YSRCP : నాడు కొడాలి నాని.. నేడు జోగి.. ప్లేసు మారినా తీరు మారలే..!
ABN , Publish Date - Feb 24 , 2024 | 08:22 AM
AP Elections 2024: అవును.. మాజీ మంత్రి కొడాలి నాని స్థానాన్ని ప్రస్తుత మంత్రి జోగి రమేష్ భర్తీ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కథ..? అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..
కృష్ణా జిల్లా/తోట్లవల్లూరు : తోట్లవల్లూరు మండలం రొయ్యూరు క్వారీ వద్ద జోగి మనుషులు పెత్తనం చెలాయిస్తున్నారు. క్వారీకెళ్లే దారిలో చెక్‌పోస్టు ఏర్పాటుచేసి బాడిగార్డును పెట్టారు. గతంలో గుడివాడ మంత్రి కొడాలి నాని (Kodali Nani) అనుచరులు రొయ్యూరు, లంకపల్లి క్వారీలను గుప్పెట్లో పెట్టుకుని కోట్లాది రూపాయల ఇసుకను దోచుకుంటే.. ఇప్పుడు మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఆ పాత్రను పోషిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
7 యంత్రాలు.. వందలాది లారీలు
రొయ్యూరు క్వారీలో ఏడు యంత్రాలు దించారు. వందల లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. పర్యావరణ అనుమతులు రాకుండానే జనవరి 12 నుంచి ఇసుక అక్రమానికి తెరదీశారు. ప్రతిరోజూ సుమారు 500 లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలను తహసీల్దార్ మూడుసార్లు అడ్డుకున్నారు. అయినా లెక్కచేయకుండా మళ్లీ యథేచ్ఛగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని జాతీయ గ్రీన్‌ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నివేదిక ఇచ్చినా అదురూ బెదురు లేకుండా రొయ్యూరులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారం ఉండబట్టేనని విమర్శలు వస్తున్నాయి.
అధికారుల వత్తాసు
ఎన్జీటీకి ఫిర్యాదు చేయడంతో ఇటీవల కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో అధికారులు ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు వచ్చారు. తవ్వకాలు సాగే రొయ్యూరు క్వారీని పరిశీలించకుండా ఎప్పుడో మూతపడిన నార్తువల్లూరు క్వారీని పరిశీలించడం హాస్యాస్పదంగా ఉంది. సంబంధిత శాఖల అధికారులు అక్రమాలకు ఎంతగా వత్తాసు పలుకుతున్నారో దీనిని బట్టి తేటతెల్లమవుతోంది.
టోల్‌గేట్ ఏర్పాటు
కరకట్ట నుంచి రొయ్యూరు క్వారీకి వెళ్లే రహదారిలో కొత్తగా ఓ టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి అక్కడ ఓ బాడీగార్డును నియమించారు. మీడియా అని అనుమానం వస్తే ‘ఎవరు మీరు? ఎక్కడికి వెళ్లాలి?’ అని ప్రశ్నించి వచ్చినవారి సమాచారాన్ని లోపల ఉన్న వ్యక్తులకు బాడీగార్డు అందిస్తాడు. గతంలో అక్రమాలు నడిచినా విలేకరులు ధైర్యంగా క్వారీలోకి వెళ్లి ఫొటోలు తీసే పరిస్థితి ఉండేది. మంత్రి అనుచరులు వచ్చాకే ఈ బాడీగార్డు ఏర్పాటు వల్ల రొయ్యూరు క్వారీలోకి వెళ్లి రావడం సాహసమవుతోంది.
స్థానికులకు తాయిలాలు
ఎవరూ ఫిర్యాదు చేయకుండా రొయ్యూరు గ్రామస్తులను ఇసుక క్వారీ నిర్వాహకులు మచ్చిక చేసుకున్నారు. ఓ సొసైటీ వ్యక్తులు అభ్యంతరం చెప్పటంతో రూ.3 లక్షలు ఇచ్చినట్టు తెలిసింది. గ్రామంలోని ట్రాక్టర్లు, లారీలు ఇసుక కోసం వస్తే 50 శాతం రాయితీతో వెంటనే లోడుచేసి పంపుతున్నారు. దీంతో స్థానిక బలం పెంచుకుని అడ్డూఅదుపు లేకుండా నిర్వాహకులు ఇసుక దోపిడీ సాగిస్తున్నారు.
తవ్వకాలకు అనుమతులు రాలేదు
పర్యావరణ అనుమతి వచ్చిందని అంటున్నారు. అయితే ఆ కాపీ మాకు అందలేదు. ఇసుక ఎక్కడ ఎంత విస్తీర్ణంలో తవ్వాలో హద్దులు చూపేందుకు మమ్మల్ని ఎవ్వరూ అడగలేదు. – ఎం.కుసుమకుమారి, తహసీల్దార్.