Share News

విద్యా కానుక కొనసాగిస్తాం

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:28 AM

రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

విద్యా కానుక కొనసాగిస్తాం

గత ప్రభుత్వంలో విద్యాకానుక నిధుల దుర్వినియోగం

శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి లోకేశ్‌

అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అమరావతి సచివాలయంలోని శాసన మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని అన్నారు. కిట్లు నాసిరకంగా ఉన్నాయని, వాటి కొనుగోళ్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యాకానుక కిట్ల పంపిణీని కొనసాగిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం గతేడాది విద్యాకానుక టెండర్లకు ఆర్థిక అనుమతులు లేకుండానే టెండర్లను ఫైనల్‌ చేసిందన్న విషయం శుక్రవారమే బయటకు వచ్చిందన్నారు. పిల్లలకు పుస్తకాలు ఎక్కువ బరువు ఉన్నాయని, ఈ అంశంపై ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల బ్యాగులు, పుస్తకాల బరువును తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. బైజూస్‌ కంటెంట్‌ అంశంపై కూడా సమీక్షిస్తామన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకిచ్చే బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే అదే పాఠశాలలోగానీ, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గానీ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామని, విద్యాకానుక కింద ఇచ్చే బ్యాగ్‌ల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.

తల్లికి వందనంపై దుష్ప్రచారం

తల్లికి వందనం కార్యకక్రమంపై స్పష్టత ఇచ్చినా కొందరు దుష్ప్రచారం చేయడం తగదని లోకేశ్‌ అన్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే సూపర్‌ సిక్స్‌ హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్లపై పార్టీల రంగులు ఉండకూడదన్నారు. ట్యాబ్‌ల పంపిణీపై ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని దానికి కట్టుబడి ఉన్నామని లోకేశ్‌ చె ప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 2.3 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని, సీఎం చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చే ప్రక్రియను సీఎం ఇప్పటికే చేపట్టారని, రాష్ట్రానికి కావాల్సింది ఫ్యాన్సీ కంపెనీలు కాదని యువతకు ఉద్యోగాలిచ్చే కంపెనీలు రావాలని చెప్పామని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 03:29 AM