Share News

పెద్ద తప్పులు... చిన్న శిక్షలు

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:31 PM

వారంతా రెవెన్యూ ఉద్యోగులు.. ప్రజలు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు.. అప్పట్లో వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. తాము ప్రభుత్వాధికారులమనే కనీస భయం లేకుండా చేయకూడని పనులు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారు.

పెద్ద తప్పులు... చిన్న శిక్షలు

పెద్దిరెడ్డి అండతో బయటపడ్డారు

కూటమి ప్రభుత్వంలో మళ్లీ కేసులు తిరగతోడతారా?

దోషులకు సరైన శిక్షలు పడేనా?

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): వారంతా రెవెన్యూ ఉద్యోగులు.. ప్రజలు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు.. అప్పట్లో వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. తాము ప్రభుత్వాధికారులమనే కనీస భయం లేకుండా చేయకూడని పనులు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారు. వైసీపీ నాయకులకు వందల కోట్లు ఆదాయం చేకూర్చిపెట్టారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు.. తాము చేసిన నీతి బాహ్యమైన పనులను ఎవరూ చూడలేదని ధీమాగా ఉన్నారు. అయితే అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ల పాపాలను వెలుగులోకి తెచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల అండతో నామమాత్రంగా కేవలం బదిలీలతో బయటపడ్డారు. ఈ అక్రమాలపై అప్పట్లో సీసీఎల్‌ఏ వాళ్లందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో విచారణ తూతూమంత్రంగా జరిపి నామమాత్రపు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో తప్పులు చేసిన వాళ్లంతా ప్రస్తుతం మరోచోటుకి బదిలీ అయి ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్పట్లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వంలో మళ్లీ విచారణ జరిగేనా? దోషులకు సరైన శిక్షలు పడేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పీలేరు మండలంలో పెద్ద భూకుంభకోణం జరిగింది. పలువురు తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌వోలు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రదారులుగా మారారు. వైసీపీ నాయకులు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడిన రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు సహకరించారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవడం, డీకేటీ భూముల్లో అక్రమంగా లేఔట్లు వేసి ఫ్లాట్లు విక్రయించడం, ఫోర్జరీ రికార్డులతో ఆస్తులను మార్చుకోవడం వంటి అక్రమాలకు సాయపడ్డారు. సుమారు 600 ఎకరాల్లో జరిగిన ఈ కుంభకోణంలో సుమారు 400 కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు దండుకున్నారు. పీలేరు గ్రామ పంచాయతీ, పీలేరు పట్టణం చుట్టూ ఉన్న బోడుమల్లువారిపల్లె, గూడరేవుపల్లె, ఎర్రగుంట్లపల్లె, దొడ్డిపల్లె, ముడుపులవేముల పంచాయతీల్లో ఈ అక్రమాలు జరిగాయి. అయితే ఈ కుంభకోణంలో పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల పాత్ర ఉండడంతో చాలా రోజుల పాటు బయటపడలేదు. అయితే 2021లో ప్రస్తుత పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. దీంతో అప్పటి చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణ విచారణకు ఆదేశించారు. అప్పటి మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి సుమారు 80 మంది రెవెన్యూ సిబ్బందితో మూడు వారాల పాటు విచారణ జరిపి అక్రమాలు నిజమే అని తేల్చారు. విచారణలో 209.79 ఎకరాల్లో అనధికార లేఔట్లు, 158.19 ఎకరాల చుక్కల భూముల్లో అక్రమాలు, 129.40 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణ, 103.99 ఎకరాల్లో డీకేటీ భూముల నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చారు. కేవలం 129.40 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణల ద్వారానే ప్రభుత్వానికి దాదాపు రూ.90.58 కోట్లు (ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం) మేర నష్టం జరిగినట్లు తేల్చారు. ఈ అక్రమాల వల్ల కొందరు వైసీపీ నాయకులు సుమారు 400 కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.


పలువురిపై చర్యలకు సిఫార్సు

ఈ స్థాయిలో అక్రమాలు జరిగినా ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోలేదనే ఆరోపణలపై సబ్‌ కలెక్టర్‌ 12 మంది రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు. తహసీల్దార్లు పుల్లారెడ్డి, వెంకటరమణ, ఏఆర్‌ఐ అబ్దుల్‌ ఖాదర్‌, ఆర్‌ఐ భార్గవి, వీఆర్‌వోలు కె.శ్రీనివాసులు, ఎం.ప్రసాద్‌ బాబు, పి.రవిప్రసాద్‌, ఎల్‌.నవీన్‌ కుమార్‌, కె.మురళీకృష్ణ, ఎన్‌.సురేశ్‌కుమార్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, ఎం.శాంతకుమార్‌లపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.

పెద్ద తప్పు.. బదిలీతోనే సరి

ఉద్దేశ్యపూర్వకంగానే అధికారులు అక్రమాలకు సహకరించారని విచారణలో తేలింది. దీంతో వీళ్లందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటారని అనుకున్నారు. అయితే అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరి ఆపన్నహస్తం ఆదుకుందో? కానీ కేవలం వీళ్లందరినీ పనిచేస్తున్న చోట నుంచి బదిలీ చేశారు. బదిలీ చేయడమే పెద్ద శిక్ష అన్నట్లు వదిలేశారు. మూడు వారాల పాటు పెద్ద సంఖ్యలో రెవెన్యూ సిబ్బంది చేసిన విచారణ, సబ్‌ కలెక్టర్‌ విచారణా నివేదికలు బుట్టదాఖలయ్యాయి. నామమాత్రపు చర్యలతో వదిలేయడంతో అక్రమాలకు పాల్పడి అక్రమార్కులకు సహకారం అందించిన ఉద్యోగులు ప్రశాంతంగా పీలేరు నుంచి వెళ్లిపోయి మరోచోట ఉద్యోగం చేసుకుంటున్నారు.

సీసీఎల్‌ఏ ఆదేశించినా అవే చర్యలు

నామమాత్రపు చర్యలపై అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి సీసీఎల్‌ఏ ముఖ్యకార్యదర్శి అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. సబ్‌ కలెక్టర్‌ విచారణలో తేలిన బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే అప్పట్లో ఈ అక్రమాలకు సహకరించిన వారందరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శరణు కోరినట్లు సమాచారం. దీంతో వాళ్లందరిపైనా ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకోలేదు. కేవలం బదిలీతోనే సరిపెట్టారు. గత ఎన్నికల వరకు వైసీపీ ప్రభుత్వమే ఉండడంతో వీళ్లందరూ ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపధ్యంలో ఈ అక్రమాలపై మళ్లీ విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత అధికార పార్టీలోని ముఖ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పుడైనా ఈ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:32 PM