Share News

ఢిల్లీలో మాధవరెడ్డి?

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:32 AM

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత సంఘటనలో ప్రధాన అనుమానితుడైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ఢిల్లీకి పారిపోయినట్టు సమాచారం.

ఢిల్లీలో మాధవరెడ్డి?

వైసీపీ పెద్దల రక్షణలో ఫైళ్ల దహనం నిందితుడు!

కేసులో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడే కీలకం

ఏపీకి తెచ్చేందుకు మొదలైన సీఐడీ వేట

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి రెండోరోజూ పోటెత్తిన పెద్దిరెడ్డి బాధితులు..

(రాయచోటి-ఆంధ్రజ్యోతి)

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత సంఘటనలో ప్రధాన అనుమానితుడైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ఢిల్లీకి పారిపోయినట్టు సమాచారం. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే, కేసు ఒక కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏపీ సీఐడీ పోలీసులు ‘ఆపరేషన్‌ మాధవరెడ్డి’ మొదలు పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీలో మాధవరెడ్డి...వైసీపీలోని పెద్ద తలకాయల సంరక్షణలో ఉన్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రస్థాయిలో కీలకమైన అధికారుల పర్యవేక్షణలో మాధవరెడ్డి కోసం రహస్యంగా వేట కొనసాగుతున్నట్లు సమాచారం. గత ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం మంటల్లో చిక్కుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆర్డీవో మీడియాతో చెప్పారు. అయితే ఉదయానికంతా షార్ట్‌ సర్క్యూట్‌ కహానీలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీనియర్‌ అసిస్టెంట్‌ గౌత మ్‌ తేజ్‌ ఆదివారం రాత్రి పదకొండు గంటల వరకు ఆఫీసులో ఉన్నాడని, అక్కడ వాచ్‌మెన్‌గా విధుల్లో ఉన్న వీఆర్‌ఏ రమణయ్య బయటపెట్టారు. దీంతో ఈ సంఘటనపై ఆనుమానాలు వ్యక్తమయ్యాయి. సోమవారం ఉదయమే కలెక్టర్‌, ఎస్పీలు సంఘటనాస్థలానికి వచ్చి విచారణ ప్రారంభించారు. సాయంత్రానికి డీజీపీ, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అక్కడకు చేరుకున్నారు. అదుపులో ఉన్న గౌతమ్‌తేజ్‌, రమణయ్యతో పాటు ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్‌ను విచారించారు. మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅనుచరుడైన మాధవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతను అక్కడ లేడు. సుమారు రెండు బస్తాల డాక్యుమెంట్లను పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. అయితే మాధవరె డ్డి మాత్రం పరారయ్యాడు. దీని వెనుక కొందరు స్థానిక పోలీసుల సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటన జరిగిన తర్వాత గంటల వ్యవధిలోనే.. దీనివెనుక. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, బినామీల ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే సుమారు ఒకటిన్నర రోజు వరకు మాధవరెడ్డి కోసం పోలీసులు ప్రయత్నించకపోవడంతో... అతను దర్జాగా మదనపల్లె దాటేశాడు. మాధవరెడ్డితో గత కొన్నేళ్లుగా అంటకాగిన కొందరు పోలీసులే....ఉన్నతాఽధికారులను తప్పుదోవ పట్టించారని చెబుతున్నారు.

సిబ్బందికి నోటీసులు..

సంఘటన జరిగిన రోజునుంచీ సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చెందిన సిబ్బందిని సెక్షన్ల వారీగా పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం వారిలో ఘటనాస్థలంలో ఉన్నవారిని ఉంచుకుని, మిగతావారందరినీ పోలీసులు పంపించివేశారు. పిలిస్తే తిరిగి విచారణకు రావాల్సి ఉంటుందని వారికి నోటీసులు అందించారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆధ్వర్యంలో అనుమాతుల విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ సెక్రటరీ సిసోడియా శుక్రవారం ఉదయం విజయవాడకు బయలుదేరారు. సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ గురువారం రాత్రే విజయవాడ చేరుకున్నారు.

రెండో రోజూ భూబాధితుల వినతులు

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లోని రెవెన్యూ రికార్డులు దహనమైన నేపథ్యంలో రెండోరోజు కూడా రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆర్పీ సిసోడియా... ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. శుక్రవారం ఉదయం విజయవాడకు బయలుదేరిన సిసోడియాకు సబ్‌కలెక్టరేట్‌ గేటు వద్ద పెద్ద సంఖ్యలో బాధితులు వినతులు అందజేశారు. గురువారం, తొలిరోజు 400 మంది తమ సమస్యలపై ఆయనకు అర్జీలు అందజేశారు. ఇక, రెండోరోజు ఎక్కువగా భూకబ్జాలకు సంబంధించిన వినతులే అందటం గమనార్హం. దీనిపై సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫ్రీహోల్డ్‌ అయిన రెండు లక్షల ఎకరాల భూమిలో 4,500 ఎకరాలకు రిజిస్ర్టేషన్‌ జరిగింది. జబర్ద్‌స్తగా స్వాధీనం చేసుకున్న వాటిపైనే చాలా ఫిర్యాదులు వచ్చాయి. కొన్నింటిపై కోర్టు కేసులు నడుస్తున్నాయి. సబ్‌కలెక్టరేట్‌లో దహనం అయిన ఫైళ్లన్నీ రీక్రియేట్‌ చేస్తాం. వాటి తాలూకు ఫైళ్లు ఆయా మండలాల తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఒక కాపీ, కలెక్టరేట్‌లో ఇంకో కాపీ ఉంటాయి. కాబట్టి, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు.

రూ.70కోట్ల భూమిని రూ.3 కోట్లకే లాక్కొన్నారు

‘‘మా మామకు 20 ఏళ్ల ముందు ప్రభుత్వం మదనపల్లె బీకేపల్లె గ్రామం సర్వే నంబర్‌ 552లో 4.85 ఎకరాల మిలిటరీ పట్టా ఇచ్చింది. ఇప్పుడు మా మమ లేరు. నా భర్త, ఆయన అన్న కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ భూమి పక్కనే బైపాస్‌ రోడ్డు పోతుండటంతో భూమి రేట్లు బాగా పెరిగాయి. దీంతో పెద్దిరెడ్డి కన్ను మా భూమి మీద పడింది. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి మా దాయాదులను బెదిరించి రూ.70 కోట్ల భూమిని రూ.3 కోట్లకే కొన్నాడు. విక్రయానికి సంబంధించి నేనెలాంటి సంతకమూ చేయలేదు.’’

- ఆకుల అన్నపూర్ణ, మదనపల్లె

Updated Date - Jul 27 , 2024 | 03:33 AM