Share News

AP Election 2024: ‘ఆదివారం’ కుట్రలు!

ABN , Publish Date - May 09 , 2024 | 04:51 AM

జగన్‌ ఎప్పుడో బటన్‌ నొక్కిన పథకాలకు ఇప్పటికీ డబ్బులు పడలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో డబ్బులు వేసి... రాజకీయ లబ్ధి పొందే దిశగా వ్యూహం రచించారు.

AP Election 2024: ‘ఆదివారం’ కుట్రలు!

సెలవైనా బ్యాంకులు పనిచేయాలని ఆదేశం

ఎస్‌బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ

బటన్‌ నొక్కుడు డబ్బులు వేసేందుకేనా?

ఇన్నాళ్లూ ఉద్దేశపూర్వకంగానే నిలిపివేత

పోలింగ్‌ ముందురోజు జమ చేసేలా వ్యూహం!?

కోర్టులో తీర్పు, ఈసీ అనుమతి లేకున్నా పావులు

‘హైలెస్సో హైలెస్స’ చర్చలు దీనిపైనేనా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ ఎప్పుడో బటన్‌ నొక్కిన పథకాలకు ఇప్పటికీ డబ్బులు పడలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో డబ్బులు వేసి... రాజకీయ లబ్ధి పొందే దిశగా వ్యూహం రచించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఈ వ్యూహం ఫలించలేదు. అయినా సరే... సర్కారు పెద్దలు ‘ఆదివారం కుట్ర’లకు తెరలేపారు. సోమవారం ఎన్నికలు జరగనుండగా, ఒక్క రోజు ముందుగా ఆదివారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం తమకోసం పనిచేయాలంటూ ఎస్‌బీఐకి ఆర్థిక శాఖ బుధవారం లేఖ రాసింది. మద్యం వ్యాపారంపై వచ్చిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని, దాదాపు రూ.200 కోట్లు ఉంటాయని లేఖలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లావాదేవీలు ఈ బ్యాంకు ద్వారానే జరుగుతాయి. ప్రస్తుతానికి ఎస్‌బీఐకి లేఖ రాసినా... మిగిలిన బ్యాంకులకు కూడా ఇదే విధమైన లేఖలు రాస్తారని తెలుస్తోంది. మద్యం డబ్బులు డిపాజిట్‌ చేయాలని పైకి చెబుతున్నా.. ప్రభుత్వ ఉద్దేశం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్‌ ముందు రోజు ఖాతాల్లో డబ్బులేసి ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే ఈ ఎత్తుగడ వేసిందన్న సందేహాలొస్తున్నాయి. ఎందుకంటే.. బ్యాంకులకు వరుస సెలవులు రావడం కొత్తేమీ కాదు. ఎన్నికల ముందు రోజు, ఆదివారం పని చేయాల్సిన అవసరమూ లేదు. ఐదేళ్ల నుంచి లిక్కర్‌ వ్యాపారం ఇలాగే జరుగుతోంది. ఎన్నో రెండో శనివారాలు, ఆదివారాలు, వరుస సెలవులు వచ్చాయి. కానీ ఎప్పుడూ మద్యం డబ్బు డిపాజిట్‌ చేయడానికి ఆదివారం బ్యాంకులు పనిచేయాలని కోరలేదు. మరి... పోలింగ్‌కు ముందురోజు మాత్రం పని చేయాలని కోరడంలో ఆంతర్యం ఏమిటి? ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కోర్టుకెళ్లింది. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. దానిపై గురువారం జరిగే విచారణ ఒక కొలిక్కి రాకముందే ప్రభు త్వం తమ సొంత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, ఖాతాల్లో డబ్బులేయడానికి గురు, శుక్ర, శనివారం వరకు సమయం ఉంది. కానీ సరిగ్గా పోలింగ్‌కి ఒక్కరోజు ముందు సెలవు రోజైన ఆదివారం, కుదిరితే పోలింగ్‌ రోజు సోమవారం కూడా ఖాతాల్లో డబ్బులేయడం ఓటర్లను ప్రభావితం చేయడం కాదా? అనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ పంపిణీ ప్రక్రియ ఆగిపోతే ఇందుకు టీడీపీయే కారణమని బురదజెల్లేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. పింఛన్ల విషయంలోనూ వైసీపీ ఇలాగే వ్యవహరించిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ఈసీని సంప్రదించారా ?

పోలింగ్‌కి ఒక్కరోజు ముందు రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయాలంటూ ఆదేశాలిచ్చేముందు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం సంప్రదించిందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్‌ రాకముందు బటన్‌ నొక్కిన పథకాలకు నెలన్నర తర్వాత డబ్బులేసేందుకు అనుమతివ్వండంటూ సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఈసీని సంప్రదించారు. మరి పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ప్రజల ఖాతాలో డబ్బులేసేందుకు అనుకూలంగా బ్యాంకులను పనిచేయమని అడుగుతున్న ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారా? ఈసీ అనుమతితోనే బ్యాంకులకు ఆ రకమైన ఆదేశాలు జారీ చేశారా? లేదా జగన్‌ సర్కార్‌ సొంత రాజ్యాంగం అమలు చేయడానికే బరితెగించిందా?


ఆ 7,000 కోట్లు విదేశీ అప్పేనా?

పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఖాతాల్లో డబ్బులేయడానికి ప్రభుత్వం అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు అడ్డగోలు అప్పులతో రాష్ట్రాన్ని నిండా ముంచేసిన జగన్‌ సర్కార్‌ ఇప్పుడు కూడా పరిమితికి మించి అప్పులు చేస్తోంది. 37 రోజుల్లో రూ.13,000 కోట్ల అప్పులు తెచ్చింది. మరో రూ.7,000 కోట్ల అప్పులు తెస్తోంది. ఏపీఎండీసీలో వాటాలు విదేశీ ఇన్వెస్టర్‌కు అమ్మడం ద్వారా ఈ రుణం తీసుకురానుంది. ఈ నెల 2వ తేదీన స్టాక్‌మార్కెట్లో ఏపీఎండీసీ ద్వారా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు జారీ చేసి రూ.7,000 కోట్లు విదేశీ అప్పు తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ అప్పు ఒకట్రెండు రోజుల్లో ఏపీఎండీసీ ఖాతాకు చేరుతుందని ప్రభుత్వ అంచనా. మంగళవారం ఆర్‌బీఐ ద్వారా రూ.3,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఈ రూ.10,000 కోట్లను పోలింగ్‌కు ముందురోజు బ్యాంకుల ద్వారా ఖాతాల్లో వేయడానికి సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు రావత్‌, సత్యనారాయ ణ బరితెగించారు. మంగళవారం కృష్ణానదిలో వీఐపీ బోటు లో షికారు చేస్తూ జరిపిన రహస్య మంతనాలు కూడా ఇవే.

పింఛన్లపై ఈ శ్రద్ధ లేదెందుకో?

సెలవు రోజైనా సరే బ్యాంకులు పనిచేయించేలా ఆదేశాలిచ్చిన ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లపై ఈ శ్రద్ధ ఎందుకు చూపలేదు? ఏప్రిల్‌లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పి 32 మంది ప్రాణాలు బలిగొన్నారు. మేలో బ్యాంకుల చుట్టూ తిప్పి వారిని ముప్పుతిప్పలు పెట్టారు. వృద్ధాప్య పింఛన్లను మొదటిప్రాధాన్యంగా తీసుకొని ఇవ్వాలని బ్యాంకులను ఎందుకు ఆదేశించలేదు? వృద్ధులు ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటికీ కారణం చంద్రబాబే అని చెప్పడం కోస మే జగన్‌ ప్రభుత్వం అలా వ్యవహరించింది. కోడ్‌కు ముందే జగన్‌ బటన్‌ నొక్కినా లబ్ధిదారులకు ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేసి, ఇప్పుడు పోలింగ్‌ ముందురోజు ఖాతాల్లో వేసి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారు. అంటే.. జనం ఎన్ని ఇబ్బందులు పడినా జగన్‌కు రాజకీయ ప్రయోజనమే ముఖ్యం. ఏదైనా కారణంతో డబ్బుల పంపిణీ ఆగిపోతే ఇందుకు చంద్రబాబే కారణమని నిందించడానికి కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.

Updated Date - May 09 , 2024 | 09:42 AM