జయహో దుర్గా‘భవానీ’!
ABN , Publish Date - Oct 12 , 2024 | 06:34 AM
నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దసరా తొలిరోజు నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే
ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న ‘ఉత్తరాంధ్ర’ భవానీలు
వందలాది కిలోమీటర్ల దూరం నడిచి అమ్మ దర్శనానికి
ఎండ, వానలకు వెరవక పది రోజుల పాటు నడక
ఈ ఏడాది రికార్డు స్థాయిలో తరలివస్తున్న భక్తులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ/వన్‌టౌన్)
నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దసరా తొలిరోజు నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా వందలాది కిలోమీటర్లు కాలినడకన ఎండ, వానకు వెరవక, ఎన్నో కష్టాలను దాటుకుంటూ అకుంఠిత దీక్షతో వచ్చే వీరికి అమ్మ దర్శనమే ఏకైక లక్ష్యం. శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి భవానీ దీక్షలు ధరించిన వారు, ధరించనివారు వేలాదిగా అమ్మ దర్శన భాగ్యం కోసం బారులు తీరుతున్నారు. కాళ్లకు బొబ్బలు కట్టినా లెక్కచేయకుండా దుస్తులు చుట్టుకుని, చేతిలో కర్రను ఊతంగా పట్టుకుని నడిచి వస్తున్నారు. వీరు అమ్మ సన్నిధికి చేరుకోవాలంటే కనీసం పది రోజులు పడుతుంది. ప్రతిరోజూ రహదారి వెంబడి నడుస్తూనే ఉంటారు. రోడ్డు పక్కనే ఉన్న దేవాలయాలలో... ఫుట్‌పాత్‌ల పైనే రాత్రి వేళ విశ్రమిస్తారు. తిరిగి ఉదయాన్నే రహదారి వెంబడి ఆలయాల్లో స్నానాదికాలు పూర్తి చేసుకుంటారు. అక్కడే వంట చేసుకుంటారు. ఒంటరిగా వచ్చినవారు దాతలు ఇచ్చే ఆహారాన్ని స్వీకరిస్తారు. వర్షం వస్తే తడుస్తూనే నడక కొనసాగిస్తారు. ఎండలో కాళ్లు మండుతున్నా వెరవకుండా ముందుకు సాగుతుంటారు.
మొత్తం మీద పదిరోజుల పాటు దీక్ష, పట్టుదలతో ముందుకు సాగుతూ విజయవాడ చేరుకుంటారు. రామవరప్పాడు నుంచి ఏలూరు రోడ్డు మీదుగా కొందరు.. బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా మరికొందరు కెనాల్ రోడ్డుకు చేరుకుంటారు. అందరూ కలిసి వినాయకుడి గుడి దగ్గర క్యూలలోకి ప్రవేశిస్తారు. దుర్గమ్మ దర్శనం అనంతరం మహామండపం దిగువన దీక్ష విరమిస్తారు. తర్వాత కృష్ణానదికి వెళ్లి అక్కడ భవానీ వస్ర్తాలను త్యజిస్తారు. కాలినడకన మొక్కు తీర్చుకున్నామని అమ్మకి చెప్పి సెలవు తీసుకుంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అడ్డదారులు వెతికేవారు, అనధికార ప్రోటోకాల్, వీఐపీ దర్శనాల కోసం వెంపర్లాడే వారంతా వీరిని చూసైనా తమ పద్ధతి మార్చుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.