Share News

ఆశల ఆకాశం..!

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:34 PM

రైతన్న ఆకాశం వైపే ఆశగా చూస్తున్నాడు. చినుకు జాడలేదు. రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆషాఢం సగం ముగిసింది. ఆకాశం మబ్బులతో నిండుకుంటోంది. ఆషాఢ గాలులతో మబ్బులన్నీ కరిగిపోతున్నాయి. రైతులు పొలాలను దుక్కి దున్నుకుని, విత్తనాలను సిద్ధం చేసుకున్నారు.

ఆశల ఆకాశం..!
విత్తన సాగుకు సిద్ధం చేసుకున్న పొలం

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

జిల్లాలో మాత్రం నేలరాలని చినుకు

ఊరించి.. ఉసూరుమనిపిస్తున్న మేఘాలు

విత్తుకు సిద్ధం చేసుకున్న రైతన్న

వర్షం కోసం ఎదురుచూపులు

అదునెళ్లిపోతుండడంతో ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులకు వరద పోటెత్తుతోంది. జలాశయాలు నిండి, గేట్లు తెరుచుకుంటున్నాయి. జిల్లా రైతన్న దుక్కి దున్నుకున్నాడు. విత్తనాలు సిద్ధం చేసుకున్నాడు. విత్తుకు సర్వ సన్నద్ధమయ్యాడు. జిల్లాలో కూడా రోజూ ఆకాశం మేఘావృతమవుతోంది. మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షం పడితే విత్తనం వేద్దామని అన్నదాత రోజూ ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. మేఘాలు ఏర్పడడం, ఆషాఢ గాలులకు వెళ్లిపోవడం తప్ప.. చినుకు నేల రాలట్లేదు. ఈ పూటైనా పడకపోతుందా అని అన్నదాత ఆశపడడం తప్ప.. వరుణుడు కరుణించిన పాపాన పోలేదు. కార్తెలన్నీ కరిగిపోయాయి. నెలాఖరు వరకు వేరుశనగ విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. రెండు, మూడు రోజుల్లో వర్షం కురవకపోతే.. తరువాత పంట వేసినా.. దిగుబడులు దక్కవని అన్నదాతలు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణిస్తాడో.. ముంచేస్తాడోనని ఆందోళన చెందుతున్నారు. వర్షం రాకపోతే ఇప్పటికే పొలం దుక్కులు తదితరాలకు పెట్టిన పెట్టుబడి నేలపాలవుతుందని రైతులు వాపోతున్నారు.

ధర్మవరంరూరల్‌, జూలై22: రైతన్న ఆకాశం వైపే ఆశగా చూస్తున్నాడు. చినుకు జాడలేదు. రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆషాఢం సగం ముగిసింది. ఆకాశం మబ్బులతో నిండుకుంటోంది. ఆషాఢ గాలులతో మబ్బులన్నీ కరిగిపోతున్నాయి. రైతులు పొలాలను దుక్కి దున్నుకుని, విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. విత్తుకు రెడీగా ఉన్నారు. వరుణుడు కరుణించలేదు. కార్తెలు ముగుస్తున్నా చినుకు జాడలేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఏటా మృగశిర కార్తెలో అరకొరగా వర్షాలు కురిసేవి. ఆ తేమలోనే వేరుశనగ సాగుచేసేవారు. ఈసారి పదును వర్షం కురవకపోవడంతో దిగులు చెందుతున్నారు. జూన 15 నుంచి జూలై 15 వరకు వేరుశనగ సాగుకు అనుకూలమని రైతులు పేర్కొంటున్నారు. విత్తన సాగుకు మృగశిర, ఆరుద్ర, పునర్వసు కార్తెలు ప్రధానం. ప్రస్తుతం విపరీతమైన గాలులు వీస్తుండటంతో కమ్ముకున్న మేఘాలు చెదిరిపోతున్నాయి. ఖరీఫ్‌ సాగుకు వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి సేద్యపు పనులుపూర్తి చేసుకుని, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు వేసినా ప్రయోజనం ఉండదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా మృగశిర, ఆరుద్ర కార్తెల్లో పంటలు సాగుచేస్తే దిగుబడి బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

సాగుకు సిద్ధం

వేల రూపాయలు వెచ్చించి వేరుశనగ విత్తనాలను రైతులు సిద్ధం చేసుకున్నారు. ఈఏడాది ప్రభుత్వం కూడా ఆలస్యంగా విత్తన పంపిణీ చేయడంతో వాటిని సిద్ధం చేసుకునేలోపు ఆరుద్ర కార్తె వెళ్లిపోయింది. ప్రస్తుతం పునర్వుసు కార్తె వచ్చినా పదును వర్షం కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సేద్యపుఖర్చులు, విత్తనాల కోసం ఎకరాకు రూ.5 వేలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టినట్లు రైతులు వాపోతున్నారు. వేరుశనగతోపాటు కందిపంట సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.

జాడలేని రుతుపవనాలు

ఈ ఏడాది తొలినుంచీ రుతుపవనాల జాడేలేదు. సాధారణంగా జూన, జూలై, ఆగస్టు నెలల్లో రుతపవన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది జూన నెలలో మాత్రమే అరకొరగా వర్షాలు కురిశాయి. ఆ తరువాత పదును వర్షమే లేదు. పగలంతా మబ్బులతో మేఘాలు కమ్ముకుంటున్నాయి. చినుకు మాత్రం కురవట్లేదు. కార్తెలు ముగుస్తున్నా.. చినుకు జాడలేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

ప్రశ్నార్థకంగా సాగు

ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌ సీజన ప్రారంభమై రెండునెలలు అవుతోంది. మేఘాలు ఊరిస్తున్నా చినుకు పడలేదు. జూలై 15 దాటితే వేరుశనగకు అనుకూలంగా ఉండదని రైతులు చెబుతున్నారు. ఇప్పటివరకు వర్షం రాకపోవడంతో ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం వర్షం కురిసినా వేరుశనగ కన్నా ప్రత్యామ్నాయ పంటల సాగు మేలని వ్యవసాయాధికారులు అంటున్నారు.

ఈ ఏడాది విత్తన కేటాయింపులు ఇలా..

జిల్లాలో ఈ ఏడాది ఖరీ్‌ఫలో సాగుకోసం జిల్లాలో 96,386 క్వింటాళ్లకుగాను 1,12,790 మంది రైతులకు విత్తనకాయలు పంపీణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గత నెల జూనలో కురిసిన వర్షానికి అక్కడక్కడ జిల్లాలో వేరుశనగ, కంది పంట సాగుచేశారు. దీంతో జిల్లాలో ఈ ఏడాది 1,97,884 లక్షల హెక్టార్లకుగాను 48,234 హెక్టార్లలో వేరుశగన, కంది సాగయినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

తగ్గనున్న సాగు

జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ. గత నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా సాగు విస్తీర్ణం ఏటా తగ్గుతోంది. గతంలో చేతికందే పంట అకాల వర్షాలతో నేలపాలవడంతో రైతులు వేరుశనగపై ఆసక్తి చూపట్లేదు. వేరుశనగకు పెట్టుబడి కూడా అధికంగా పెట్టాల్సి వస్తోంది. సేద్యపు పనులు మొదలు విత్తనాలు, మందులు, ఎరువులు, కూలీల ఖర్చు అధికంగా ఉంటోంది. దీనికి తోడు సకాలంలో వర్షాలు కురకవపోవడంతో పంట సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో కంది సాగుపై దృష్టి పెట్టారు. పంట సాగుకు పెట్టుబడి తక్కువ. తక్కువ వర్షపాత పరిస్థితులను తట్టుకుని దిగుబడి వస్తుంది. ధరలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఈ కారణాలతో కంది వైపు జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు.

కార్తెలన్నీ ముగిసిపోతున్నాయి:

రామ్మోహనరెడ్డి, నేలకోట గ్రామం, ధర్మవరం మండలం

కార్తెలన్నీ ముగిసిపోతున్నా చినుకు జాడలేదు. దీంతో ఆందోళనగా ఉంది. వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. కార్తెల్లో వర్షం రాకపోతే పంట వేసినా దిగుబడి రాదు. సకాలంలో వర్షం కురిస్తేనే పంటకు అనుకూలంగా ఉంటుంది.

వర్షం కోసం ఎదురుచూస్తున్నాం:

నరసింహారెడ్డి, తుమ్మల, ధర్మవరం మండలం

ఆషాఢం గాలులతో వాన జాడ లేకుండా పోతోంది. ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేద్దామని విత్తనాలను సిద్ధం చేసుకున్నా. వర్షం కోసం ఎదురుచూస్తున్నా. అదును తప్పి వర్షాలు కురిస్తే పంట దిగుబడి తగ్గుతుందన్న ఆందోళన నెలకొంది. ఈ కార్తెలో కూడా వర్షం రాకపోయే ఆందోళనగా ఉంది.

వారంరోజుల్లో వర్షం కురిసే అవకాశం:

జాన్సన, పుట్టపర్తి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌

ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో వారంరోజుల్లోపు వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం కురిస్తే నెలాఖరులోగా వేరుశనగ సాగుచేసుకోవచ్చు. ప్రస్తుతం చిరుజల్లులు పడుతుండం ఇప్పటికే సాగుచేసిన పంటకు అనుకూలం. కంది, ఆముదం విత్తనాలను ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Updated Date - Jul 22 , 2024 | 11:34 PM