Meteorological Department (IMD) :మూడు రోజుల్లో సీమకు నైరుతి?
ABN , Publish Date - Jun 02 , 2024 | 04:59 AM
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.
రేపటి నుంచి రాష్ట్రంలో పెరగనున్న వర్షాలు
ఏలూరు జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి
నేడూ కొనసాగనున్న ఎండలు, ఉక్కపోత
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.
ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో వర్షాలు కురుస్తుండగా, శుక్రవారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. శనివారం దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రంగా ఉండడంతోపాటు అక్కడక్కడ వడగాడ్పులు వీచాయి.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం తర్వాత ఎండ ప్రభావం చూపింది. వడగాడ్పులు తగ్గాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రాజంపేటలో 32.5, గుంతకల్లులో 30.5, గుడుపల్లెలో 24.2, చిత్తూరులో 21, తవణంపల్లెలో 18.7, భీమునిపట్నంలో 18.2, కొయ్మూరులో 17.7, తొండంగిలో 15.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండలు, ఉక్కపోత కొనసాగుతాయని, అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
వడదెబ్బకు ఒకే గ్రామంలో ఇద్దరి మృతి
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగరంలో ఇద్దరు వృద్ధులు వడదెబ్బకు మృతి చెందారు. గ్రామానికి చెందిన ఏలూరి ముక్తేశ్వరరావు(63) శుక్రవారం తాను సాగు చేస్తున్న ఆకుకూరల తోట వద్దకు వెళ్లి వడ దెబ్బకు గురయ్యారు. గ్రామానికి చెందిన షేక్ మహబూబి (70) ఎండ తీవ్రత తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా రాత్రికి మరణించారు. మృతదేహాలను శనివారం గ్రామానికి తీసుకొచ్చారు.