Share News

CM Jagan: తాడేపల్లిలో ఎన్నికల భక్తి!

ABN , Publish Date - Jan 15 , 2024 | 07:15 AM

ముఖ్యమంత్రి జగన్‌ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో తిరుమల ఆలయాన్ని పునఃసృష్టించారు. జగన్‌ దంపతులు ఆ నమూనా ఆలయంలో పూజలు జరిపారు. శఠగోపం పెట్టించుకున్నారు. ఒకరికి ఒకరు కుంకుమ దిద్దుకుని స్వామిని సేవించారు. అక్కడి పరిసరాలను కూడా అచ్చం పల్లెటూరు అందాలు, అద్భుతమైన కళాఖండాలు, ఆలయం, ఇంకా ప్రముఖమైన కళాకృతులతో నింపేశారు.

CM Jagan: తాడేపల్లిలో ఎన్నికల భక్తి!

  • భారీ ఖర్చుతో ఎన్నికల వేళ

  • రాజకీయ సంక్రాంతి

  • జగన్‌ నివాసంలో తిరుమల సెట్టింగు

  • ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్ల నమూనాలు

  • హిందూ గుళ్లకు భారతీరెడ్డి తొలి నుంచీ దూరం

  • తిరుమల బ్రహ్మోత్సవాలకూ జగన్‌ ఒంటరిగానే..

  • అలాంటిది ఈ ఎన్నికల సంక్రాంతికి నమూనా

  • ఆలయాల్లో జగన్‌తో కలిసి పూజలు

  • శఠగోపం స్వీకరించి కుంకుమ దిద్దించుకున్న వైనం

(అమరావతి–ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి జగన్‌ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాడేపల్లి ప్యాలెస్‌లో తిరుమల ఆలయాన్ని పునఃసృష్టించారు. జగన్‌ దంపతులు ఆ నమూనా ఆలయంలో పూజలు జరిపారు. శఠగోపం పెట్టించుకున్నారు. ఒకరికి ఒకరు కుంకుమ దిద్దుకుని స్వామిని సేవించారు. అక్కడి పరిసరాలను కూడా అచ్చం పల్లెటూరు అందాలు, అద్భుతమైన కళాఖండాలు, ఆలయం, ఇంకా ప్రముఖమైన కళాకృతులతో నింపేశారు. మినీ పల్లెటూరును తలపించిన ఆ వాతావరణంలో జగన్‌ దంపతులు కలియదిరిగారు. అయితే.. భర్త సీఎం అయ్యాక ఏనాడూ ఏ హిందూ ఆలయానికీ వెళ్లని భారతిరెడ్డి జగన్‌తో కలిసి ఈ ‘మినీ తిరుమల’ ఆలయంలో పూజలు, దర్శనాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి, ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తిరుమల బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు తీసుకెళుతున్నారు. సాధారణంగా ఈ కార్యక్రమంలో సతీమణితో కలిసి పాల్గొనడం రివాజు. అయినా, తిరుమల కొండపై జగన్‌ వెంట ఎప్పుడూ భారతీరెడ్డి కనిపించలేదు.

రాష్ట్రంలోని హిందూ ఆలయాలను ఆమెగానీ, జగన్‌తో కలిసి జంటగాగానీ వెళ్లిందే లేదు. అలాంటిది.. తాడేపల్లి నివాసంలోనే తిరుమల ఆలయం సెట్టింగును రూ.కోట్ల ఖర్చుతో నిర్మింపజేయడం, సంక్రాంతి రోజు అక్కడ పూజాకార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనడం సొంత వైసీపీ పార్టీ వర్గాలనే ఆసక్తికి గురి చేస్తోంది. దీంతో రాజకీయ సంక్రాంతి పర్వం లో.. ఎన్నికల భక్తిని భారతీరెడ్డి ప్రదర్శించారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నా యి. నిజానికి, ఉగాది, సంక్రాంతులను తెలుగు సంప్రదాయాలను అనుసరించి జగన్‌ దంపతులు ఏటా జరుపుతున్నారు. అయితే, ఇంత అట్టహాసం గతంలో ప్రదర్శించలేదు. ముగ్గులు, రంగులతో నివాస పరిసరాలను ముస్తాబు చేసేవారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిర్వహించే గోశాలను సందర్శించి గోవులను తాకి వాటికి ఆహారం అందించేవారు. సాంస్కృతిక కార్యక్రమాలను కలిసి తిలకించేవారు. ఈసారి మాత్రం.. ఆలయ సెట్టింగులు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రతిబింబించేలా రైతు భరోసా కేంద్రం తదితర నమూనాలను జగన్‌ దంపతులు నడిచే దారి పక్కన ఏర్పాటుచేశారు. ప్రభుత్వ ప్రముఖులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


దర్శించాలంటే చెంతనే గుడులెన్నో..

జగన్‌ దంపతులు హిందూ ఆలయంలో పూజలు చేయాలనుకుంటే ఆయన నివాసానికి కూతవేటు దూరంలో వెంకటాయపాలెంలో టీటీడీ నిర్మించిన వెంకటేశ్వర ఆలయం ఉంది. ఆయన ఇంటి చుట్టుపక్కల కూడా ఆనేక ఆలయాలున్నాయి. కావాలంటే అక్కడ పూజలు చేయొచ్చు. కానీ, తన నివాసంలోనే పెద్ద గుడిని నిర్మించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ప్రభుత్వ సొమ్మునే వాడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్‌ తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా ప్రకటించాక 32 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.

ఆసాంతం జగన్‌ గానమే..

ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలు తెలుగువారి తొలి పండగను జరుపుకొన్నట్టు కాకుండా.. జగన్‌ సొంత డబ్బా కార్యక్రమంలా మారిపోయింది. సంక్రాంతి అంటేనే కళలు, రంగవల్లులు, సంప్రదాయ నృత్యాలు, తొలి పండగ విశిష్టతను తెలిపే సాహిత్య రూపాల ప్రదర్శన. కానీ, తాడేపల్లిప్యాలెస్‌లో సంబరాలు జగన్‌ భజన, వ్యక్తిగత కీర్తిగానాలతో నిండిపోయాయి. తెలంగాణ నుంచి మిట్టపల్లి సురేందర్‌, నల్లగొండ గద్దర్‌ వంటి కవులు, కళాకారులను ఈ కార్యక్రమం కోసం రప్పించారు. జగన్‌ను పొగడటంతోనే దాదాపుగా సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిపోయాయి.

ఆ.. ఖర్చెవరిది?

సంబరాలు సరే, ఈ ఏర్పాట్లకయిన కోట్లాది రూపాయల ఖర్చు ఎవరిది? ఇల్లు సీఎం జగన్‌ది. అక్కడ ఎలాంటి సెట్టింగ్‌లు, కళాఖండాలు ఏర్పాటు చేసినా ఖర్చు జగన్‌ సొంతంగా భరించాలి. కానీ ఆయన రూపాయి కూడా భరించే టైపుకాదని పదవిలోకి వచ్చినతొలి రోజుల్లోనే తేలిపోయింది. అంటే, ప్రభుత్వ ఖర్చుతో ఆయన తన నివాసంలో సంక్రాంతి సంబరాలు జరిపారని భావించాల్సి వస్తోంది. సాధారణ పండుగ సంబరాలయితే పర్వాలేదు. కానీ కోట్లాది రూపాల ఖర్చుతో ఏర్పాటు చేసిన సంబరాలు కావడంతోనే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రముఖ డిజైనర్లతో జగన్‌ ఇంటిలో ఓ ఆలయమే నిర్మించారు. ఇది నిజమైన ఆలయమా? లేక సంబరాల కోసం ఏర్పాటు చేసిన సెట్టింగ్‌నా అన్నది నిర్ధారణ కావాల్సి ఉన్నది. అయితే ఇందుకోసం కోటిన్నర రూపాయలపైనే ఖర్చుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన డిజైనర్లతో అద్భుతమైన రీతిలో ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియో ఎక్స్‌, ఇన్‌స్టాల్లో చక్కర్లు కొడుతోంది. నేరుగా జగన్‌ నివాసంలోకి వెళ్లే సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ నుంచి వర్క్‌ చేస్తోన్న విజువల్స్‌, ఆలయం రూపుదిద్దుకున్న తర్వాత చివరి స్టిల్స్‌ వరకు అందులో ఉన్నాయి. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఫొట్లోనూ కృత్రిక కళాఖండాలు, ఆలయ నమూనాలు కనిపిస్తున్నాయి.

జీవోలో ‘తాడేపల్లి’ మాయం

ఆర్‌అండ్‌ బీ శాఖ పరిధిలోని బిల్డింగ్స్‌ విభాగం ఇచ్చిన జీవోల వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. సీఎం క్యాంపు ఆఫీసు పేరిట ఖర్చును కాస్తా విఐపీ అరే ంజ్‌మెంట్స్‌గా అందులో చూపిస్తున్నారు. ఎక్కడా తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం అన్న పదం వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గుడి నిర్మాణం కూడా ఇదే పద్ధతిలో చేసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేవుణ్ణే రప్పించారు..

ఎంతటి రాజు అయినా దర్శనం కోసం ఆలయానికి వెళతాడు. స్వామిని సేవించి తన కుటుంబానికి, రాజ్య ప్రజలకు శుభం కలగాలని పూజలు జరుపుతాడు. కానీ, జగన్‌ తీరే వేరు. దేవుని వద్దకు తాను వెళ్లడం కాదు.. దేవుడే తన దగ్గరకు రావాలి అన్నట్టు జగన్‌ వ్యవహార శైలి కనిపించింది. రాష్ట్రంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి, బెజవాడ దుర్గమ్మ, విఘ్నేశ్వర విగ్రహ నమూనాలను తన నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయించారు. సతీమణి భారతీరెడ్డితో కలిసి అక్కడ పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు, ఈవోలను ఈ సమయానికి అక్కడికే పిలిపించారు.

Updated Date - Jan 15 , 2024 | 07:58 AM