎకరాల భూమికి నిషేధ జాబితా నుంచి విముక్తి కలిగించారు.

ఆ అధికారులపై చర్యలు

లక్షలాది ఎకరాల భూములను సరైన కారణాలు, హేతుబద్ధత లేకుండా నిషేధ జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం ప్రాఽథమికంగా గుర్తించింది. మదనపల్లెలో నాలుగు రోజుల పర్యటన, విచారణ అంశాలపై రెవెన్యూశాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి ఆర్‌పి. సిసోడియా త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. జీవో 596 మార్గదర్శకాలకు వ్యతిరేకంగా భూములను 22(ఏ) నుంచి తీశారని ఆయన నిర్ధారణకు వచ్చారు. ఈ నేపధ్యంలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో తహసిల్దార్‌ నుంచి ఆర్డీవో, డీఆర్‌వో, కలెక్టర్ల వరకు పాత్ర ఉందని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిసోడియా సిఫారసు చేయనున్నారు. తొలుత రెవెన్యూ అధికారులు తహసీల్దార్‌, ఆర్‌డీవో, డీఆర్‌వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆయన సిఫారసు చేయనున్నారు. గతంలో మదనపల్లి ఆర్‌డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీవో, తహసిల్దార్‌, రేణిగుంట, యేర్పేడు (వికృతమాల భూములు), పుంగనూరు (రాగనిపల్లె భూములు), తిరుపతి తదితర మండలాల అధికారులతోపాటు రిజిస్ట్రేషన్‌శాఖ అధికారుల పాత్రపై విచారణతోపాటు క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 27 , 2024 | 03:37 AM