ఉల్లి, టమాటా ధరలు పైపైకి..
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:11 AM
మార్కెట్‌లో ఉల్లి, టమాటా ధరలు ఎగబాకుతున్నాయి. వర్షాలు, వరదలకు ఇతర రాష్ట్రాల్లో టమాటా, ఉల్లి దిగుమతులు తగ్గడంతో ఏపీలో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉల్లి, టమాటా సెంచరీకి సిద్ధంగా ఉన్నాయి.
దసరాకు సెంచరీ దాటే అవకాశం
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో ఉల్లి, టమాటా ధరలు ఎగబాకుతున్నాయి. వర్షాలు, వరదలకు ఇతర రాష్ట్రాల్లో టమాటా, ఉల్లి దిగుమతులు తగ్గడంతో ఏపీలో వీటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉల్లి, టమాటా సెంచరీకి సిద్ధంగా ఉన్నాయి. గతవారం కొత్త ఉల్లి కిలో రూ.40, పాత ఉల్లి రూ.60 ఉండగా, ఇప్పుడు పాత ఉల్లిపాయలు రూ.80పైనే పలుకుతున్నాయి. టమాటా గతవారం రూ.50లోపు ఉండగా, ఇప్పుడు రూ.80చేరింది. తాజాగా మదనపల్లె మార్కెట్‌లో 10కిలోల టమాటాలు రూ.880 పలికింది. దీంతో కిలో రిటైల్ ధర రూ.90కు చేరింది. మళ్లీ ధర పెరిగితే.. రవాణా ఖర్చులతో కలిపి, నాణ్యమైన టమాటా కిలో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తున్నారు. ఇక మహారాష్ట్రలో నాణ్యమైన ఉల్లి క్వింటా రూ.3,500 వరకు పలుకుతోంది. దీంతో ఏపీ మార్కెట్‌లో పాత ఉల్లిని కొందరు బయటకు తీయడంలేదు. ధర తక్కువగా ఉన్న కొత్త సరుకును రిటైల్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. ఇవే రకం ఇంటి ముందు తోపుడు బండ్లపై రూ.100కు 2కిలోలు ఇస్తున్నారు. రైతుబజార్లలో టమాటా కిలో రూ.65, ఉల్లి రూ.40చొప్పున విక్రయిస్తున్నా.. సరుకు నాణ్యత ఉండటం లేదని వినియోగదారులు చెప్తున్నారు. దసరా పండుగ లోపే ఉల్లి, టమాటా కిలో వందకు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది