Share News

నేహారెడ్డి వ్యాజ్యం సింగిల్‌ జడ్జి విచారించడమే సబబు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:17 AM

హైకో ర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా విశాఖపట్నం జిల్లా,

నేహారెడ్డి వ్యాజ్యం సింగిల్‌ జడ్జి విచారించడమే సబబు

ఆమేరకు చర్యలు తీసుకోండి... రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం

అధికారుల ఉత్తర్వులు చట్టాలకు లోబడి లేకుంటే కోర్టులో సవాల్‌ చేసే హక్కు పిటిషనర్‌కు ఉంది

కేసులో ప్రతివాదిగా చేరేందుకు మూర్తి యాదవ్‌కు వెసులుబాటు

‘పిల్‌’పై విచారణ 4 వారాలకు వాయిదా

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): హైకో ర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జడ్‌ నిబంధనలను ఉల్లంఘించి సముద్రానికి అతిసమీపంలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు జీవీఎంసీ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ ఈ నెల 18న తుది ఉత్తర్వులను జారీ చేశారు. వాటిని సవాల్‌ చేస్తూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి విచారించడమే సబబు అని సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం అభిప్రాయపడింది. సీఆర్‌జడ్‌ ప్రాంతంలో జరుపుతున్న శాశ్వత నిర్మాణాలను నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని, యంత్రాలను సీజ్‌ చేయాలని తాము ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగానే అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేసింది. అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు సంబంధిత చట్టాలకు లోబడి లేకుంటే వాటిని న్యాయస్థానం ముందు సవాల్‌ చేసే హక్కు పిటిషనర్‌కు ఉందని తెలిపింది. ఈ నేపఽథ్యంలో జీవీఎంసీ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ వేసిన వ్యా జ్యాన్ని సింగిల్‌ జడ్జి విచారించడమే సబబు అని పేర్కొంది. సీఆర్‌జడ్‌ ప్రాం తంలో నిర్మాణాలను సవాల్‌ చేస్తూ పిల్‌ దాఖలు చేసిన జనసేన కార్పోరేటర్‌ మూర్తి యాదవ్‌కు, నేహారెడ్డి దాఖలు చేసిన రిట్‌లో ప్రతివాదిగా చేరేందుకు వెసులుబాటు కల్పించింది. పిల్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నేహారెడ్డి వ్యాజ్యం సింగిల్‌ జడ్జి వద్ద విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడి న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jul 27 , 2024 | 07:08 AM