Share News

కూటమిలో జోష్‌!

ABN , Publish Date - May 13 , 2024 | 04:13 AM

పోలింగ్‌ వేళ టీడీపీ కూటమిలో సమరోత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల్లో తమ విజయం ఖాయమన్న ధీమా కూటమి నేతల్లో బలంగా వ్యక్తమవుతోంది.

కూటమిలో జోష్‌!

ప్రభుత్వం మారడం ఖాయమని నేతల ధీమా

ఆత్మవిశ్వాసంతో పోలింగ్‌కు సన్నద్ధం

జగన్‌పై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత

వైసీపీ పథకాల కంటే సూపర్‌సిక్స్‌ స్కీంలు హిట్‌

ఓటేయడానికి పొరుగు నుంచీ ప్రవాహంలా జనం

విదేశాల నుంచీ భారీగా తరలివచ్చిన ఎన్నారైలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలింగ్‌ వేళ టీడీపీ కూటమిలో సమరోత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల్లో తమ విజయం ఖాయమన్న ధీమా కూటమి నేతల్లో బలంగా వ్యక్తమవుతోంది. సోమవారం జరిగే పోలింగ్‌కు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, శ్రేణులు ఆత్మ విశ్వాసంతో సన్నద్ధమయ్యాయి. ఎన్నికల గడువు సమీపించిన కొద్దీ వివిధ సమీకరణలు తమకు అనుకూలంగా మారాయని, ప్రభుత్వ మార్పు ఖాయమని కూటమి పార్టీలు విశ్లేషిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత అసాధారణ స్థాయిలో నెలకొనడంతో తాము సునాయాసంగా గెలవబోతున్నామని పేర్కొంటున్నాయి. ‘గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య తొమ్మిదిన్నర శాతం ఓట్ల తేడా ఉంది. జనసేనకు విడిగా ఆరున్నర శాతం ఓట్లు వచ్చాయి. కేవలం పోయినసారి వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకున్నా టీడీపీ, జనసేన పార్టీలు కలవడంతో వాటికి... వైసీపీకి మధ్య ఉన్న తేడా ఆరున్నర శాతం తగ్గిపోయింది. కొత్తగా వైసీపీకి పెరిగిన ఓట్లేమీ లేవు. ప్రభుత్వ వ్యతిరేకతతో అనేక వర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు ప్రతిపక్షానికి మారిపోయింది. కేవలం ఈ లెక్కలు చూసినా వైసీపీ ఓటమి గోడ మీద రాసినంత స్పష్టంగా కనిపిస్తోంది’ అని టీడీపీ తరపున సాంకేతిక విశ్లేషణలు చూస్తున్న ఒక నేత పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్న ఏజెన్సీల అంచనా ప్రకారం.. యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపార వర్గాలు, భవన నిర్మాణ కార్మికులు, మద్యం సేవించే పేద వర్గాలు.. కరెంటు బిల్లులు, పెట్రో చార్జీల పెంపు వంటి బాదుడు నిర్ణయాలతో విసుగుచెందిన మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలు.. జగన్‌ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ అంచనాల్లో వాస్తవం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సమయంలో వెల్లడైంది. గతంలో పోస్టల్‌ బ్యాలెట్లను పోస్టు ద్వారా పంపేవారు. అనేక మంది వాటిని వేయడానికి పెద్దగా శ్రద్ధ తీసుకునేవారు కాదు. ఈసారి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ప్రత్యక్ష ఓటింగ్‌ విధానం పెట్టారు. సుమారుగా నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు ఓట్లు వేశారు. ఇందులో అత్యధికులు కూటమికి ఓట్లు వేశారని ఉద్యోగ వర్గాల ద్వారానే తేలిపోయింది. గత ఎన్నికల్లో ఇదే ఉద్యోగ వర్గం వైసీపీకి బలంగా మద్దతిచ్చింది. ఈసారి అంతే బలంగా దానికి వ్యతిరేకంగా మోహరించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు పరిగణనలోకి తీసుకుంటే కనీసం పది లక్షల ఓట్లు కూటమికి పడేలా కనిపిస్తున్నాయని, ఇది బాగా పెద్ద సంఖ్యని సర్వే ఏజెన్సీలు చెబుతున్నాయి. ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు వైసీపీ పట్ల విముఖతతో ఉన్నారని నిరుడు జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తేలిపోయింది. అప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే మొత్తం మూడు పట్టభద్ర స్థానాలనూ టీడీపీ అనూహ్యంగా గెలుచుకుంది. అప్పటికి కూటమి ఏర్పాటు కూడా జరగలేదు. అయినా ఈ వర్గాల్లో నెలకొన్న వ్యతిరేకతతో టీడీపీ సునాయాసంగా గెలువగలిగింది.


వైసీపీ పథకాలకు దీటుగా..

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న పేద వర్గాలు పూర్తిగా తమ వైపే ఉన్నాయని, వారి మద్దతుతో తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండేవి. అయితే ఆ వర్గాలను ఆకట్టుకోవడానికి టీడీపీ కూటమి సూపర్‌ సిక్స్‌ పేరుతో మరింత సాయం అందించచే హామీలను ప్రకటించింది. అలాగే పింఛను పొందుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్‌ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతూ పెద్ద హామీ ఇచ్చింది. దీంతో పథకాల లబ్ధిదారుల్లో మార్పు వచ్చిందని, వారిలో గణనీయ భాగం విపక్షం వైపు ఆకర్షితులయ్యారని కూటమి నేతలు అంటున్నారు. దీనికి తోడు మరికొన్ని అంశాలు కొన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చాయని ఆ నేతలు చెబుతున్నారు. ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంలోని అంశాలు రైతాంగంలో వైసీపీ ప్రభుత్వం పట్ల బాగా భయాన్ని పెంచాయి. ఈ ప్రభుత్వం వస్తే తమ భూములకు రక్షణ ఉండదన్న అనుమానాలు బలంగా వ్యాపించాయి. అలాగే జగన్‌ ఇసుక విధానం భవన నిర్మాణ కార్మికుల్లో బాగా వ్యతిరేకత పెంచింది. ఈ విధానం వల్ల తమకు పనులు బాగా తగ్గిపోయాయని, ఆర్థికంగా కుదేలయ్యామని వారిలో అత్యధికులు భావిస్తున్నారు. ఇన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్న తర్వాత ఏ ప్రభుత్వమైనా తిరిగి అధికారంలోకి రావడం కష్టం’ అని జనసేనలో క్రియాశీలంగా ఉన్న ముఖ్యుడొకరు అభిప్రాయపడ్డారు. ఈ అంచనాలకు తగినట్లే ప్రచార సమయంలో కూటమి పార్టీల ముఖ్యులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ వంటి వారి సభలకు ప్రజలు పోటెత్తారు. నేతల ప్రసంగాలు పూర్తయ్యేవరకూ కదలకుండా ఉన్నారు. అధికార పార్టీ అర్థ, అంగ బలాలను తట్టుకోగలమా అని కొద్దికాలం క్రితం వరకు ప్రతిపక్ష నేతల్లో కొంత భయం ఉండేది. కానీ ప్రచారం సాగేకొద్దీ ఆ భయం పోతూ వచ్చింది. పోలింగ్‌ సమయానికి నేతలు, శ్రేణుల్లో విశ్వాసం, ఉత్సాహం ఉరకలు వేస్తున్నాయి. మారిన వాతావరణమే దీనికి కారణమని కూటమి నేతలు విశ్లేషిస్తున్నారు. పోలింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల నుంచి ప్రవాహం మాదిరిగా ఓటర్లు తరలిరావడం కూడా కూటమిలో ఆత్మవిశ్వాసం పెంచింది. అమెరికా, బ్రిటన్‌, గల్ఫ్‌ దేశాల నుంచి కూడా ప్రవాసాంధ్రులు అంతకుముందే మాతృభూమికి వచ్చి కూటమికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేయడాన్ని ఆయా పార్టీల నేతలు ప్రస్తావిస్తున్నారు.

Updated Date - May 13 , 2024 | 04:13 AM