Share News

రాష్ట్రపతి పాలన విధించాలి

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:17 AM

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో 24న వైసీపీ ధర్నా చేస్తుందని ప్రకటించారు.

రాష్ట్రపతి పాలన విధించాలి

రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో 24న ధర్నా: జగన్‌

లా అండ్‌ ఆర్డర్‌ లేదనడానికి రషీద్‌ హత్యే నిదర్శనం

పల్నాడు ఎస్పీ మారిన రెండ్రోజులకే చంపారు

పథకం ప్రకారమే చంపి జిలానీ ఒక్కడిపైనే కేసా?

పథకాలివ్వకుండా బాబు మోసం చేస్తున్నారు

జనం ప్రశ్నించకుండా ఉండేందుకే భయానక వాతావరణం సృష్టి: జగన్‌

వినుకొండ, జూలై 19: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో 24న వైసీపీ ధర్నా చేస్తుందని ప్రకటించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్‌ రషీద్‌ కుటుంబాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆనక ‘ఎక్స్‌’లోనూ స్పందించారు. రాష్ట్రంలో లా-అండ్‌-ఆర్డర్‌ లేదని, 45 రోజుల టీడీపీ పాలనలో 306 రాజకీయ హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు, 560 చోట్ల ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని, అనేక చోట్ల టీడీపీ వేధింపులను భరించలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ సమయంలో విలేకరులు ప్రశ్నించబోగా.. ‘ఆగాగు... నువ్వు ఆంధ్రజ్యోతి విలేకరివైనంత మాత్రాన మాట్లాడేప్పుడు మధ్యలో ప్రశ్నించడం వల్ల ఫ్లో పోతుంది’ అని ఆయన వారించారు. తర్వాత ఎక్కడి దాకా మాట్లాడానంటూ పక్కనే ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని అడిగి మళ్లీ ప్రారంభించారు. రాష్ట్రంలో లా-అండ్‌-ఆర్డర్‌ లేదనడానికి వినుకొండలో రషీద్‌ హత్యే నిదర్శనమన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తి నడిరోడ్డుపై తమ కార్యకర్త రషీద్‌ను నరికి చంపడం అత్యంత దారుణమన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు వచ్చిన రెండ్రోజుల్లోనే ఈ హత్య జరగడం పథకంలో భాగమేనని ఆరోపించారు. గతంలో జిల్లా ఎస్పీగా ఉన్న రవిశంకర్‌రెడ్డిని ఎన్నికల ముందు అన్యాయంగా తప్పించి ఎస్పీగా బింధు మాధవ్‌ను తీసుకొచ్చారని.. ఎన్నికల కమిషన్‌ ఆయన్ను సస్పెండ్‌ చేసి ఎస్పీగా మల్లికను నియమించిందని అన్నారు. టీడీపీ నాయకుల మాట వినడం లేదని, ఆమెను బదిలీపై పంపి టీడీపీకి అనుకూలమైన శ్రీనివాసరావును తీసుకొచ్చిన రెండ్రోజులలోనే రషీద్‌ హత్య జరిగిందని చెప్పారు. రషీద్‌ను పథకం ప్రకారం హత్య చేసి జిలానీ ఒక్కడిపైనే కేసుపెట్టి వదిలేయడం సరికాదని, హత్యకు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, చదువుకునే ప్రతి పిల్లాడికి రూ.15 వేలు ఇస్తానని మోసం చేశారన్నారు. ఢిల్లీలో 24న శాంతియుతంగా ధర్నా చేస్తామని స్పష్పం చేశారు.

రషీద్‌ కుటుంబానికి న్యాయం చేస్తాం

రషీద్‌ తల్లిదండ్రుల వద్ద కూర్చుని జగన్‌ మాట్లాడుతూ.. ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. కోర్టులో న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి న్యాయవాదిని ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే.. ఢిల్లీలో పెద్దల సాయంతో పోరాడి తాను న్యాయం చేస్తానన్నారు. రషీద్‌ పార్టీ కోసమే బతికాడని, రాజకీయ కక్షతోనే టీడీపీకి చెందిన జిలానీ తమ కుమారుడిని చంపారని తల్లిదండ్రులు విలపించారు. గొడవలతో సంబంధం లేని రషీద్‌ను చంపడం దారుణమని జగన్‌ అన్నారు. రషీద్‌ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి వెళ్లిపోయారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల్లేవు

ప్రధాని మోదీకి జగన్‌ లేఖ

రాష్ట్రంలో శాంతి ఽభద్రతలు క్షీణించాయని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుందన్నారు. వైసీపీ శ్రేణులను హింసిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారని.. వారి ఆస్తులతోపాటు ప్రభుత్వ ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. వీటిని వివరించేందుకు ప్రధాని సమయం కోరారు.

పరామర్శా.. ప్రచార యాత్రా?

జగన్‌ వినుకొండ పర్యటన రషీద్‌ కుటుంబానికి పరామర్శలా కాకుండా.. ప్రచార యాత్రలా సాగడం విమర్శలకు దారితీసింది. హతుడి కుటుంబాన్ని ఓదా ర్చి సహాయం అందించాల్సిన మాజీ సీఎం.. రషీద్‌ హ త్య వ్యక్తిగత కక్షలతో జరగలేదని, రాజకీయ హత్యేనం టే రాజకీయ రంగు పులిమారు. ఇక తాడేపల్లి నుంచి బయల్దేరిన ఆయనకు స్వాగతం పలికేందుకు చిలకలూరిపేట, నరసరావుపేట మండలం ఉప్పలపాడు వ ద్ద ముందుగానే ఏర్పాట్లు చేశారు. దీంతో మధ్యాహ్నం 12.30 గంటలకు రషీద్‌ ఇంటికి రావలసిన జగన్‌.. సాయంత్రం 5.24 గంటలకు చేరుకున్నారు. వినుకొండ నియోజకవర్గంలోకి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవేశించిన ఆయన కాన్వాయ్‌.. 13 కిమీ దూరంలోని పట్టణంలోకి రావడానికి 3గంటలు పట్టింది.

Updated Date - Jul 20 , 2024 | 04:17 AM