ఈ నెలా పింఛన్ కష్టాలు
ABN , Publish Date - May 02 , 2024 | 05:47 AM
పెన్షన్ కోసం మే నెలలోనూ వృద్ధులకు కష్టాలు తప్పలేదు. బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో డబ్బులు తీసుకునేందుకు చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు.
బ్యాంకుకు వచ్చి వడదెబ్బతో వృద్ధుడి మృతి
కొందరు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు కట్
మైనస్ ఖాతాల్లో జమ చేయడంతో కోత
రాయచోటి (ఆంరధజ్యోతి), హనుమాన్‌జంక్షన్, రుద్రవరం, మే 1: పెన్షన్ కోసం మే నెలలోనూ వృద్ధులకు కష్టాలు తప్పలేదు. బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో డబ్బులు తీసుకునేందుకు చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంట్లపల్లెకు చెందిన ముద్రగడ్డ సుబ్బన్న వృద్ధాప్య పెన్షన్ వచ్చిందో లేదో తెలుసుకునేందుకు రాయచోటి కెనరా బ్యాంకు వద్దకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చారు. మేడే కారణంగా బుధవారం బ్యాంకుకు సెలవన్న విషయం తెలియక వచ్చారు. ఎండలో ఉండటంతో కాసేపటికి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో పలువురు లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో పింఛను సొమ్ము జమ కాగానే డబ్బులు కట్ అయ్యాయి. మైనస్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాల్లో పింఛను జమ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చేతికి వస్తుందనుకున్న సొమ్ములో కొంత భాగం బ్యాంక్ చార్జీల రూపంలో కట్ కావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండలంలోని తోట సాంబయ్య అనే వృద్ధుడికి మూడు వేల రూపాయలకు బదులు 2662 రూపాయలు చేతికొచ్చాయి. 338 రూపాయలు కట్ చేశారని బాధితుడు వాపోయారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని కొండమాయపల్లె గ్రామానికి చెందిన ఇమాంబీ తాను నడవలేని పరిస్థితిలో ఉన్నానని, బ్యాంకు ఎక్కడో ఉందని, ఎట్లా వెళ్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ కోసం గ్రామంలోని పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఉన్న సిబ్బంది.. ‘నీకు పింఛన్ ఇక్కడ ఇవ్వడం లేదు. బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు..’ అని చెప్పారు.