Share News

Rajamahendravaram : వైసీపీ వనిత.. కోట్లలో మేత!?

ABN , Publish Date - Jun 19 , 2024 | 03:23 AM

‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న చందంగా సాగిన జగన్‌ జమానాలో ‘రండి బాబూ.. రండి’ అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు.

Rajamahendravaram : వైసీపీ వనిత.. కోట్లలో మేత!?

బయానా ఇచ్చిన పోలీసులు లబోదిబో

పనిని బట్టి రేటు కట్టిన వైనం

ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ‘పని’

చార్జి మెమోల రద్దుకు కౌంటర్లు

ఎన్నికల ముందు రెచ్చిపోయి మరీ

భారీగా దండుకున్న మాజీ ‘హోం’

‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌ చేసి బాధితుల ఆవేదన

తూర్పు ఎస్పీని ఆశ్రయించిన మరికొందరు

వెలుగు చూస్తున్న తానేటి అవినీతి లీలలు

‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న చందంగా సాగిన జగన్‌ జమానాలో ‘రండి బాబూ.. రండి’ అంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు. అధికారం అచ్చంగా తమకే సొంతమనే భ్రమలో వసూళ్లకు డోర్లు బార్లా తెరిచేశారు. చేతికి మట్టి అంటకుండా భర్త, తమ్ముడు, అన్న, అక్క ఇలా అయినవారిని రంగంలోకి దించి మరీ చక్కబెట్టేశారు. అందినకాడికి సొమ్ములు చుట్టబెట్టేశారు. చట్టం చూస్తోందన్న బెరుకు, భవిష్యత్తులో జనానికి జవాబు చెప్పాలన్న భయం కూడా లేకుండా బరితెగించారు. తాజా మాజీ హోం మంత్రి తానేటి వనిత సాగించిన అవినీతి లీలలు వెలుగు చూస్తున్నాయి.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ హయాంలో మహిళా మంత్రులు సైతం అవినీతి బాట పట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి రోజా రూ.100 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ కోవలోనే మాజీ హోం మంత్రి తానేటి వనిత అధికారాన్ని అడ్డుపెట్టుకొని మేసిన ‘మేత’ బయటకు వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో తానేటి వనిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్‌ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తర్వాత హోం మంత్రిగా రెండున్నరేళ్లు చొప్పున ఐదేళ్లు మంత్రి పదవిలో ఉన్నారు. ఈ రెండు శాఖల్లో భారీగా అవినీతి జరిగినట్టు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. ఆమె చక్కబెట్టిన సొంత శాఖ(హోం)లోని పోలీసులే... ‘‘బాబోయ్‌.. ఆ అవినీతి అంతా ఇంతా కాదు. చేతికి మట్టి అంటకుండా సింగిల్‌ విండో విధానంలో వసూళ్లను కొత్తపుంతలు తొక్కించారు’’ అని వాపోతున్నారు. వివిధ పనుల కోసం ఆమె నిర్ణయించిన ధరలు అకాశాన్నంటేవని తలుచుకుని హడలిపోతున్నారు. ఈ క్రమంలో తాము సొమ్ములు ఇచ్చినా సదరు పని జరగలేదని.. కాబట్టి వాటి నిమిత్తం తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. పోలీసు శాఖలో తప్పు చేసిన వారికి చార్జి మెమోలు ఇవ్వడం సాధారణం. అయితే.. వీటివల్ల సదరు అధికారులు, సిబ్బంది ప్రమోషన్లు, ఇతర శాఖాపరమైన ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో చార్జిమెమోలను డ్రాప్‌ చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అధికారులు నాటి హోం మంత్రి తానేటి వనితను ఆశ్రయించారు. దీంతో ఆమె రేటు కట్టి.. బయానా కింద రూ.కోట్లలో వసూలు చేసినట్టు సమాచారం. అయితే.. సదరు అధికారులకు ఎలాంటి ఊరటా లభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారు లబోదిబోమంటున్నారు.

అక్రమాలకు రెడ్‌ కార్పెట్‌!

వైసీపీ హయాంలో అక్రమాలకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉండేవి. ఈ క్రమంలో నాటి హోం మంత్రి వనిత కూడా ‘సింగిల్‌ విండో’ విధానాన్ని అమలు చేశారు. ఆమె తరఫు కుటుంబసభ్యులు నలుగురు కౌంటర్లు తెరిచి డబ్బులు వసూళ్లు చేసేవారనేది బహిరంగ రహస్యం. పోలీస్‌ శాఖలో చార్జ్‌మెమోలు, పనిష్‌ మెంట్లు డ్రాప్‌ చేయడానికిరూ.లక్షల రేటు పెట్టారని తెలిసింది. పదోన్నతికి అడ్డుగా ఉండే సాంకేతిక అంశాలను క్లియర్‌ చేయడానికి మరింత రేటు చెల్లించాల్సి వచ్చేది. ఉన్నతాధికారులు ఎంతటి కఠిన చర్యలకు ఉపక్రమించినా ‘హోం’ వద్దకు వెళితే ఆ తప్పు డబ్బుతో ‘ఒప్పు’ అయిపోయేది. చిన్న మెమో, పని్‌షమెంట్‌ క్లియర్‌ చేయడానికి కూడా కనిష్ఠంగా రూ.లక్ష రేటు పెట్టారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. మూడు, నాలుగు ఇంక్రిమెంట్లు పోయే పరిస్థితి నుంచి కాపాడడం, సర్వీసు నుంచి తొలగింపు వంటివి రద్దు చేయడం, కావాల్సిన చోటకు పోస్టింగులు ఇప్పించడం వంటివి వనితకు భారీగా ‘సంపాయించి’ పెట్టాయని తెలుస్తోంది.


ఎక్కువిచ్చిన వారే మక్కువ!

తానేటి వనిత హోం మంత్రిగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ సొమ్ములు ఇస్తే వారికే ‘పని’ జరిగేదని టాక్‌. తూర్పుగోదావరి జిల్లాలో ఓ సీఐ పోస్టింగ్‌ కోసం రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మరో సీఐ అంతకంటే ఎక్కువ ఇవ్వడంతో ఆయనకు ఆ సీటు దక్కింది. మాజీ హోం మంత్రితో పని నిమిత్తం బేరం కుదిరిన తర్వాత కొంత మొత్తం బయానా కింద చెల్లించే విధానం అమలు చేశారు. మిగతా సొమ్ము నోట్‌ ఫైల్‌ సంతకానికి ముందు ఇచ్చేయాలి. ఆ డబ్బులు అందకపోతే నోట్‌ ఫైల్‌పై ‘నో’ అని రాసేస్తారు. శాఖలో అంతర్గతంగా జరిగే వ్యవహారం కాబట్టి బయటకి పొక్కేది కాదు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు వసూళ్ల వేగం పెంచారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, తానే హోంమంత్రి అవుతానంటూ మిగతా సొమ్ములు కూడా ఇచ్చేస్తే ‘పని’ పూర్తవుతుందని ఒత్తిడి తీసుకురావడంతో ఆయా అధికారులు సొమ్ములు ముట్టజెప్పారు. ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీఐ రూ.10 లక్షలు, మరో సీఐ రూ.13 లక్షలు, మెమో డ్రాప్‌ చేయడానికి హెచ్‌సీ నుంచి రూ.లక్ష, ఉమ్మడి తూర్పుగోదావరిలోని ఓ సీఐ రూ.30 లక్షలు.. ఇలా చాలా మంది అధికారులు తమ పనుల నిమిత్తం సొమ్ములు చెల్లించారని డిపార్ట్‌మెంట్‌లో బాహాటంగానే వినిపిస్తోంది.

‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని వనితకు సొమ్ములు ముట్టజెప్పిన బాధితులు నిలదీయడం ప్రారంభించారు. అయితే.. సొమ్ములు వసూలు చేసిన మాజీ మంత్రి వనిత కుటుంబానికి చెందిన ‘ఆ నలుగురు’ ముఖం చాటేస్తున్నారని బాధిత పోలీసులు చెబుతున్నారు. వనిత తమ్ముడు జొన్నకూటి కుమార్‌ ఫోన్‌ స్విచాఫ్‌ చేశారని ఓ బాధిత అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. నిలదీస్తున్న వారికి రూ.10 వేలు, రూ.20 వేలు ఇస్తున్నారని తెలిపారు.

గుడ్డును కూడా గోకేశారు!

జగన్‌ హయాంలో తొలి రెండున్నరేళ్లు తానేటి వనిత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో కోడి గుడ్ల నుంచీ ప్రతి దానిపై ఓ రేటు పెట్టి వసూలు చేసేవారని విమర్శలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుడ్డుపై 2 పైసలు తీసుకునే దందా నడిచింది. ఆ సమయంలోనే ఓ బిల్డరు నుంచి ఆమె రూ.70 లక్షలు వడ్డీకి తీసుకున్నారు. అయితే, కేవలం 3 నెలల్లో సొమ్ము మొత్తం వెనక్కి ఇచ్చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. వనిత హయాంలో జరిగిన అవినీతిపై గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు కొందరు సోమవారం తూర్పుగోదావరి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే, ఆ రోజు బక్రీద్‌ కావడంతో ఎస్పీ అందుబాటులో లేరు. దీంతో వారంతా వెనుదిరిగారు. వనిత తమ్ముడు కుమార్‌పై కేసు నమోదయ్యే అవకాశముందని, నేడో రేపో అరెస్టు కూడా ఉంటుందనే చర్చ విస్తృతంగా నడుస్తోంది.

Updated Date - Jun 19 , 2024 | 09:21 AM