Share News

Kurnool : ‘ప్రత్యేక హోదా’ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి

ABN , Publish Date - Aug 19 , 2024 | 05:23 AM

ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగపరమైన నిబంధన అని, దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలా చేయడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చేందుకు వీలుండదన్నారు.

Kurnool : ‘ప్రత్యేక హోదా’ను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి

చంద్రబాబు వచ్చినా అవినీతిపరులపై చర్యల్లేవు

ఇంకా వైసీపీ ప్రభుత్వమే నడుస్తున్నట్లుంది

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యలు

కర్నూలు(కల్చరల్‌), అనంతపురం విద్య, ఆగస్టు 18: ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగపరమైన నిబంధన అని, దాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. అలా చేయడం వల్ల ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చేందుకు వీలుండదన్నారు. ఆదివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోలేని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంపై చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.15వేల కోట్లు బడ్జెట్‌ ప్రకటించినా అది అప్పు రూపంలోనే ఇచ్చిందని, అందుకు ఉప్పొంగి పోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, మోదీకి చంద్రబాబు అవసరం ఉండడం వల్ల ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం మారినా అవినీతిపరులపై చర్యలు లేవని, చంద్రబాబు అధికారంలో ఉన్నా వైసీపీ ప్రభుత్వమే నడుస్తున్నట్లు ఉందని విమర్శించారు. అధికార మార్పిడితోపాటు అవినీతి మార్పిడి జరుగుతోందని, ఉద్యోగులు మారడం లేదని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సెప్టెంబరు1 నుంచి 7 వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.


  • మోదీ చరిత్రహీనుడిగా నిలిచిపోతారు

ప్రజావ్యతిరేక విధానాలతో ప్రధాని మోదీ చరిత్రహీనుడిగా నిలిచిపోతారంటూ నారాయణ మండిపడ్డారు. అనంతపురంలో సీపీఐ సీనియర్‌ నాయకుడు ఎంవీ రమణ సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశాన్ని మోదీ ఫాసిజంలోకి తీసుకెళుతోందన్నారు. ఽధరలు విపరీతంగా పెంచి, సామాన్యుల నడ్డి విరిచారంటూ మండిపడ్డారు. కార్పొరేట్‌కు కొమ్ముకాసే మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన చరిత్రాత్మక కర్తవ్యం ప్రజలపై ఉందన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 19 , 2024 | 05:23 AM