రాష్ట్రాభివృద్ధే డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యం
ABN , Publish Date - Oct 20 , 2024 | 04:58 AM
రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు.
20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ
చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన లంకా దినకర్
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేంద్ర నిధులను దారి మళ్లించిందని, దీని వలన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదని అన్నారు. లంకా దినకర్ శనివారం అమరావతి సచివాలయంలో 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌గా బాఽధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘వికసిత భారత్-2047’లో భాగంగా రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే లక్ష్యంలో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 20 సూత్రాలను అందరికీ తెలిసేలా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఉంచుతామన్నారు. జల్‌జీవన్ మిషన్ అమలుకు అత్యంత ప్రాధాన్యతనిస్తామన్నారు.