3 నెలల్లో విశాఖకు టీసీఎస్
ABN , Publish Date - Nov 22 , 2024 | 03:34 AM
వైసీపీ అరాచక పాలనలో నిర్వీర్యమైన రాష్ట్ర ఐటీ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నారాలోకేశ్ స్పష్టం చేశారు.
ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల సృష్టే లక్ష్యం: లోకేశ్
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచక పాలనలో నిర్వీర్యమైన రాష్ట్ర ఐటీ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి నారాలోకేశ్ స్పష్టం చేశారు. మూడు నెలల్లోనే విశాఖకు ప్రతిష్ఠాత్మక టీసీఎస్ కంపెనీ తీసుకొస్తామని, అదానీ డేటా సెంటర్ కూడా వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఐటీ ఆధారిత ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో సభ్యులు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, గంటా శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం చెప్పారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చే సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం 2014-19లో ప్రోత్సాహకాలు కల్పిస్తే.. ఐదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెద్దలు వాటాలు ఇవ్వబోమన్న ఐటీ పరిశ్రమల్ని ఖాళీ చేయించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలసీని కొనసాగించి ఉంటే విశాఖపట్నం ప్రపంచ డేటా సెంటర్‌కు కేంద్రం అయ్యేదన్నారు.