Telangana MLA: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 02:44 PM
తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుమల, అక్టోబర్ 21: తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్నదర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఏడుకొండలవాడిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దర్శించుకున్నారు.
అనంతరం తిరుమాడ వీధుల్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...తిరుమలలో స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల జారీ చేసే సిఫార్స్ లేఖలు అనుమతించకపోవడం బాధాకరమన్నారు. డయిల్ యువర్ ఈవో కార్యక్రమంలో సైతం టీటీడీ ఈవో సైతం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖను అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు.
అయితే తమ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాచలంలో దేవుడు దర్శనానికి వచ్చే ఆంధ్ర ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలను తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. కానీ తమ తెలంగాణ విషయంలో ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని టీటీడీ అధికారులను ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తాం.. రూమ్ ఇప్పించండి అంటే.. ఇప్పించలేని దుస్థితి నేడు నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందుతారని పేర్కొన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం కొలువు తీరితే.. వైసీపీ వాళ్లు హైదరాబాద్ వచ్చి ఉంటారన్నారు. ఏపీ వాళ్లు హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకున్నా.. తెలంగాణ వాళ్లు ఏనాడు ఒక్క మాట కూడా వాళ్లని అనలేదన్నారు.
తెలంగాణ ఎమ్మెల్యే అంతా ఏపీ వాళ్లను తమ రాష్ట్రానికి రావొద్దని ఓ తీర్మానం చేసుకుంటే.. ఆ బాధేమిటో మీకు తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు టీటీడీ అనుమతించక పోతే.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాము తీసుకునే నిర్ణయంతో బాధ పడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే అనిరుధ్ హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములన్నారు. అలాగే ఉందాం. కేవలం వ్యాపారం కోసం హైదరాబాద్‌కు రాకండీ.. నిజమైన అన్నదమ్ముల వలే ఉందమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు.
For AndhraPradesh News And Telugu News