Share News

AP Polls 2024: ఎన్నికల వేళా షాకులే!

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:43 AM

దాదాపు ఐదేళ్లుగా విద్యుత్‌ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల వేళ కూడా వినియోగదారులను వదిలిపెట్టలేదు.

AP Polls 2024: ఎన్నికల వేళా షాకులే!

  • జనంపై 1148.72 కోట్ల ట్రూఅప్‌ భారం

  • వేరియబుల్‌ చార్జీలతో కలుపుకొంటే 2,149 కోట్లు

  • గత ఏడాది ధరల సవరణకు జెన్కోకు అనుమతి

  • డిస్కమ్‌లకు ఏపీఈఆర్‌సీ ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఐదేళ్లుగా విద్యుత్‌ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల వేళ (AP Elections) కూడా వినియోగదారులను వదిలిపెట్టలేదు. ఇంధన సర్దుబాటు చార్జీలు రూ.1148.72 కోట్లను వినియోగదారులనుంచి వసూలు చేసి జెన్కోకు చెల్లించాలంటూ విద్యుత్తు పంపిణీ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశించింది. 2018-19 నుంచి 2022-23 దాకా విద్యుదుత్పత్తి కోసం జెన్కో... బొగ్గు , ఇతర ఇంధన ఉత్పత్తుల కోసం చేస్తున్న వ్యయాలకూ.. డిస్కమ్‌లకు సరఫరా చేస్తున్న విద్యుత్తు ధరకూ మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని ఈఆర్‌సీ ముందు జెన్కో వాదించింది. ఈ వ్యత్యాసం 2018-19లో రూ.37.33 కోట్లు 2019-20లో రూ.205.11 కోట్లు,2022-23లో రూ.906.28 కోట్లు మొత్తంగా రూ.1148.72 కోట్లు అదనంగా ఖర్చు అయ్యిందని ఈఆర్‌సీకి జెన్కో వెల్లడించింది.

Election-Time-Power-Bill-Sh.jpg

ఎన్నికల వేళ వెరీ ‘హాట్‌’!


జెన్కో వాదనతో ఈఆర్‌సీ ఏకీభవించింది. ఈ వ్యత్యాసమొత్తాన్ని ట్రూఅప్‌ చార్జీల కింద వినియోగదారుల నుంచి వసూలు చేసి జెన్కోకు చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా .. వీటీపీఎస్‌ ఒకటి , రెండు, మూడు యూనిట్లకు సంబంధించి వేరియబుల్‌ కాస్ట్‌ను యూనిట్‌కు రూ.3.49 నుంచి రూ.4.02కు, విజయవాడ థర్మల్‌ యూనిట్‌ నాలుగులో యూనిట్‌కు రూ.3.27 నుంచి రూ.3.76కు, ఆర్‌టీపీపీ ఒకటి, రెండు, మూడు యూనిట్లలో యూనిట్‌కు రూ.3.88 నుంచి రూ.4.47కు, ఆర్‌టీపీపీ ఐదో యూనిట్‌లో యూనిట్‌కు రూ.3.62 నుంచి రూ.4.16కు పెంచాలన్న జెన్కో ప్రతిపాదనను ఈఆర్‌సీ ఆమోదించింది. ఈ సవరించిన చలన ధరలు 2023 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తిస్తాయని ఈఆర్‌సీ స్పష్టం చేసింది. అంటే.. ఇది కూడా వినియోగదారులపై పడే వీలుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యత్యాస ధర దాదాపు వెయ్యి కోట్ల పైమాటేనని పేర్కొంటున్నారు. దాదాపు రూ.2148.72 కోట్ల మేర భారం పడనున్నదని విద్యుత్తురంగ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 07:22 AM