మినహాయింపు ఏదీ.. ఎక్కడ?
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:04 AM
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి కొనుగోలు చేస్తున్న 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తుకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీ(ఐఎ్‌సటీసీ)ల మిహాయింపు ఉందని మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటన శుద్ధ అబద్ధమని తేలిపోయింది.
7000 మెగావాట్ల సౌర విద్యుత్తుపై ఐఎస్‌టీసీ చార్జీలకు మినహాయింపు ఇవ్వాలని సీఈఆర్‌సీని కోరిన ఈఆర్‌సీ
జీపీఏ అమల్లోకి వస్తే ఐఎస్‌టీసీ వర్తించదని ఆందోళన
ఈఆర్‌సీ లేఖపై జగన్ ఏం చెబుతారని నిపుణుల ప్రశ్న
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి కొనుగోలు చేస్తున్న 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తుకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీ(ఐఎ్‌సటీసీ)ల మిహాయింపు ఉందని మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటన శుద్ధ అబద్ధమని తేలిపోయింది. దేశంలోనే అతి తక్కువగా సౌర విద్యుత్తు యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి వస్తుందంటూ జగన్ గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ‘సొంత మీడియా’ సమావేశంలో ప్రకటించారు. ఐఎ్‌సటీసీ చార్జీలపై వక్రీకరిస్తున్నాయని ‘ఆంధ్రజ్యోతి’, ‘ఈనాడు’పై అసహనం వ్యక్తం చేశారు. అయితే.. జగన్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని రుజువైంది. సెకీ విద్యుత్తుకు ఐఎ్‌సటీసీ చార్జీలు మినహాయించాలని కోరుతూ కేంద్ర ఇంధన నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ)కి ఏపీఈఆర్‌సీ ఈ ఏడాది ఆగస్టు 13న లేఖ రాసింది. జనరల్ పవర్ యాక్సిస్ (జీపీఏ) అమలులోకి వచ్చాక ఐఎ్‌సటీసీ అంశం మరుగున పడుతుందని అంటున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఏపీఈఆర్‌సీ చైర్మన్ కోరారు. జీపీఏ విధానాన్ని 2023లో కేంద్ర ఇంధనశాఖ, సీఈఆర్‌సీ తీసుకొచ్చాయి.
అప్పట్లో దీనిపై జగన్ దృష్టి సారించలేదు. దీనివల్ల సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్తుపై జీపీఏ భారం పడుతుందని సీపీఎం, సీపీఐ, టీడీపీ, జనసేన పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 9న ఢిల్లీలో సీఈఆర్‌సీ చీఫ్ రెగ్యులేటరీ ఫోరం సెక్రటరీ ఎస్‌కె. చటర్జీ బృందంతో ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సి.నాగార్జునరెడ్డి వర్కింగ్ భేటీ నిర్వహించారు. సెకీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సమయంలో భవిష్యత్తులో వచ్చే కొత్త చట్టాలను అమలు చేస్తామంటూ రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కమ్‌లు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో సెకీ విద్యుత్తుపైనా జీపీఏ పడుతుందన్న ఆందోళనను ఏపీఈఆర్‌సీ వ్యక్తం చేసింది. దీంతో సెకీ విద్యుత్తుకు ఐఎ్‌సటీసీ మినహాయింపు ఇవ్వాలని కోరింది. కాగా, సెకీతో డిస్కమ్‌లు, ఇంధనశాఖ ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ గ్రీన్‌ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏపీ రూరల్ అగ్రికల్చరల్ పవర్ సప్లయి కంపెనీగా మార్చారు.
ఈ కంపెనీ ద్వారా వ్యవసాయానికి విద్యుత్తును సరఫరా చేస్తామని సీఈఆర్‌సీకి ఈఆర్‌సీ తెలిపింది. అయితే ఒప్పందంపై ఏపీఆర్‌ఎపీఎ్‌సకామ్ సంతకాలు చేయలేదు. దీంతో ఐఎ్‌సటీసీ మినహాయింపు వచ్చే అవకాశం లేదని ఇంధనశాఖ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. సెకీ విద్యుత్తుకు ఐఎ్‌సటీసీ మినహాయింపు ఉందంటూ జగన్ దబాయింపునకు దిగారు. సెకీతో చేసుకున్న ఒప్పందం వల్ల యూనిట్ రూ.2.49కే రాష్ట్రానికి రాజస్థాన్ నుంచి వచ్చేస్తుందని బుకాయించారు. ఒకవేళ జీపీఏ చార్జీలు కట్టాల్సి వస్తే జగన్ సొంత డబ్బు నుంచి భరిస్తారా అనే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారని రాజకీయపక్షాలు, విద్యుత్తు రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.