Share News

Bharat Bandh: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో నేడు జరగాల్సిన పీజీ, డిగ్రీ పరీక్షలు వాయిదా

ABN , Publish Date - Aug 21 , 2024 | 08:42 AM

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు మార్గంసుగుమం చేస్తూ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ‘రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి’ పిలుపు మేరకు ‘భారత్ బంద్’ కొనసాగుతోంది.

Bharat Bandh: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో నేడు జరగాల్సిన పీజీ, డిగ్రీ పరీక్షలు వాయిదా
Bharat Bandh

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు మార్గంసుగుమం చేస్తూ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ‘రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి’ పిలుపు మేరకు ‘భారత్ బంద్’ కొనసాగుతోంది. అయితే రాజస్థాన్‌లో మాత్రమే బంద్ ప్రభావం కనిపిస్తోంది. మిగతా ఎక్కడా ఆ ప్రభావం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ చాలా పాక్షికంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు సైతం యథావిథిగా నడుస్తున్నాయి.


ఎస్‌సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి ఆధ్వర్యంలో కృష్ణ జిల్లా మచిలీపట్నంలో దళిత సంఘ నాయకులు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి బస్‌లు కదలకుండా నిలిపివేశారు. అయితే ఎలాంటి లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్ స్టాండ్ ఎదుట భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐకమత్యం పోతుందని, ఉద్యోగాల్లో దళితులకు అన్యాయం జరుగుతుందని దళిత సంఘాల నాయకులు చెప్పారు. సుప్రీంకోర్ట్ ఈ అంశంపై పునరాలోచన చేయాలని కోరుతున్నామని వారు తెలిపారు.


పీజీ, డిగ్రీ పరీక్షలు వాయిదా..

భారత్ బంద్ ప్రభావంతో ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఇవాళ (బుధవారం) జరగాల్సిన పీజీ, డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్ బంద్ కారణంగా వాయిదా వేసినట్టు ఏయూ అధికారులు ప్రకటించారు. తిరిగి పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.


కోనసీమ జిల్లాలో మాల మహానాడు బంద్ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నాయకులు ఆందోళన చేపడుతున్నారు. బస్సులను నాయకులు నిలిపివేశారు.


సిద్దిపేట బస్ డిపో వద్ద ధర్నా

సిద్దిపేట: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపు మేరకు సిద్ధిపేట బస్ డిపో వద్ద బస్సులు బయటకు రానీయకుండా పలు దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Aug 21 , 2024 | 09:07 AM