Nara Lokesh : బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వండి
ABN , Publish Date - Oct 31 , 2024 | 05:05 AM
బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వాలని, టెక్నాలజీ, తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని మంత్రి నారా లోకేశ్ కోరారు.
టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకరించండి
ఇంద్రానూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవోతో లోకేశ్ భేటీ
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): బ్రాండ్ ఏపీ రూపకల్పనకు మద్దతివ్వాలని, టెక్నాలజీ, తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆయన లాస్‌వేగా్‌సలోని ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో విడివిడిగా సమావేశమై చర్చలు జరిపారు. ఇంద్రానూయితో భేటీ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ టెక్నాలజీ, తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని కోరారు. విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధితో యువతకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. నైపుణ్యం కలిగిన యువత వారి కెరీర్‌లో విజయం సాధించడానికి దోహదపడే మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలని కోరారు. ఏపీలో సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ప్రత్యక్షంగా చూడటానికి ఒకసారి రాష్ట్రాన్ని సందర్శించాలని కోరారు. మంత్రి ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం)ను మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ ఐన్‌స్టీన్ అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఏపీలో పరిచయం చేయాలని సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాను మంత్రి లోకేశ్ కోరారు. స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై దృష్టి సారించామని, ఏపీలో ఏఐ స్కిలింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకరిచాలని కోరారు. సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రాక్టికల్ ట్రైనింగ్, టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్ట్‌పలకు ఏఐ టూల్స్, మెంటార్‌షి్‌పను అందించాలని కోరారు. ఏపీలోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం అందించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో మాట్లాడతానని క్లారా తెలిపారు.