Share News

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:29 AM

విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్‌ ప్రాంతంలో ఎన్‌సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

Peethala Murthyadav : ఎన్‌సీసీ భూములు వైసీపీ గుప్పిట్లో..!

  • మాజీ మంత్రి కొట్టు డైరెక్షన్‌లో తతంగం

  • ప్లాన్‌ లేకపోయినా భవన నిర్మాణాలకు

  • జీవీఎంసీ కమిషనర్‌ పరోక్ష సహకారం

  • జనసేన కార్పొరేటర్‌ మూర్తి ఆరోపణలు

విశాఖపట్నం, జూలై 8(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్‌ ప్రాంతంలో ఎన్‌సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. టీడీపీ నేతలతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మధురవాడలో సర్వే నంబర్‌ 411, 412, 419/1, 419/2, 419/3లలోని 97.3 ఎకరాలను 2005లో అప్పటి ప్రభుత్వం ఎన్‌సీసీకి కేటాయించింది. దీనిలో 10 శాతం భూమిలో హౌసింగ్‌బోర్డు కార్పొరేషన్‌తో కలిసి పేదలకు ఇళ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించారు. మిగిలిన దానిలో 173 విల్లాలు, క్లబ్‌హౌ్‌సతోపాటు 22 కమర్షియల్‌ ప్లాట్‌లు, 32 రెసిడెన్షియల్‌ ప్లాట్లు అభివృద్ధి చేయాలి.

వీటిని విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంలో 3 శాతం సొమ్మును ప్రభుత్వానికి జమచేయాలి. ఈ నిబంధనతోనే ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం ధర ప్రకారం ఎన్‌సీసీ డబ్బులు చెల్లించడంతో 2010 ఫిబ్రవరిలో ఆ భూమిని కంపెనీకి అప్పగించారు. అయితే, ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడంతో 2013, ఫిబ్రవరిలో అగ్రిమెంట్‌ను రద్దు చేసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. దీనిపై ఎన్‌సీసీ హైకోర్టుకు వెళ్లడంతో 2014, జనవరిలో కోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది. 2016లో సదరు భూమిలో ప్రభుత్వవాటాగా చెల్లించాల్సిన మొత్తానికి 20 శాతం అదనంగా చెల్లిచేందుకు ఎన్‌సీసీ ముందుకు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ భూమిని ఫ్రీహోల్డ్‌ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ భూమిపై కమిటీ వేసి ఫ్రీహోల్డ్‌ చేయడానికి సుమారు రూ.97 కోట్లు చెల్లించాలని ఎన్‌సీసీని ఆదేశించింది. ఆ మొత్తం కట్టడంతో భూమిని సేల్‌డీడ్‌ రిజిస్ర్టేషన్‌ చేశారు. కానీ, అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అప్పటి సీఎం జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్‌ తదితరులు ఆ భూమిపై కన్నేశారు. ఎన్‌సీసీ కంపెనీని బెదిరించి రూ.250 కోట్లకు ఆ భూమిని కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి డైరెక్టర్‌గా ఉన్న జీపీఆర్‌ఎల్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ స్వాధీనం చేసుకుంది.

ఆ తర్వాత ఎన్‌సీసీ పేరుతో వ్యవహారం జరుగుతున్నట్టు చూపించి లోపాయికారీగా చక్రం తిప్పారు. ఆ భూమిలో విల్లాల నిర్మాణానికి అనుమతి కోరుతూ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ భూమి కొండ పోరంబోకుగా ఉండడంతో దాని విలువలో 3 శాతం నాలా చార్జీలు చెల్లించి ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసుకోవాలని, వీఎల్‌టీ కింద రూ.20 కోట్లు జీవీఎంసీకి చెల్లించాలని జీవీఎంసీ కోరింది.


అదేసమయంలో ఆ భూమిలో చెరువు ఉన్నట్టు డాక్యుమెంట్లలో ఉన్నా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం కనిపించడం లేదని, కాబట్టి అధికారుల నుంచి స్పష్టత అవసరమని పేర్కొంటూ జీవీఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 22న రిమార్కులు రాసి షార్ట్‌ ఫాల్‌లో పెట్టారు. అయినప్పటికీ జీవీఎంసీ కమిషనర్‌ మాత్రం దీనిని వెనక్కి పంపించకపోవడంతో ఇప్పుడు ‘డీమ్డ్‌ టుబీ అప్రూవల్‌’ అయింది. ఆ భూమిలో నిర్మాణాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కమిషనర్‌ ఆదేశాల కారణంగానే టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది అడ్డుకోవడం లేదు’’ అని మూర్తి యాదవ్‌ వివరించారు.

ప్రత్యేక రోడ్డు కూడా

ఎన్‌సీసీ భూమికి రెండు వైపులా 80 అడుగుల మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు ఉన్నా.. కేవలం వారికి మాత్రమే పనికొచ్చేలా మరో 80 అడుగుల మాస్టర్‌ప్లాన్‌ రోడ్డును పొందుపరిచారని మూర్తి యాదవ్‌ తెలిపారు. ఆ రోడ్డుకు అవసరమైన భూమిని ఉచితంగానే జీవీఎంసీకి గిఫ్ట్‌ డీడ్‌ ఇస్తామని చెప్పినప్పటికీ, దానికి మళ్లీ రూ.600 కోట్లు విలువైన టీడీఆర్‌ ఇవ్వాలని ఆ సంస్థ దరఖాస్తు చేయడం, జీవీఎంసీ అధికారులు జారీ చేసేందుకు సిద్ధం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. వైసీపీ ముఖ్యనేతల ప్రోద్బలంతోనే ఎన్‌సీసీ భూమికి మాత్రమే ఉపయోగపడే రోడ్డుని జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి రూ.17 కోట్లు వెచ్చించి రోడ్డు నిర్మించాలని చూసిందన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల వరకు పనిచేసిన శ్రీలక్ష్మి జీవో జారీచేశారని తెలిపారు. ఆగమేఘాల మీద ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్లు పిలిచారన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 05:29 AM