Share News

నమ్మించి.. రూ.4కోట్లకు టోకరా

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:00 AM

నల్లచెరువు మండల కేంద్రానికి రెండు నెలల క్రితం వచ్చిన ఓ వ్యక్తి.. అద్దె గదిలో ఉంటూ.. అందరినీ నమ్మించి రూ.4 కోట్లకు టోకరా వేశాడు.

నమ్మించి.. రూ.4కోట్లకు టోకరా
మహేశ్వర్‌రెడ్డి (ఫైల్‌)

చక్కెర వ్యాపారం పేరిట హడావుడి

అధిక వడ్డీ చెల్లిస్తూ.. అప్పులకు వల

వేరుశనగ, బియ్యం, పొట్టేళ్ల కొనుగోలు

స్నేహితుల వద్ద బంగారం తీసుకుని..

రెండు రోజుల క్రితం అదృశ్యం

కదిరి/నల్లచెరువు, జూలై 25: నల్లచెరువు మండల కేంద్రానికి రెండు నెలల క్రితం వచ్చిన ఓ వ్యక్తి.. అద్దె గదిలో ఉంటూ.. అందరినీ నమ్మించి రూ.4 కోట్లకు టోకరా వేశాడు. చక్కెర వ్యాపారంతో ప్రారంభించి.. వేరుశనగ, బియ్యం, పొట్టేళ్లు.. ఇలా వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నట్లు నమ్మించాడు. అతని హంగు, ఆర్భాటం చూసి చాలామంది అప్పులు ఇచ్చారు. మొదట్లో వారానికి రూ.లక్షకు రూ.5 వేల దాకా వడ్డీ ఇచ్చి.. వల విసిరాడు. దీంతో అత్యాశకుపోయి అతనికి చాలామంది రూ.లక్షలకు లక్షలు అప్పులు ఇచ్చారు. నల్లచెరువుకు రెండు నెలల క్రితం వచ్చిన ఆ వ్యక్తి.. తన పేరు మహేశ్వర్‌రెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. నల్లచెరువు బస్టాండ్‌ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ గదికి కార్పొరేట్‌ హంగులు సమకూర్చుకున్నాడు. మొదట చక్కెర వ్యాపారం మొదలు పెట్టాడు. లారీల కొద్ది చక్కెరను తీసుకువచ్చి మండలకేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో విక్రయించాడు. ఆయన వ్యాపార ఆర్భాటం చూసి, స్థానికంగా ఉన్న కొంతమంది చేరువయ్యారు. వారి నుంచి కొంత డబ్బు తీసుకోవడం.. వారం వారం రూ.లక్షకు రూ.5 వేల వడ్డీ చెల్లించాడు. ఇది చూసి మరికొందరు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ఇచ్చారు. ఇద్దరు వ్యాపారుల వద్ద ఆయన 80 బస్తాల బియ్యం తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలించాడు. ఒక లారీ లోడు వేరుశనగ కాయలు కొన్నాడు. వివిధ గ్రామల్లో ఆరు వందల పొట్టేళ్లు కొనుగోలు చేశారు. వారంలోపు డబ్బులు చెల్లిస్తానని నమ్మించాడు. తన భార్య శుభకార్యానికి వెళుతోందని చెప్పి.. తనతో స్నేహం చేసిన ఇద్దరి నుంచి రెండు రోజుల క్రితం 20 తులాల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. అంతే..! బుధవారం మాయమైపోయాడు. ఆయన సెల్‌ ఫోన నంబర్లు పనిచేయడం లేదు. దీంతో డబ్బులిచ్చినవారు, లావాదేవీలు నడిపిన వ్యాపారులు కంగారుపడ్డారు. అతని కోసం గురువారం ఉదయం వరకు వివిధరకాలుగా ప్రయత్నించారు. ఆచూకీ లభించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి.. నల్లచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ శ్రీలత దృష్టికి తీసుకెళ్లారు. మొత్తంగా అతను రూ.4 కోట్ల వరకూ టోకరా వేసినట్లు సమాచారం.

Updated Date - Jul 26 , 2024 | 12:00 AM