Share News

Chandrababu 4.0: చంద్రబాబు నెల రోజుల పాలన ఎలా ఉంది..?

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:31 AM

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మర్నాడే చంద్రబాబు ఒకేసారి ఐదు కీలక నిర్ణయాలకు తొలి సంతకాలు చేశారు. పింఛన్ల భారీ పెంపు,...

Chandrababu 4.0: చంద్రబాబు నెల రోజుల పాలన ఎలా ఉంది..?

  • ఆర్భాటం లేకుండా అణకువగా ముందుకు.. బాబు 4.0 పాలనకు నేటితో నెల రోజులు

  • అభివృద్ధి మంత్రం.. సంక్షేమ సంతకం.. పేదలు, దివ్యాంగుల పింఛన్లు భారీగా పెంపు

  • జగన్‌ జమానాలో వెయ్యి పెంపునకు నాలుగేళ్లు.. వచ్చిన 15 రోజుల్లోనే అంత మొత్తం ఇచ్చిన బాబు

  • మళ్లీ పట్టాలెక్కిన అమరావతి రాజధాని నిర్మాణం.. కేంద్రంతో బలపడిన బంధంతో రాష్ట్రానికి శుభం

  • ఇసుక మాఫియాకు ముకుతాడుతో తగ్గిన ధరలు.. మెగా డీఎస్సీ, టైటిలింగ్‌ చట్టం రద్దు, అన్న క్యాంటీన్లు

  • రిఫైనరీతోపాటు కొత్త కంపెనీల రాకకు మార్గం సుగమం.. తన శాఖల్లో పవన్‌ మార్క్‌.. చురుగ్గా మరికొందరు

  • వైసీపీ అరాచక శక్తులపై చర్యల్లేవని క్యాడర్‌ అసంతృప్తి.. వట్టిపోయిన ఖజానాతో అల్లాడుతున్న ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మర్నాడే చంద్రబాబు ఒకేసారి ఐదు కీలక నిర్ణయాలకు తొలి సంతకాలు చేశారు. పింఛన్ల భారీ పెంపు, వివాదాస్పద లాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీ ఎస్సీ నిర్వహణ, రూ. ఐదుకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాల అంచనా కోసం నైపుణ్య గణన నిర్వహణ ఈ ఐదు సంతకాల్లో ఉన్నాయి. తొలి సంతకాలపై ఇచ్చిన హామీలు రెండే! కానీ, ఒకేసారి ఐదు నిర్ణయాలు వెంటనే తీసుకొని సంచలనం కలిగించారు. పోలవరం, అమరావతి, ఉచిత ఇసుక వంటి విషయాల్లో చంద్రబాబు నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచాయి. కేంద్రంతో సత్సంబంధాలవల్ల రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనం కలిగేలా గట్టి అడుగులు పడుతున్నాయి.


Chandrababu-Oath.jpg

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రికార్డు ఆధిక్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి ప్రభుత్వం తన తొలి నెల పాలనలో వడివడిగా అడుగులు వేసింది. వైసీపీ విధ్వంస పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడం ప్రధాన ఎజెండాగా పాలన చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం, ఆ దిశగా కొంత మార్పు చూపించగలుగుతోంది. హడావుడి, ఆర్భాటం లేకుండా అణుకువగా ఈ ప్రభుత్వం పని చేస్తోందన్న పేరు తెచ్చుకొంది. అప్పులు తప్ప ఖజానాలో చిల్లి గవ్వ లేని పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం పేదలకు పింఛన్ల విషయంలో తన మాట నిలుపుకొంది. చంద్రబాబు 4.0 పాలనకు శ్రీకారం చుడుతూ, గత నెల 12వ ప్రమాణం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పేదలు, దివ్యాంగుల పింఛన్లను భారీగా పెంచారు. పేదల పింఛన్లు రూ.వెయ్యి పెంచడానికి వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల సమయం తీసుకోగా, అదే మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం కేవలం పదిహేడు రోజుల్లో పెంచింది. రూ. మూడు వేల నుంచి పేదల పింఛన్లను రూ. నాలుగు వేలకు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు రూ. నాలుగు నుంచి రూ. ఆరు వేలకు పెంచారు. పూర్తి అంగ వైకల్యంతో బాధపడుతున్న వారికి ఇచ్చే పింఛన్లు ఏకంగా రూ. పదిహేను వేలకు పెంచారు. ఈ పెంపును గత మూడు నెలల నుంచి వర్తింప చేస్తూ ఆ మొత్తాన్ని కూడా జూలై నెల పింఛన్లతోపాటు కలిపి ఇచ్చారు. ఇంత మొత్తం డబ్బులు పింఛనుదారులకు అందడం ఇదే ప్రథమం.


Chandrababu-3.jpg

కేంద్రం నుంచి శుభ సంకేతాలు

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభ సంకేతాలు రావడం మొదలైంది. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అవసరమైన బలాన్ని సమకూర్చడంలో టీడీపీ పాత్ర ప్రముఖంగా ఉండటం దీనికి కారణం. చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వయంగా హాజరై టీడీపీ ప్రాముఖ్యతను చాటారు. పాలనాపగ్గాలు చేపట్టిన తొలి నెలలోనే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, ప్రధాని సహా ఎనిమిది మంది మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పఽథకాలపై వినతులను ఇచ్చి వచ్చారు. దీని ఫలితాలు వేగంగా కనిపించాయి. అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు భూ సమీకరణతో సహా మొత్తం వ్యయాన్ని భరించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. రూ. అరవై వేల కోట్ల వ్యయంతో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటుపై చర్చించడానికి బీపీసీఎల్‌ కంపెనీ సీఎండీతోపాటు ముఖ్య అధికారగణం తరలివచ్చింది. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. ఐదు వేల కోట్ల వరకూ మంజూరుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి వ్యయం అయ్యే రూ. వెయ్యి కోట్లు కేంద్రం భరించేలా రాష్ట్రం ఒప్పించగలిగింది. జీఎస్టీ వాటా నిధులు తెలంగాణకు రూ. 2200 కోట్లు విడుదల అయితే ఏపీకి రూ. నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అందాయని చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించగలదని రాష్ట్రం ఆశిస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా వివిధ పఽథకాల రూపంలో కేంద్రం నుంచి కొంత అదనపు సాయం రాబట్టగలమని టీడీపీ ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల దృష్టికి తేవడానికి కూడా టీడీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది. కీలకమైన రంగాల్లో ఏం నష్టం జరిగిందో శ్వేత పత్రాల రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికి మూడు పత్రాలను విడుదల చేశారు.


Chandrababu-Cabinet.jpg

జె.మాఫియా గాయబ్‌

గత ఐదేళ్లుగా పెండింగ్‌లో పడి సుదీర్ఘ రైతుల ఉద్యమానికి కారణమైన అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనేపట్టాలెక్కించింది. రాజధానిలో నిర్మాణం మొదలై అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను చంద్రబాబు స్వయంగా సందర్శించారు. వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అమరావతికి కంపెనీలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను రప్పించడానికి చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంపై కూడా తొలినెలలోనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ ప్రాజెక్టును చంద్రబాబు స్వయంగా వెళ్లి చూడటంతోపాటు కేంద్రంతో మాట్లాడి అంతర్జాతీయ నిపుణులను కూడా వెంటనే రప్పించి వారితో అధ్యయనం చేయించారు. వైసీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దోపిడీ, అవినీతికి ముకుతాడు వేస్తూ, ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో పలు చోట్ల ఇసుక ధరలు నేలకు దిగి వచ్చాయి. ఇసుకను పెద్ద ఆదాయ వనరుగా మార్చుకొని జేబులు నింపుకొన్న జె.మాఫియా.... ప్రభుత్వం మారగానే రాష్ట్రం నుంచి అదృశ్యం కావడం విశేషం. విశాఖ పర్యటనకు వెళ్లి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మెడ్‌ టెక్‌ జోన్‌ నిర్మాణ పురోగతిని పరిశీలించడంతోపాటు విశాఖ నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు.


Chandrababu-Cabinet.jpg

కొన్ని శాఖల్లో చురుకుదనం

చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు కొందరు తమ శాఖల పరిధిలో వేగం ప్రదర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన శాఖలపై వరుసగా పలు సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులను కదిలించారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్‌ తాను చూస్తున్న విద్యా శాఖలో దారి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజాదర్బార్‌ పేరుతో ఆయన రోజూ ఉదయం వందల మంది ప్రజలను తన నివాసంలో కలుస్తూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ బియ్యం గోదాముల్లో వరుస తనిఖీలు జరిపి బియ్యం మాఫియాకు వణుకు తెప్పించారు. సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ వంటివారు కూడా తమ శాఖల్లో వేగం ప్రదర్శిస్తున్నారు. మహిళా మంత్రుల్లో హోం మంత్రి అనిత బాగా చురుగ్గా కనిపిస్తున్నారు.

Chandrababu-1.jpg

క్యాడర్‌లో కొంత అసహనం

పాలనపరంగా చంద్రబాబు ప్రభుత్వం తొలి నెల పాలనలో కొన్ని కీలకమైన అడుగులు వేసి ప్రభావం చూపించినా, రాజకీయపర మైన అంశాల్లో క్యాడర్‌లో కొంత అసహనం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్‌ను, సానుభూతిపరులను తీవ్రంగా వేధించి, బాధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వేగం కనిపించడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ హయాంలో అధికార పార్టీకి అంతేవాసులుగా పనిచేసిన అధికారులకు ఈ ప్రభుత్వంలో కూడా మంచి పోస్టింగులు దొరుకుతున్నాయని, అప్రతిష్ఠపాలైన అధికారులను ఆ సీట్ల నుంచి మార్చడానికి నెల రోజులైనా ఇంకా చర్యలు తీసుకోలేదని వారు పెదవి విరుస్తున్నారు. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకొన్నవారు, అవినీతిని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్లినవారు, అధికారాన్ని అయినకాడికి దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు లేకపోతే ఎలా అన్నది వారి నుంచి వినవస్తున్న ప్రశ్న. వైసీపీ పాలన దెబ్బకు ఖజానా వట్టిపోవడంతో ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అల్లాడుతున్నారు. కనీసం రోడ్ల మరమ్మతులు, డ్రైనేజి కాల్వలు బాగు చేయడానికి కూడా ప్రభుత్వ శాఖల్లో నిధులు లేకపోవడం వారిని ఇబ్బంది పెడుతోంది. దీనికితోడు టీడీపీ సానుభూతిపరుల బిల్లులను వైసీపీ హయాంలో పూర్తిగా నిలిపివేసింది. వారు ఇప్పుడు తమ బిల్లుల సంగతి చూడాలని మొర పెట్టుకోవడం టీడీపీ ప్రభుత్వానికి సంకటంగా మారింది.

Chandrababu-2.jpg

Updated Date - Jul 12 , 2024 | 11:40 AM